Share News

వైసీపీ హయాంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు

ABN , Publish Date - Nov 24 , 2024 | 05:14 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసేవారికి కఠిన శిక్షలు పడతాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం వచ్చిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

వైసీపీ హయాంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు

  • జగన్‌ పార్టీలో లెక్కకు మించి భూ రాబందులు

  • కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం: టీడీపీ

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసేవారికి కఠిన శిక్షలు పడతాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం వచ్చిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. శనివారం ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్య విలేకరులతో మాట్లాడారు. ‘‘కొత్తగా తెచ్చిన భూ దురాక్రమణ నిరోధక చట్టం ప్రకారం భూములు కబ్జా చేస్తే పది నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు భారీ జరిమానాలు పడతాయి. అధికారులు ఎవరైనా దీనికి సహకరిస్తే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. పేదలు, సామాన్యుల భూములకు రక్షణ కల్పించడానికే కూటమి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. జగన్‌రెడ్డి హయాంలో రాష్ట్రం నలుమూలలా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రికి రాత్రి భూమి రికార్డులు మార్చివేసి భూములు కొట్టేశారు. ఉత్తరాంధ్రలో వైసీపీ మాజీ మంత్రి బొత్స కుటుంబం 2,000 ఎకరాల భూమిని కొట్టేసిందన్న ఆరోపణలు వచ్చాయి.

అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్‌ రూ.30 కోట్ల విలువైన 160 ఎకరాల భూములను కొట్టేసి తన భర్త పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే... ‘గుడ్‌మార్నింగ్‌’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకొంటూ మరో పక్క భూములు మింగేశారు. ఇటువంటి భూ రాబందులకు వైసీపీలో లెక్కే లేదు. వీరి చేతుల్లో చిక్కుకొన్న భూములను వెనక్కు తీసుకోవడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. సామాన్యుల హక్కులను కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా జగన్‌రెడ్డి ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆనంద్‌ సూర్య విమర్శించారు.

Updated Date - Nov 24 , 2024 | 05:14 AM