Ap News : ‘జల్ జీవన్’లో..రూ.4,500 కోట్లు దోపిడీ
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:11 AM
వచ్చే మూడు నెలల్లో జల్ జీవన్ మిషన్‌ను తిరిగి పట్టాలెక్కించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నొక్కేశారు
కాగితాలపై మాత్రమే కుళాయిలు
ఐదేళ్లూ పక్కాగా భారీ అవినీతి ‘మిషన్’
రూ.వెయ్యి కోట్ల కేంద్రం ‘ఉపాధి’ పనులూ జల జీవన్ మిషన్ ఖాతాలోనే..
సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు
మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి అమర్చాలని నిర్దేశం
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వచ్చే మూడు నెలల్లో జల్ జీవన్ మిషన్‌ను తిరిగి పట్టాలెక్కించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జల్‌జీవన్ మిషన్ పనుల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్‌జీవన్ మిషన్ పథకాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘‘జల్‌జీవన్ మిషన్ పనులకు సంబంధించి గత ప్రభుత్వం సరిగ్గా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ఈ పథకం అమలు నిర్వీర్యంగా మారింది.
ఈ మిషన్ కింద సుమారు రూ.24 వేల కోట్లు కేంద్రం కేటాయించగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 12 వేల కోట్లకు గాను రూ.2254 కోట్లకు మాత్రమే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. దీంతో గత ఐదేళ్లలో సుమారు రూ.20 వేల కోట్ల నిధులు వృధా అయ్యాయి. కేవలం రూ.4500 కోట్లు మాత్రమే జల జీవన్ మిషన్ కింద అందాయి. ఆ నిధులకు కూడా ఖర్చులను కాగితాలపై చూపించి... గత ప్రభుత్వంలో బిల్లులు చేసుకున్నారు. పైగా గతంలో కేంద్ర ప్రభుత్వ పథకం జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద చేపట్టిన సుమారు రూ.1000 కోట్ల పనులను.....జల్‌జీవన్ మిషన్ పనుల కింద చూపించి మరింతగా నొక్కేశారు. ఈ అక్రమాలపై సమగ్రమైన విచారణ చేపట్టాలి’’ అని పంచాయతీరాజ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా జల్‌జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులు ఎక్కడా ఫలవంతం కాలేదని, నీటి వనరులు లేకుండానే గత ప్రభుత్వం కుళాయిలు ఏర్పాటుచేసిందని ఆయన అన్నట్టు తెలిసింది. ‘‘అసంపూర్తిగా ఉన్న పనుల విషయంలో 80 శాతం పూర్తయిన పనులను, అదే కాంట్రాక్టర్‌తో పూర్తి చేయించి, రెండేళ్ల పాటు నిర్వహణ వారితోనే చేయించాలి. మిగిలిన అసంపూర్తి పనులకు కొత్తగా టెండర్లు పిలిచి డిసెంబరులో పనులు ప్రారంభించాలి. ఈ మిషన్‌ను నిర్వహించే కన్సల్టెన్సీలు కాలం చెల్లిన విధానాలు అవలంభిస్తున్నాయి. వాటిని మార్చేయాలి. పలు చోట్ల నాడు నాసిరకం పైపులు వాడటంతో రూ.వేలకోట్లు దుర్వినియోగం అయ్యాయి. వాటిపై కూడా విచారణ చేపట్టాలి.
అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. కాగా, 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని అందించాల్సి ఉండగా, 2019 ఆగస్టుకు ముందే సుమారు 31.68 లక్షల ఇళ్లకు ఇచ్చేశారని, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం సుమారు 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. అయితే, మిగతా 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో 5 జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా కుళాయి కనెక్షన్ల అమరిక పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో నాడు ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన జల్‌జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ మిషన్ కింద ఏపీకి నిధులు తీసుకురావడంలో నాడు ఘోరంగా విఫలం అయ్యారన్నారు. ‘‘కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చిన రూ.27,248 కోట్లలో నాటి వైసీపీ ప్రభుత్వం రూ.4,235 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు’’ అని సీఎం మండిపడ్డారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఇక అడుగులు పడాలన్నారు. 2019కి ముందే పలుగ్రామాల్లో నిర్మాణమై ఉన్న ట్యాంకర్ల ద్వారా కుళాయి కనెక్షన్లు ఏర్పాటుచేసి నీటి సరఫరా చేశామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సురక్షిత తాగునీటిని ప్రతి ఇంటికీ నిరంతరం అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీపంలోని రిజర్వాయర్ల నుంచి గ్రామాలకు పైప్‌లైన్లు ఏర్పాటుచేసి నిరంతర తాగునీరు సరఫరా అయ్యేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని, దీనిపై ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పురోగతి లేని పనుల టెండర్లు రద్దు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ తప్పులు సరిదిద్ది కేంద్రానికి విన్నవించి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామన్నారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అధికారులు పాల్గొన్నారు.