AP Govt : కొత్తగా 53 జూనియర్ కళాశాలలు ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్
ABN , Publish Date - Dec 06 , 2024 | 05:30 AM
రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జూనియర్ కళాశాలలకు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా జూనియర్ కాలేజీల అవసరంపై ఇంటర్ విద్యామండలి సర్వే చేయగా..
జనాభా ఆధారంగా 37 మండలాల్లో అవసరం
రెండు పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ డిమాండ్
ఇప్పటికే రాష్ట్రంలో 3,381 కాలేజీల్లో ఇంటర్
హైస్కూల్ ప్లస్‌లలో ఇకపై జూనియర్ లెక్చరర్లు
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జూనియర్ కళాశాలలకు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా జూనియర్ కాలేజీల అవసరంపై ఇంటర్ విద్యామండలి సర్వే చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 37 మండలాల్లో 47 ఇంటర్ కళాశాలలు అవసరమని గుర్తించింది. అలాగే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని రెండు పట్టణాభివృద్ధి సంస్థల్లో మొత్తం ఆరు కాలేజీల అవసరం ఉంది. ఈ మేరకు కొత్త కాలేజీల అవసరంపై ఇంటర్ విద్యామండలి చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. కొత్తగా 53 ప్రైవేటు జూనియర్ కాలేజీల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీకి అనుమతిచ్చింది.
‘హైస్కూల్ ప్లస్’లలో మార్పులు!
ఉన్నత పాఠశాలల్లోనే ఇంటర్ విద్య అందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం 292 పాఠశాలల్లో ప్రారంభించింది. వీటికి హైస్కూల్ ప్లస్‌లుగా పేరు పెట్టింది. కానీ పూర్తిస్థాయిలో బోధనా సిబ్బందిని కేటాయించలేదు. అవే పాఠశాలల్లో అర్హత కలిగిన టీచర్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పదోన్నతి కల్పించి, వారిని ఇంటర్ బోధనకు కేటాయించింది. మరోవైపు అవసరమైన మౌలిక సదుపాయా లు కల్పించలేదు. ముఖ్య ంగా ఇంటర్‌లో ప్రాక్టికల్స్‌కు అవసరమైన ల్యాబ్ లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఏర్పాటు చేసినప్పటి నుంచి హైస్కూల్ ప్లస్‌లలో దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థను బాగుచేయాలనే ఉద్దేశంతో అక్కడ పీజీటీల స్థానంలో జూనియర్ లెక్చరర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెరుగైన ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఒకే కాంపౌండ్‌లో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ ఉండే విధంగా వాటి పేర్లు మార్చనుంది. కాగా, గత ప్రభుత్వం అనాలోచితంగా వీటిని ఏర్పాటు చేసిందని, వాటిని రద్దు చేయ డం మేలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే భారీగా జూనియర్ కాలేజీలు
రాష్ట్రంలో ఇప్పటికే 3,381 విద్యాసంస్థలు ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. అందులో 2వేలకు పైగా ప్రైవేటు కాలేజీలు, 470 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. ఇవి కాకుండా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, హైస్కూల్ ప్లస్‌లు, సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ సంస్థల పరిధిలోని కాలేజీలు ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. భారీగా సంఖ్యలో కాలేజీలున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కాలేజీల అవసరం ఏర్పడుతోంది. పదో తరగతి పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా కొత్త కాలేజీలు, అదనపు సీట్ల అవసరం కూడా ఏర్పడుతోంది. ప్రస్తుతం సుమారు 10 లక్షల మంది రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్నారు.
ఎక్కడెక్కడ అవసరం అంటే..?
అల్లూరి జిల్లాలోని అనంతగిరి, కూనవరం, అనకాపల్లిలో మాడుగుల, రవికమతం, రాంబిల్లి, నక్కపల్లి, పరవాడ, అనంతపురం జిల్లాలో రాప్తాడు, యాడికి, బాపట్లలో సంతమాగులూరు, వేటపాలెం, కోనసీమలో ఐ.పోలవరం, కపిలేశ్వరపురం, రాయవరం, ఏలూరు జిల్లా లో టి.నర్సాపురం, ముసునూరు, గుంటూరులో మేడికొండూరు, కాకినాడలో కరప, కొత్తపల్లి, తొండంగి, కృష్ణాలో బాపులపాడు, గుడ్లవల్లేరు, దేవనకొండ, నంద్యాలలో పేపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో చందర్లపాడు, పల్నాడులో క్రోసూరు, నాదెండ్ల, ఎడ్లపాడు, ప్రకాశంలో కొత్తపట్నం, కురిచేడు, పెద్దారవీడు, తాళ్లూరు, వెలిగండ్ల, పశ్చిమగోదావరి లో మొగల్తూరు, కడపలో మైలవరం, గోపవరం ప్రాంతాల్లో కొత్త కాలేజీలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి యూడీఏలో రెండు, గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి యూడీఏల్లో నాలుగు కాలేజీలు అవసరమని గుర్తించారు.