Share News

AP : ఇద్దరు వైసీపీ ఎంపీలు అవుట్‌!

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:22 AM

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశారు.

AP : ఇద్దరు వైసీపీ ఎంపీలు అవుట్‌!

  • రాజ్యసభకు మోపిదేవి, మస్తాన్‌రావు గుడ్‌బై

  • చైర్మన్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామాల సమర్పణ

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. మనస్సాక్షిగానే ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు.

వారి రాజీనామాలను ధన్‌ఖడ్‌ తక్షణమే ఆమోదించారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికకు 10 రోజుల్లో ఎన్నికల కమిషన్‌ ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇంకోవైపు.. రాజీనామాలు సమర్పించాక మోపిదేవి, మస్తాన్‌రావు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛందంగానే ఎంపీ పదవులకు రాజీనామా చేశామని, వెనుక ఎవరి ప్రలోభాలూ లేవని స్పష్టంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను పరిగణనలోకి తీసుకోకుండా స్థాయి లేని వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని, అప్పుడే పార్టీ మారాలని అనుకున్నానని మోపిదేవి తెలిపారు. తాను టీడీపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు.

ఆయన రాజ్యసభ సభ్యత్వం 2026 జూన్‌ 21 వరకు ఉన్నా వదులుకోవడం గమనార్హం. తనకు నాలుగేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశామని బీద మస్తాన్‌రావు చెప్పారు. టీడీపీలో చేరికపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 32 ఏళ్లు టీడీపీలో ఉన్నానని చెప్పారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువులతో చర్చించి తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ గొల్ల బాబురావు స్పందించారు. సరైన సమయంలో తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.

Updated Date - Aug 30 , 2024 | 04:22 AM