Ap News : కొల్లేరుకు పెరుగుతున్న వరద
ABN , Publish Date - Sep 07 , 2024 | 05:23 AM
: కొల్లేరు సరస్సులో ముంపు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఎగువ నుండి భారీగా వరద సరస్సులోకి చేరడంతో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగాయి.
గ్రామాలను చుట్టుముడుతున్న నీరు.. ప్రజల్లో భయం
ఉప్పుటేరును సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
కైకలూరు, సెప్టెంబరు 6: కొల్లేరు సరస్సులో ముంపు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఎగువ నుండి భారీగా వరద సరస్సులోకి చేరడంతో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగాయి. కొల్లేరు మరింత ఉగ్రరూపం దాలిస్తే సరస్సులోని 94 గ్రామాలు మునిగే ప్రమాదం ఉంది. ప్రధానంగా కైకలూరు మండలం ఆలపాడు శివారు సోమేశ్వరం వద్ద ఉప్పుటేరులో రోడ్డు వంతెనల వద్ద దట్టమైన కిక్కిసకర్ర అలుముకుంది. అలాగే రైల్వే బ్రిడ్జి, జాతీయ రహదారి విస్తరణలో ఉప్పుటేరుపై నూతనంగా నిర్మాణం చేసిన వంతెన సగంలో నిలిపివేశారు.
దీంతో ఉప్పుటేరులో 100 మీటర్ల వరకు దారి పూడుకు పోయింది. ఉప్పుటేరు అనేకచోట్ల ఆక్రమణలకు గురికావడం సరస్సు నుంచి వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలోకి వెళ్లకుండా అవరోధాన్ని సృష్టిస్తోంది. 2020 కంటే అత్యధికంగా కొల్లేరులోకి వరద నీరు వస్తందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అభ్యర్థనతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ నేతలతో కలిసి ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నవాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు.