AP Govt : మిట్టల్ ఉక్కుకు ఓకే !
ABN , Publish Date - Nov 27 , 2024 | 05:38 AM
ఉత్తరాంధ్ర సిగలో మరో కలికితురాయి. విశాఖ నగరానికి సమీపాన అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద భారీ పెట్టుబడితో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
నక్కపల్లి వద్ద పట్టాలెక్కనున్న ఆర్సెలర్-నిప్పన్ ప్లాంట్
1,47,162 కోట్ల పెట్టుబడి.. 2 దశల్లో ప్రాజెక్టు
2029 జనవరి నాటికి మొదటి దశ
2033కల్లా రెండో దశ పూర్తి
61 వేల మందికి ఉపాధి అవకాశాలు
ప్లాంట్, క్యాప్టివ్ పోర్టు, టౌన్‌షి్‌పల కోసం
6,756 ఎకరాల భూమికి అభ్యర్థన
బల్క్‌డ్రగ్ పార్క్ పరిధిలోని 700 ఎకరాల
బదలాయింపునకు ప్రభుత్వ అంగీకారం
మిగిలిన భూముల సేకరణకు ఏపీఐఐసీకి అనుమతి
కొత్త ప్లాంట్‌కు నూతన పారిశ్రామిక పాలసీ కింద
ప్రోత్సాహకాలు, సౌకర్యాలు
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సిగలో మరో కలికితురాయి. విశాఖ నగరానికి సమీపాన అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద భారీ పెట్టుబడితో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నూతన పారిశామ్రిక అభివృద్ధి విధానం (4.0) ప్రకారం ఈ భారీ ప్రాజెక్టుకు అనుకూలమైన ప్రోత్సాహకాలు, నిర్దిష్ట సౌకర్యాలు కల్పించడంతోపాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో.. అనుకున్న సమయానికి దీనిని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత ఉక్కు తయారీ సంస్థలుగా పేరున్న ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా ఏఎంఎన్‌ఎ్‌సఐగా ఏర్పడి జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, డీఎల్ పురం, వేంపాడు, బుచ్చిరాజుపేట, చందనాడ గ్రామాల పరిధిలో క్యాప్టివ్ పోర్టు ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.1,47,162 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో దీనిని చేపట్టనున్నారు.
2029 జనవరి నాటికి తొలి దశ, 2033 నాటికి రెండో దశగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 61 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొంది. స్టీల్ ప్లాంట్‌తోపాటు క్యాప్టివ్ పోర్టు, టౌన్‌షి్‌పలకు కలిపి మొత్తం 6,756 ఎకరాల భూమితో ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం ముందుకు తీసుకొచ్చారు. అక్కడ సవివరంగా చర్చించిన అనంతరం ఏఎంఎన్‌ఎ్‌సఐ సంస్థకు నిర్దిష్టమైన ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని విస్తరించడానికి ఎస్‌ఐపీబీ సిఫారసు చేసింది. దానిని పరిశీలించిన తర్వాత ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని అందించడానికి పరిపాలనాపరమైన అనుమతినిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
బల్క్‌డ్రగ్ పార్క్ భూములు బదలాయింపు
స్టీల్ ప్లాంట్ తొలిదశ కోసం 2,200 ఎకరాల భూమిని కేటాయించాలన్న ఏఎంఎన్‌ఎ్‌సఐ వినతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించిన భూముల్లో సుమారు 700 ఎకరాలను దానికి బదిలీ చేయాలని నిర్ణయించింది (కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ కోసం దాదాపు 710 ఎకరాల ప్రత్యామ్నాయ భూములను గుర్తించి కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది). మిగతా భూములను సేకరించి ఇచ్చేందుకు అంగీకరించింది. టౌన్‌షిప్ నిర్మాణం కోసం ఇంకో 440 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా సేకరించేందుకు ఆమోదం తెలిపింది. తొలి దశ సివిల్ వర్క్‌లు పూర్తిచేసి యంత్ర పరికరాలను అమర్చాక.. ఆయా పనుల పురోగతిని బట్టి రెండో దశ ప్రాజెక్టుకు, క్యాప్టివ్ పోర్టుకు భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఏపీ ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ పాలసీ 4.0 (2024-29) ప్రకారం.. ఆర్థిక ప్రోత్సాహకాలు, 50 శాతం మూలధన రాయితీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, పదేళ్లపాటు నీటి సరఫరా, 15 ఏళ్ల పాటు ఈడీ మినహాయుంపు, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఇంకా విద్యుత్తు, నీరు, రైలు, రోడ్డు కనెక్టివిటీ, సమీపంలోని క్వారీల వినియోగం, నిబంఽధనల ప్రకారం ఎన్‌ఎండీసీతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ముడి ఖనిజం వినియోగం తదితర ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది.