AP Govt : ‘ఈగల్’ సైన్యం సిద్ధం
ABN , Publish Date - Nov 29 , 2024 | 03:19 AM
రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గంజాయి పంట నుంచి అది చేరే గమ్యం వరకూ అడుగడుగునా ‘ఈగల్’ సైన్యాన్ని వేటకు దించింది.
గంజాయి కట్టడికి 459 మందితో ప్రత్యేక పోలీసు బృందం
అధిపతిగా ఐజీ ర్యాంకు అధికారి ఆకే రవికృష్ణ
ప్రతి జిల్లాలో ఈగల్ సెల్..ఐదు ప్రత్యేక కోర్టులు
మత్తు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం
సాగు నుంచి వినియోగం వరకూ ఉక్కుపాదం
ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ‘మహా సంకల్పం’ సభలు
డ్రగ్స్ సమాచారం ఇచ్చేందుకు1972 టోల్ ఫ్రీ నంబర్
అహర్నిశలు శ్రమిస్తాం: రవికృష్ణ
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగైన గంజాయి తోటలు ఇకపై కనిపించకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అక్రమ రవాణా చేసిన వాహనాలు ఇకపై కదలడానికి వీల్లేదని స్పష్టం చేసింది. స్మగ్లర్లు రాష్ట్రంలో ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశంలేదని తీర్మానించింది. మత్తు పదార్థాల విక్రయాలనే మాటే వినిపించరాదని.. వినియోగం వాసనే రాకూడదంటూ స్పష్టం చేసింది. దీనికోసం గద్దల్లా వేటాడే ‘ఈగల్’ సైన్యాన్ని సిద్ధం చేసింది. ఈ సైన్యంతో గంజాయి స్మగ్లర్ల పీచమణచడానికి కార్యక్షేత్రంలోకి దిగింది.
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి సాగు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గంజాయి పంట నుంచి అది చేరే గమ్యం వరకూ అడుగడుగునా ‘ఈగల్’ సైన్యాన్ని వేటకు దించింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నార్కోటిక్ పోలీసు స్టేషన్.. విశాఖ, పాడేరు, అమరావతిలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ విభాగాలు.. 26 జిల్లాల్లో ఈగల్ సెల్స్.. ఐదు ప్రధాన నగరాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు గురువారం పచ్చజెండా ఊపింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఏపీ పేరు గత ఐదేళ్లుగా వినిపించేది. రాష్ట్రంలో ఎక్కడ నేరాలు జరిగినా గంజాయి మత్తులో తప్పు చేశారని పోలీసు దర్యాప్తులో తేలేది. ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని, ఇక్కడి యువతను బయటికి తెస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే హోంశాఖ మంత్రి అనిత చైర్మన్‌గా నారా లోకేశ్(విద్య), సత్య కుమార్ యాదవ్(వైద్య), కొల్లు రవీంద్ర(ఎక్సైజ్), గుమ్మిడి సంధ్యారాణి (గిరిజన సంక్షేమం)తో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఐదుగురు మంత్రులు పలుమార్లు సమావేశమై ఇచ్చిన నివేదిక, చేసిన సూచనల ఆధారంగా ఐజీ ర్యాంకు అధికారి ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈగల్)ను 459 మంది పోలీసులతో ఏర్పాటు చేసింది.
అమరావతి కేంద్రంగా డీఎస్పీ స్థాయి అధికారి ఎస్‌హెచ్‌వోగా నార్కోటిక్ పోలీసు స్టేషన్, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్‌ఐ స్థాయి అధికారి ఎస్‌హెచ్‌వోగా నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేసింది. అమరావతిలో రెండు రాష్ట స్థాయి టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసి గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకూ మత్తు, గంజాయి కట్టడికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. గంజాయి ఎక్కువగా సాగయ్యే ఏజెన్సీలోని పాడేరులో, విరివిగా లభించే విశాఖపట్నంలో ఒక్కో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది. మరోవైపు గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది.
ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 1972 ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. సాగుదారులు, స్మగ్లర్లు, విక్రేతలు, చివరికి వినియోగదారుల్ని కూడా వదలకుండా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టే ఈగల్ విభాగం ఆర్నెల్లలో రాష్ట్రంలో గంజాయి మొక్కేకాదు వాసన కూడా లేకుండా చేసేందుకు నడుం బిగించింది. గంజాయి, మత్తు సంబంధిత కేసుల సత్వర పరిష్కారానికి విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక కోర్టులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
అందరి సాయంతో అంతమొందిస్తాం
ప్రజల ఆరోగ్యాన్ని, యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న గంజాయి, మత్తుపదార్థాల కట్టడికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుని విముక్తి కల్పిస్తామని ‘ఈగల్’ అధిపతి రవికృష్ణ తెలిపారు. సామాజిక సమస్య నుంచి సవాలుగా మారిన మత్తు మహమ్మారిని తరిమేసేందుకు తమ బృందాలు అహర్నిశలు శ్రమిస్తాయని చెప్పారు. మన్యంలో గంజాయి మొక్క గుర్తించడం నుంచి అంతిమంగా వినియోగదారుడి వరకూ తమ డేగకళ్లు వెంటాడుతాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డ్రోన్లు, జీపీఎస్, ఆర్‌ఎ్‌ఫఐడీ, ట్రాకింగ్ సిస్టమ్, ఏఐ ఆధారిత సీసీ కెమెరాల నిఘా.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతి టెక్నాలజీని గంజాయి, మత్తు కట్టడికి ప్రయోగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సహకారం తీసుకుని మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ‘మహా సంకల్పం’ పేరుతో సభలు ఏర్పాటు చేస్తామన్నారు.