Share News

పులివెందుల స్టేషన్‌లో వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు

ABN , Publish Date - Nov 26 , 2024 | 05:51 AM

టీడీపీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, మహిళా నేతలు, జనసేన, కాంగ్రెస్‌ నేతలపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లను పోలీసులు విచారిస్తున్నారు.

పులివెందుల స్టేషన్‌లో వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు

కడప క్రైం, చీరాలటౌన్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, మహిళా నేతలు, జనసేన, కాంగ్రెస్‌ నేతలపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లను పోలీసులు విచారిస్తున్నారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ ఆధ్వర్యంలో కడప సైబర్‌క్రైం పోలీసుస్టేషన్‌లో సోమవారం విజయవాడకు చెందిన ఆనం నరేంద్రరెడ్డి, తిరుపతికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిలను పోలీసులు విచారించారు. ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డిల కోసం ప్రత్యేక టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం కూడా ఆనం నరేంద్రరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డిలను విచారించనున్నారు. కాగా సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో ఇప్పటికే పులివెందుల పోలీసులు పలువురికి నోటీసులు జారీచేశారు.

బాపట్ల జిల్లా పోలీసుల అదుపులో మరో నిందితుడు

తాడేపల్లికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త మేకా వెంకటరామిరెడ్డిని బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం ఒంగోలు జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టడంతో అతనిపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - Nov 26 , 2024 | 05:51 AM