Share News

AP Govt : కోస్తా రోడ్ల పునర్నిర్మాణం!

ABN , Publish Date - Nov 26 , 2024 | 05:20 AM

ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో మరమ్మతులకు కూడా వీల్లేని విధంగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యం లో 1,447 కిలోమీటర్ల మేర వాటిని పునర్నిర్మించాల ని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

AP Govt : కోస్తా రోడ్ల పునర్నిర్మాణం!

  • ఇందుకోసం 650 కోట్ల నాబార్డు నిధులు.. రహదారులపై సమీక్షలో సీఎం హామీ

  • రిపేర్‌కూ వీల్లేనంతగా రోడ్ల ధ్వంసం.. 1,447 కిమీ మేర తిరిగి వేయాల్సిందే

  • మంత్రి జనార్దన్‌రెడ్డి ప్రజెంటేషన్‌.. సంక్రాంతి నాటికి గుంతల రహితంగా రోడ్లు

  • గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి నిధులతో 13 వేల కిమీ అంతర్గత రోడ్లకు ఓకే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో మరమ్మతులకు కూడా వీల్లేని విధంగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యం లో 1,447 కిలోమీటర్ల మేర వాటిని పునర్నిర్మించాల ని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.650 కోట్ల నాబార్డు నిధులు అందించేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ రహదారుల పునర్నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రోడ్లు-భవనాల శాఖకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రోడ్లపై సోమవా రం రాత్రి సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, అధికారులతో సమీక్షచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లపై గుంతలు పూడ్చేందుకు వివిధ పద్దుల కింద రూ. 861 కోట్లు కేటాయించారు. ఆర్‌అండ్‌బీ ఇప్పటి వరకు 1,991 కిమీ మేర గుంతలు పూడ్చినట్లు మంత్రి జనార్దన్‌రెడ్డి సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జగన్‌ పాలనలో దెబ్బతిన్నవి, ఇటీవలకురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంస మై మరమ్మతులకు ఏమాత్రం వీలుకాని రోడ్లు 1,447 కిమీ వరకు ఉన్నాయని.. వాటిని పునర్నిర్మిస్తే తప్ప ప్రజలకు రహదారి సదుపాయం మెరుగ్గా కల్పించలేమని నివేదించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కొన్ని రోడ్లు దారుణంగా ఉన్నాయని, వాటిపై ద్విచక్రవాహనాలు కూడా నడిపే పరిస్థితి లేనంతగా ధ్వంసమయ్యాయని.. వాటిని మళ్లీ నిర్మించడమే ఏకైక ప్రత్యామ్నాయమని క్వాలి టీ కంట్రోల్‌ నిపుణులు తేల్చారని ఫొటోలు, వీడియో క్లిప్స్‌ ద్వారా సీఎంకు వివరించారు. ఆ రహదారులు కోస్తా ప్రాంతానికి కీలకమైనవన్నారు.


వీటికి నిధులెలా సమకూర్చాలన్న అంశం చర్చకొచ్చింది. ప్రభుత్వం వద్ద ఉన్న నాబార్డు నిధుల్లో నుంచి 650 కోట్లు ఇస్తామని సీఎం తెలిపారు. ‘ఉత్తరాంధ్ర అయినా, కోస్తాంధ్ర అయినా, రాయలసీమలో రహదారులు దెబ్బతిన్నా యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలి. పైగా వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం. జగన్‌ పాలనలో ఐదేళ్లు వేటినీ పట్లించుకోలేదు. కాబట్టి ఇదే స్పీడులో వాటిని కూడా బాగుచేద్దాం’ అని ఆయన అన్నట్లు తెలిసింది. కాగా.. రాష్ట్రంలో రోడ్లపై గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని సంక్రాంతి నాటికి పూర్తిచేసి, ప్రజలకు పండుగ కానుకగా గుంతల రహిత రోడ్లు ఇవ్వాలని సీఎం ఆర్‌అండ్‌ బీని ఆదేశించారు. క్వాలిటీ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

  • భారీ వాహనాల నుంచే టోల్‌!

రాష్ట్ర ప్రధాన రహదారుల(స్టేట్‌ హైవే్‌స)ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న అంశంపైనా సీఎం సమక్షంలో చర్చ జరిగింది. గతంలో జాతీయ రహదారులను బాగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి టోల్‌గేట్లు ఏర్పాటుచేస్తే ప్రజలు స్వాగతించారని గుర్తుచేశారు. స్టేట్‌ హైవేలను కూడా అభివృద్ధి చేసి భారీ వాహనాల నుంచి మాత్రమే టోల్‌ వసూలు చేసేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు రుసుము ఉండకూడదన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 05:20 AM