Share News

Grama Sachivalayam: సచివాలయాల సిబ్బంది సర్దుబాటు!

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:27 AM

గ్రామ/వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది.

Grama Sachivalayam: సచివాలయాల సిబ్బంది సర్దుబాటు!
Grama Sachivalayam

  • గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన

  • నలుగురైదుగురికే పరిమితం చేసే చాన్సు

  • మిగతా వారిని ఇతర శాఖల్లో

  • సర్దేందుకు యత్నాలు

  • తొలుత ఇరిగేషన్‌ ఏఈలుగా

  • 660 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు!

  • పంచాయతీరాజ్‌లోనూ ఇలాగే సర్దుబాటు

  • గ్రామీణ తాగునీటి విభాగంలో కూడా..

అనాలోచితంగా గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి.. ఇబ్బడి ముబ్బడిగా కార్యదర్శులను నియమించిన జగన్‌ ప్రభుత్వం వారికి సక్రమమైన జాబ్‌చార్ట్‌ చూపించలేకపోయింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు పనుల్లేక సచివాలయాల్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుం టున్నారు. వారిలో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదివిన వారే. వారి సేవలను విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ/వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌కి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మిగతా శాఖ ల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి.. పనిలేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.


రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. సగటున 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివాలయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్‌తో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది. ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని యోచిస్తోంది.


లోపాలపుట్ట..

గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలో లోపాలపై ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌’ సంస్థ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే అధ్యయనం చేసింది. దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. బలోపేతానికి తీసుకోవలసిన చర్యలనూ సూచించింది. అయితే దాని నివేదిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో అధికారులు దానికి బహిర్గతం చేయడానికి సాహసించలేదు. గ్రామ/వార్డు సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదు. పనిభారం పెద్దగా లేదని ‘రీసెర్చ్‌’ సంస్థ అధ్యయన నివేదిక పేర్కొంది. ‘2022 నవంబరు-2023 మే నెల నడుమ 37 శాతం గ్రామ సచివాలయాలు, 39.3ు వార్డు సచివాలయాలు నెలకు కేవలం 5 శాతం లోపే సేవలు అందించాయి. గ్రామ సచివాలయాల్లో క్షేత్రస్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ... పట్టణాల్లో చాలా తక్కువ. గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి. కొన్ని సెమీఅర్బన్‌ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా, ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా పంచుకోవాలి.


సెమీ అర్బన్‌ ప్రాంతాలన్నీ గ్రామీణ, పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టణ స్థాయి మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం, తదితర మానవ వనరులున్నాయి. కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు రెండు సచివాలయాల్లోనూ ఉన్నారు. భద్రత దృష్ట్యా విద్యుత్‌ శాఖ ఉద్యోగులతో కలిసి టీమ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. వీటి మధ్య సంబంధాల్లో స్పష్టత లేదు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనూ నెలకొంది. వాటిలోని కార్యదర్శులు ఎక్కువగా మున్సిపల్‌ శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.


స్థానికంగా ప్రజల అవసరాలను పరిష్కరించడం కన్నా ఆయా శాఖలు, మున్సిపల్‌ శాఖకు వారు జవాబుదారీగా ఉండాల్సి వస్తోంది. దీంతో గ్రామ/వార్డు సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్‌పోస్టులుగా ఉన్నాయి. ఏఎన్‌ఎం, రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. వార్డు సచివాలయాల్లో రెవెన్యూ అధికారులకు పెద్దగా పనిలేదు. శానిటేషన్‌ కార్యదర్శులు పదే పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతున్నారు.


కొంత మంది టౌన్‌ప్లానింగ్‌-రెగ్యులేటరీ కార్యదర్శులకు పని పరిమితంగానే ఉంది. కొంత మంది కార్యదర్శులకు విస్తృతమైన బాధ్యతలు పెట్టగా.. కొంత మందిని కొన్ని పథకాలకే పరిమితం చేశారు. శాఖాపరమైన నిబంధనల ప్రకారం ప్రాక్టికల్‌గా కొన్ని పరిమితమైన విధులు మాత్రమే వారు చేపడుతున్నారు. సచివాలయాల కార్యదర్శులు సామాజిక చైతన్యం కల్పించడంలో కీలక భూమిక పోషించడం లేదు. వారికి నిర్ణయాత్మక అధికారాలు లేకపోవడంతో పౌరుల అవసరాలకు సంబంధించి తక్షణమే స్పందించలేని పరిస్థితి నెలకొంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్‌ప్లానింగ్‌-రెగ్యులేషన్‌, శానిటేషన్‌ కార్యదర్శులను తగ్గించాలి. సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల పాత్ర ఉండాలి’ అని సూచనలు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది.

Updated Date - Aug 26 , 2024 | 07:32 AM