AP High Court : వాహనాలు తిప్పకుంటే అధికారులకు చెప్పాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:42 AM
వాహనాలను రోడ్లపై తిప్పబోమని యజమానులు రవాణా శాఖ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినప్పుడు మాత్రమే వారు పన్నుల నుంచి మినహాయింపు పొందగలరని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
వాహన యజమానులకు హైకోర్టు స్పష్టీకరణ.. సింగిల్ జడ్జి తీర్పు రద్దు
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): వాహనాలను రోడ్లపై తిప్పబోమని యజమానులు రవాణా శాఖ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినప్పుడు మాత్రమే వారు పన్నుల నుంచి మినహాయింపు పొందగలరని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పన్ను చెల్లింపు త్రైమాసికానికి ముందే వాహన యజమానులు స్టాపేజ్ రిపోర్ట్/నాన్ యూజ్ రిపోర్ట్‌ను అధికారులకు అందజేయాలని, లేకుంటే ఆయా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు భావించి పన్ను విధించే అధికారం రవాణా శాఖ అధికారులకు ఉంటుందని స్పష్టం చేసింది. తమ వాహనాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని సెంట్రల్ డిస్పాచ్ యార్డ్‌లో తిరుగుతున్నాయని, ఈ ప్రాంతం పబ్లిక్ ప్లేస్ పరిధిలోకి రానందున తమకు పన్ను మినహాయింపు ఉంటుందన్న తారాచంద్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వాదన ఏపీ మోటార్ వాహన పన్ను నిబంధన 12ఏకి విరుద్ధమని ప్రకటించింది. తారాచంద్ సంస్థ పన్ను రూపంలో చెల్లించిన రూ 22.71 కోట్లను వెనక్కివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. తారాచంద్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఐరన్ స్టోరేజ్, నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకొంది. ఇందుకోసం 36 వాహనాలను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఆ వాహనాలను రోడ్లపై తిప్పినందుకు సంస్థ పన్ను చెల్లించింది. ఆతర్వాత పన్ను చెల్లింపు కాలపరిమితి ముగియడంతో రూ.22.71 కోట్ల పన్ను చెల్లించాలంటూ అధికారులు నోటీసులు పంపడంతో సంస్థ పన్ను చెల్లించింది.
అయితే తమ వాహనాలు స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న సెంట్రల్ డిస్పాచ్ యార్డ్‌లోనే తిరుగుతున్నప్పటికీ అధికారులు పన్ను వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి తారాచంద్ సంస్థ చెల్లించిన రూ.22.71 కోట్లను వెనక్కివ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2023 జూన్ 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రవాణాశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పన్నుల నుంచి మినహాయింపు పొందాలంటే పన్ను చెల్లింపు త్రైమాసికం మొదలు కావడానికి ముందే వాహన యజమాని స్టాపేజ్ రిపోర్ట్/నాన్ యూజ్ రిపోర్ట్ అధికారులకు అందజేయాలని స్పష్టం చేసింది. అలా చేయకుంటే వాహనాలు వినియోగిస్తున్నారా?లేదా? అనే విషయంతో సంబంధం లేకుండా పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.