వర్రా రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:44 AM
వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కో-కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డి జ్యుడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది.
పోలీసు కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ
కడప రూరల్, నవంబరు 25: వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కో-కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డి జ్యుడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా మరికొందరిపై వర్రా సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంలో పులివెందుల పోలీసులు వర్రాను అరెస్టు చేసి 11న కోర్టులో హాజరుపరచగా జడ్జి 25వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. రిమాండ్ గడువు సోమవారం ముగియడంతో కడప నాల్గవ అదనపు జిల్లా కోర్టు (ఎస్సీ, ఎస్టీ కోర్టు) మరో రెండు వారాలు పొడిగించింది. అతడిని విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ జరుపనుంది. దీనిపై 20న జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయాధికారి దీనబాబు తదుపరి ఆదేశాల కోసం 22వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఆయన సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జిని ఇన్‌చార్జిగా నియమించారు.
దీంతో ఆయన సదరు కేసు పూర్వాపరాలను పూర్తిగా తెలుసుకోవడానికి 26వ తేదీకి వాయిదా వేశారు. కాగా.. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా రవీంద్రరెడ్డిపై కాకినాడ కోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి అక్కడి న్యాయాధికారి సోమవారం అతడిని వర్చువల్‌గా విచారించినట్లు తెలిసింది. ఇంకోవైపు.. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కడప ఎస్సీ, ఎస్టీ కోర్టు(నాల్గవ అదనపు జిల్లా కోర్టు) బుధవారానికి వాయిదా వేసింది.