Business Hub : మారిటైం హబ్‌గా ఏపీ
ABN , Publish Date - Dec 04 , 2024 | 06:06 AM
ఏపీ ఐటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ: అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు నేడు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి.
కేబినెట్ ఆమోదించిన పాలసీలు
ఏపీ ఐటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ: అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు నేడు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి. సాంకేతిక వ్యాపార పరిభాషలో వీటిని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు(జీసీసీ)గా పేర్కొంటారు. రిమెట్ వర్క్, హైబ్రీడ్ వర్క్, కో వర్కింగ్ స్పేస్‌ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడళ్లను ఉపయోగించుకోవడం ఈ పాలసీ లక్ష్యం. నూతన ఆవిష్కరణలు, గిగ్ ఎకానమీ, వ్యవస్థాపకత, స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఎత్తున సాంకేతిక ఆధారిత విద్యార్థులను, ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్‌ను ఉపయోగించుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి తదితర కేంద్రాల్లో వర్క్ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుబంధంగా గ్రామాల్లో, మండలాల్లో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్లు పని చేస్తాయి. కనీసం 100 సీట్ల నుంచి 10 వేల చదరపు అడుగులతో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్లు అభివృద్ధి పర్చే వారికి పెట్టబడిలో 50ు రాయితీ ఇవ్వనుంది. గరిష్ఠంగా రూ.2 వేలను ఒక చదరపు అడుగుకు రాయితీగా ఇవ్వనుంది. వందమందికి వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే రూ.2 లక్షలను ఆరు మాసాలకు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. 5 లక్షల చదరపు అడుగుల ప్లోర్ ఏరియాపైబడిన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసే వారికి పెట్టబడిలో 50% రాయితీ, ఐదు సంవత్సరాల్లో ప్రతి స్క్వేర్ ఫీట్‌కు రూ.2000 వేలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు, వారు అత్యధిక జీత భత్యాలు పొందేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది.
ఏపీ టెక్స్ టైల్, అపెరల్, గార్మెంట్ పాలసీ4.0: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా దీనిని రూపొందించారు. 2024-29 మధ్య రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని 1 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పద్మశాలీలు, చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) 5 కొత్త సమగ్ర టెక్స్‌టైల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. టెక్స్‌టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎ్‌సఎంఈలకు 30ు, మద్య తరహా పార్కులకు 20ు, భారీ పార్కులకు 25ు పెట్టుబడి రాయితీ అందిస్తారు.
మారిటైమ్ పాలసీ 4.0: 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ఈ పాలసీని రూపొందించారు. ఈ విషయంలో గుజరాత్ ప్రథమ స్థానంలో, ఏపీ 2వ స్థానంలో ఉంది. పోర్టుల అభివృద్ధితోపాటు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. షిప్ నిర్మాణ పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తారు. రాష్ట్రంలో ఒక మెగా షిప్ యార్డును ఏర్పాటు చేయనున్నారు. పోర్టుల్లో సరకు నిల్వ, నౌకల నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు రోడ్లు, రైలు కారిడార్లను అనుసంధానిస్తారు.
గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులు: గ్రామీణ నీటి సరఫరాకు చెందిన 24 నెలల కాంట్రాక్టు పీరియడ్ ఉన్న కొన్ని తాగునీటి సరఫరా ప్రాజెక్టు వ్యయాల పెంపునకు జారీ చేసిన జీవో 62కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, కడప జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గాల్లో 3 నీటి సరఫరా ప్రాజెక్టుల వ్యయాలను పెంచనున్నారు. ఈ ప్రాజెక్టులను కొనసాగించడం ద్వారా నీటి సమస్యను పరిష్కరిస్తారు. వీటి ద్వారా 10.37 లక్షల మంది ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది.
పీఎం ఆవాస్ యోజన గ్రామీణం: ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్(పీఎం-జన్‌మన్) పథకాలను ప్రస్తుత యూనిట్ విలువ, పద్ధతితో కొనసాగించడానికి, పెండింగ్‌లో ఉన్న గృహాలను పూర్తి చేయనున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయనున్నారు. పీఎంఏవై అర్బన్ 1.0 పథకం కొనసాగింపు, ప్రస్తుత యూనిట్ ధరతో ఇళ్లను పూర్తి చేయడం, డ్రోన్‌లను ఉపయోగించి పెద్ద లేఅవుట్లలో నాణ్యత పరీక్షలు, డిస్కమ్‌లు, పంచాయతీరాజ్, ఎంఏయూడీ విభాగాల సమన్వయంతో హౌసింగ్ కాలనీల్లో మౌలికవసతుల కల్పన చేపడతారు.
ఇళ్ల నిర్మాణం: ఈ నెలాఖరు నాటికి ఆయా పథకాల కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే నిబంధన ఉన్నప్పటికీ 2026, మార్చి వరకు గడువు ఇచ్చారు. అర్బన్‌లో 6.41 లక్షలు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లు పూర్తి చేయనున్నారు.
ఏపీ టూరిజం కల్చర్ పాలసీ: 2024-29 సమగ్ర పర్యాటక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ క్రీడల పాలసీ 2024-29 సవరణలకు కూడా పచ్చజెండా ఊపింది. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేలా భారీ పెట్టుబడులు రాబట్టనున్నారు. కేంద్ర పథకాల అమలుకు తోడు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్‌నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ క్రీడల పాలసీ: 2024-29 ఏపీ క్రీడల పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మెడికల్ పాలసీ: ఏపీ ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1956, మార్చడంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020కి అనుగుణంగా బోర్డును పునర్నిర్మించడానికి కేబినెట్ ఆమోదం. ప్రస్తుతం ఉన్న ఆంధ్రా బోర్డు ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌గా పిలుస్తారు. అదేవిధంగా ఆంధ్రా బోర్డు ఫర్ హోమియోపతిని ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పేర్కొంటారు.
ఏపీ సస్టైనబుల్ ఎలక్ర్టిక్ మొబిలిటీ పాలసీ: అమరావతిని ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాయితీలు ప్రకటించారు.
రియల్‌టైమ్ గవర్నెన్స్: రియల్‌టైమ్ గవర్నెన్స్ 4.0 అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో దీనిని ప్రతిపాదించారు. వాట్సాప్ ద్వారా ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. డాటా ఇంటిగ్రేషన్, అనలటిక్స్, గవర్నెన్స్ హబ్‌గా తీర్చిదిద్దుతారు.
రాజధాని నిర్మాణాలు: అమరావతి రాజధాని అభివృద్ధికి ప్రతిపాధించిన 20 ఇంజనీరింగ్ పనులను రూ.11,467.27 కోట్లతో చేపట్టనున్నారు.
డిసెంబరు 15న ఆత్మార్పణ దినం: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబరు 15న ఆత్మార్పణ దినంగా పాటిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణకు మార్గదర్శకాలు రూపొందిస్తారు. పొట్టి శ్రీరాములు జన్మ స్థలంలోని ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దుతారు.
జలజీవన్ మిషన్: రూ.51 వేల కోట్ల ప్రాజెక్టు అయిన జల్‌జీవన్ మిషన్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఈ మిషన్‌పై కేంద్రంతో చర్చించి అమలయ్యేలా చూడనున్నారు.