Minister Savitha: ఆర్కే రోజాకు మంత్రి సవిత చురకలు
ABN , Publish Date - Nov 11 , 2024 | 06:20 PM
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించడం పట్ల మంత్రి సబిత సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆమె దన్యవాదాలు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా మంత్రి సవిత చురకలంటించారు.
అమరావతి, నవంబర్ 11: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా స్పందించిన తీరుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యంగ్య బాణాలు సంధించారు. అమరావతిలో మంత్రి సవిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చేది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీట్స్ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించడం హస్యాస్పదంగా ఉందన్నారు. బడ్జెట్‌పై మాట్లాడడానికి ఇది జబర్దస్త్ ప్రోగ్రామ్ కాదంటూ ఈ సందర్భంగా ఆమెకు చురకలంటించారు.
Also Read: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం
దగా చేసిన వైఎస్ జగన్..
తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ తప్పుకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. ఏటా మెగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామంటూ గతంలో వైఎస్ జగన్ మోసం చేయలేదా? అని ఆర్కే రోజాను ఈ సందర్భంగా మంత్రి సవిత సూటిగా ప్రశ్నించారు. మెగా జాబ్ క్యాలెండర్ అంటూ గతంలో వైఎస్ జగన్ ప్రజలను నమ్మించి.. ఓటు వేయించుకొని వారిని దగా చేశారని మండిపడ్డారు. ఇక గత వైసీపీ హయాంలో గౌరవ సభను.. కౌరవ సభగా మార్చిందని గుర్తు చేశారు. అలాంటి అసెంబ్లీని.. నేడు కుటుంబం అంతా కలసి చూసేలా మార్చామని వివరించారు.
Also Read: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
పులివెందుల సమస్యలు నేను పట్టించుకుంటా..
పులివెందులలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. అక్కడ కనీసం తాగు నీటి వసతులు సైతం లేవని తెలిపారు. అయితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి అక్కడి సమస్యలను సభలో వైఎస్ జగన్ ప్రస్తావించ వచ్చునన్నారు. ఈ సమస్యలను వైఎస్ జగన్ పట్టించుకోకపోయినా తాను జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా పులివెందులలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి సవిత స్పష్టం చేశారు.
Also Read: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ
సీఎంకు ధన్యవాదాలు...
అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బడుగు బలహీన వర్గాలకు భారీ కేటాయింపులు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 39 వేల కోట్లు కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్..
త్వరలో 16,347 పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. ఇక నవంబర్ 16వ తేదీ నుంచి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్స్ ను జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి నెల రూ. 1500 స్టైఫండ్ కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. అదే విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆన్ లైన్ కోచింగ్ సెంటర్లను సైతం ప్రారంభిస్తున్నామన్నారు. యాప్ ద్వారా ఎంత మంది అయినా ఈ కోచింగ్ తీసుకో వచ్చన్నారు.
ఈ నెల 18న రాష్ట్ర పండుగ..
ఈ ఆన్ లైన్ కోచింగ్ కేవలం బీసీ విద్యార్ధులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఈడబ్లూఎస్ వారికి సైతం ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే కనీసం 75 శాతం అటెండన్స్ ఉన్న వారికి మాత్రమే స్టైఫండ్ అందిస్తామన్నారు. బడుగు బలహన వర్గాల ఆరాధ్య దైవం భక్త కనకదాస్ జయంతి ఉత్సవాలను నవంబర్ 18వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి సవిత వెల్లడించారు.
For AndhraPradesh News And Telugu News