Home Minister Anita : పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:08 AM
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారంపై న్యాయ, పోలీసుశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని న్యాయశాఖ..
పోలీసు-న్యాయుశాఖ సమన్వయంతో సాగాలి
ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులపై మంత్రులు ఫరూక్, అనిత సమీక్ష
అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారంపై న్యాయ, పోలీసుశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక కోర్టుల పనితీరుపై శుక్రవారం అమరావతి సచివాలయంలో ముఖ్య అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. కేసుల తీవ్రతను బట్టి, ఏ ఉద్దేశంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నాయో అందుకు అనుగుణంగా ఆయా కోర్టుల్లోని కేసులు ఎక్కువ కాలం కొనసాగకుండా వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేటట్లుగా ముందుకు సాగాలన్నారు. అవసరమైతే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశానుసారం సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టలని సూచించారు. ముఖ్యంగా సంచలన కేసుల్లో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయ పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ కోర్టు, ప్రత్యేక కోర్టు లు మరింత వేగంగా పని చేయాలని సూచించారు. సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి, హోంశాఖ కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారు.