Share News

Pawan Kalyan : బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. మానవత్వ పార్టీ

ABN , Publish Date - Nov 17 , 2024 | 05:08 AM

బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని, మానవత్వ పార్టీ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan : బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. మానవత్వ పార్టీ

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో హిందువులకు రక్షణ లేదు

భారత్‌లో ఇతర మతాల హీరోలనూ అభిమానిస్తారు

దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం.. ఆ పార్టీని గెలిపించండి

మహారాష్ట్ర ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌

కుభీర్‌/మద్నూర్‌/అమరావతి, నవంబరు16(ఆంధ్రజ్యోతి): బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని, మానవత్వ పార్టీ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో హిందువులకు రక్షణ లేదని.. భారతదేశంలో మాత్రం ఇతర మతాల హీరోలను ప్రజలు అభిమానిస్తారని పేర్కొన్నారు. శనివారం మహారాష్ట్రలో వివిధ నియోజకవర్గాల్లో పవన్‌ ప్రచారంలో పాల్గొన్నారు. లాతూర్‌లో బీజేపీ అభ్యర్థి అర్చన పాటిల్‌, నాందేడ్‌ జిల్లా భోకర్‌ నియోజకవర్గం అభ్యర్థి శ్రీజయ చవాన్‌ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. లాతూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. నాందేడ్‌ జిల్లా బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీని గెలిపించాలని కోరారు. మహారాష్ట్రలో సనాతన ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే చేసిన సేవలను కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, దేశ ప్రజల కల అయోధ్య రామమందిర నిర్మాణాన్ని నెరవేర్చారని అన్నారు. 30 కోట్లమంది గ్రామీణ మహిళలకు జనధన్‌ యోజన బ్యాంకు ఖాతాలను తెరిపించి స్వయం ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 12 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ పథకాన్ని వర్తింపజేశారని తెలిపారు. పాలాజ్‌ సత్యగణేష్‌ ఆలయంలో పవన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులతో మాట్లాడి.. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. కాగా, బహిరంగ సభలో అభిమానులు కేకలు వేయడంతో ‘‘మీరంతా సరిహద్దు తెలంగాణ వాసులని అర్థమైంది’’అని పవన్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ గడ్డ అని కొనియాడుతూ.. బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అనే పాటను పాడారు.

మహారాష్ట్ర కర్మభూమి

మహారాష్ట్ర నేల సంస్కృతి, సంప్రదాయాల కలబోతని, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ తన పోరాట పౌరుషం నింపిన గడ్డ అని పవన్‌ అన్నారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ లాంటి మహనీయులను దేశానికి అందించిన గడ్డ మహారాష్ట్ర అని, కర్మభూమి అయిన మహారాష్ట్ర దేశానికి ఓ స్ఫూర్తి మంత్రమని పేర్కొన్నారు. పోరాటంలో ముందుండే మరాఠా ప్రజలను కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జీవితంలో పదవులు ముఖ్యం కాదని... జాతి, దేశం కోసం పాటుపడే ఆలోచన అత్యుత్తమని నమ్మే బాల్‌థాక్రే సిద్ధాంతాలు తనకు స్ఫూర్తి అని చెప్పారు.

Updated Date - Nov 17 , 2024 | 05:09 AM