Share News

Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:00 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది...

Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో (Nellore Central Jail) ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు (AP High Court) బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారీ హైకోర్టు షాకివ్వగా.. శుక్రవారం మధ్యాహ్నం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 50 వేల రూపాయలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.


ap high court.jpg

కండిషన్స్ అప్లై..!

పూచీకత్తులతో పాటు.. పాస్ పోర్టును సరెండర్ చేయాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. ప్రతి వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కూడా క్లియర్ కట్‌గా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. పిన్నెల్లి రిలీజ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడంతో పాటు.. బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాగా.. గత రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులోనే ఉన్న పిన్నెల్లికి ఇవాళ బెయిల్ రావడంతో వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు.


Pinnelli-Vidwmsa.jpg

అసలేం జరిగింది..?

ఏపీ ఎన్నికలు జరిగిన మే-13న పాల్వాయి గేటు 202 పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించిన పిన్నెల్లి.. ఈవీఎం ధ్వంసం చేశారు. ఇదేంటి..? ఎందుకిలా దౌర్జన్యం చేస్తున్నారని అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనపై పిన్నెల్లిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణ స్వామిపై రాయితో దాడి చేశారు. ఈ ఉదంతంపై కేసు నమోదైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సినిమాటిక్ రేంజ్‌లో ఛేజ్ చేసి పిన్నెల్లిని పట్టుకున్నారు. రామకృష్ణారెడ్డి పోలీసులకు దొరకగా.. ఇంతవరకూ ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి అడ్రస్ లేదు.


Pinnelli-High-Court.jpg

తెలియదు.. గుర్తు లేదు..!

అరెస్ట్ అనంతరం నెల్లూరు జైల్లో ఉన్న రామకృష్ణా రెడ్డి నుంచి.. ఈ కేసులకు సంబంధించి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో పల్నాడు పోలీసులు నెల్లూరు జైలుకు వెళ్లి విచారణ సమయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. పిన్నెల్లిని 50 ప్రశ్నలు అడగ్గా 30 ప్రశ్నలకు పైగా నేను వెళ్లలేదు.. వారెవరో నాకు తెలియదు.. అనే సమాధానాలు చెప్పినట్లు నాడు పెద్ద ఎత్తునే వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు.. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎం పగులగొట్టలేదని, అసలు నంబూరి శేషగిరిరావు ఎవరో తెలియదని, ఆరోజు తన వెంట గన్ మెన్ కూడా లేరని, పోలీసుల విచారణలో పిన్నెల్లి చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు పిటిషన్లు దరఖాస్తు చేసుకున్నావరుస ఎదురుదెబ్బలు తగలగా.. ఇవాళ బెయిల్ ఇచ్చింది హైకోర్టు.

Updated Date - Aug 23 , 2024 | 03:42 PM