Amaravati : ‘గ్రూప్-1’ కథ కంచికేనా?
ABN , Publish Date - Nov 29 , 2024 | 03:28 AM
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 164 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 మే 26న ప్రిలిమ్స్, 2020 డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్ నిర్వహించారు. 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయగా వారిలో నుంచి 326 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు.
వైసీపీ హయాంలో మూల్యాంకనంలో అక్రమాలు
ఆధారాలతో సహా నిరూపించిన అభ్యర్థులు
2018 మెయిన్స్‌ను రద్దు చేసిన హైకోర్టు
మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశం
దానిపై అప్పీలుకు ఏపీపీఎస్సీ, జగన్ ప్రభుత్వం
సీబీఐ విచారణకు నాడు చంద్రబాబు డిమాండ్
అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆ ఊసే లేదు
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పోస్టులు
ఆవేదన వ్యక్తంచేస్తున్న నష్టపోయిన అభ్యర్థులు
2018 గ్రూప్-1 మెయిన్స్ కథ ఇంకా కంచికి చేరలేదు. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో హైకోర్టు ఈ పరీక్షను రద్దు చేసింది. మరోసారి పరీక్ష నిర్వహించి ఆరు నెలల్లోగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఇది జరిగి 9 నెలలు కావస్తోంది. అయినా ఇప్పటి వరకూ పట్టించుకున్న నాథుడే లేడు. ఈ అక్రమాలపై నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇంతవరకూ ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పటికైనా విచారణ జరిపి నష్టపోయిన వారికి న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 164 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 మే 26న ప్రిలిమ్స్, 2020 డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్ నిర్వహించారు. 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయగా వారిలో నుంచి 326 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇక్కడే ఏపీపీఎస్సీ నిబంధనలు ఉల్లంఘించింది. మెయిన్స్ సమాధాన పత్రాలను మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానీ అందుకు విరుద్ధంగా కొవిడ్‌ను కారణంగా చూపుతూ డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. దీనిని అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేయడంతో, మాన్యువల్ విధానంలోనే మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి వరకూ మెయిన్స్ సమాధాన పత్రాలను గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో ఏపీపీఎస్సీ మూల్యాంకనం చేయించింది.
ఈ విషయాన్ని దాచిపెట్టి తమకు కావాల్సిన వారి కోసం రెండోసారి మళ్లీ మాన్యువల్‌గా మూల్యాంకనం చేసింది. ఈ రెండు మూల్యాంకనాలకూ ఫలితాల్లో ఏకంగా 62శాతం తేడా వచ్చింది. డిజిటల్ మూల్యాంకనం చేసినప్పుడు ఎంపికైన 202 మంది పేర్లు మాన్యువల్ మూల్యాంకనం ఫలితాల్లో కనిపించలేదు. ఇదే అభ్యర్థుల్లో అనుమానాలు పెంచింది. ఆరా తీయడంతో ఒకటికి రెండుసార్లు మూల్యాంకనం చేయించారని తెలిసింది. నష్టపోయిన అభ్యర్థులు మళ్లీ న్యాయస్థానానికి వెళ్లారు. రెండుసార్లు మూల్యాంకనం జరగలేదని హైకోర్టులోనూ ఏపీపీఎస్సీ వాదించింది. హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో మూల్యాంకనానికి చేసిన ఏర్పాట్లు, అందుకు చెల్లించిన బిల్లులు, పోలీసు భద్రత కోసం రాసిన లేఖలు అన్నీ అభ్యర్థులు హైకోర్టు ముందుంచడంతో న్యాయస్థానం మెయిన్స్ మొత్తం రద్దుచేస్తూ మార్చి 13న తీర్పు వెలువరించింది. తాజాగా మెయిన్స్ నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా మూల్యాంకనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. ఈ తీర్పుపై అప్పటి వైసీపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టుకే అప్పీలుకు వెళ్లాయి.
రూ.150 కోట్ల స్కాం అన్న టీడీపీ
ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపడంతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దీనిపై ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అక్రమాలు ఎలా జరిగాయో వివరించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు దీనిని రూ.150 కోట్ల స్కాం అని టీడీపీ ఆరోపించింది. వైసీపీకి అనుకూలంగా ఉండేవారిని గ్రూప్-1 అధికారులను చేసేందుకు కోట్లలో స్కాం చేసిందని విమర్శించింది. తాము అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణ జరిపి, నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చాక ఇలా...
స్వయంగా హైకోర్టు ముందు అక్రమాలు బయటపడటంతో ఏపీపీఎస్సీ మౌనం దాల్చింది. ప్రభుత్వం మారిన వెంటనే కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా నాడు అక్రమాల ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చారని ఆరోపణలున్న వారిని కీలక స్థానాల్లో నియమిస్తోంది. దీంతో నష్టపోయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తారనుకుంటే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు. ఇంతవరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అప్పట్లో ఏపీపీఎస్సీ సభ్యులను పేరుపేరునా ప్రస్తావించి వారిపై ఆయన విమర్శలు చేశారు. అయితే ఇప్పటికీ వారు అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. వారిలోనూ జగన్ బంధుగణం, గతంలో వైసీపీలో పనిచేసిన వారు కూడా ఉన్నారు. వీరిపై విచారణ చేసేందుకు కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. అలాగే గత ప్రభుత్వం నియమించిన అధికారే ఇంకా కమిషన్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇటీవల చైర్మన్‌ను నియమించారు కానీ మిగిలిన వారిని మాత్రం అలాగే కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి.