AP High Court : విక్రాంత్‌రెడ్డిపై కేసు వివరాలివ్వండి
ABN , Publish Date - Dec 07 , 2024 | 04:57 AM
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ వాటాల బదిలీ వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది.
సీఐడీ పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ వాటాల బదిలీ వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విక్రాంత్‌రెడ్డి వేసిన వ్యాజ్యంపై విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయించుకున్నారని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేవీఆర్ గ్రూపునకు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 2న మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ-1గా ఉన్న విక్రాంత్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలని, లేదంటే అది నిరర్థకమవుతుందన్నారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి సున్నితంగా తోసిపుచ్చారు.