పిల్లలు ఎందరున్నా పోటీకి ఓకే
ABN , Publish Date - Nov 19 , 2024 | 03:38 AM
రాష్ట్రంలో ఎంత మంది సంతానం కలిగి ఉన్నవారైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు మార్గం సుగమమైంది.
స్థానిక ఎన్నికలపై పీఆర్ చట్టానికి సవరణ
దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గింది
మన రాష్ట్రంలో 1.6కి పడిపోయింది
15 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య తగ్గుతోంది
సంతానోత్పత్తిని, యువ జనాభాను
పెంచేందుకే ఈ బిల్లు: మంత్రి మనోహర్
బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
పురపాలక చట్టానికీ ఇదే సవరణ
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంత మంది సంతానం కలిగి ఉన్నవారైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు మార్గం సుగమమైంది. ఆ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల చట్టాలకు చేసిన సవరణలను శాసనసభ సోమవారం ఆమోదించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరఫున పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం-1994లో సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఎందుకు సవరణ చేయాల్సి వస్తోందో వివరించారు. 1980-90 మధ్య దేశంలో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని.. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ టీడీపీ ప్రభుత్వం 1994 మే 30న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసిందని చెప్పారు. ‘ఆ తర్వాత ఈ చట్టాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేశారు. జాతీయ ఆహార భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగదలను నియంత్రించడానికి అప్పుడీ చట్టం అవసరమైంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు దీనిని వర్తింపజేశారు.
ఇప్పుడు పరిస్థితులు మారాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్) ప్రకారం.. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోంది. 1993-94లో 3.7గా ఉన్న ఈ రేటు ఇప్పుడు 2.1కి తగ్గిపోయింది. మన రాష్ట్రంలో ఇది 1.6కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడంతో పాటు జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారి సంఖ్య భారీగా పడిపోతోంది. 2015-16లో దేశ జనాభాలో 15 ఏళ్ల వయస్కులు 28.6 శాతం ఉంటే ఇప్పుడు 2 శాతానికి తగ్గిపోయింది. ఇది మన దేశ వృద్ధి రేటుపై ప్రభావం చూపే అవకాశముంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాలను అనుసరిస్తోంది. ముఖ్యంగా యువ జనాభాను పెంచే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే విధంగా అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
సమాజంలో అందరికీ గుర్తింపు, సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో పాటు సంతానోత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో చట్ట సవరణ చేశాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత తగ్గడం వల్ల రాష్ట్రాభివృద్ధి, స్థూల ఉత్పత్తికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, సంతానోత్పత్తి తగ్గడం చిన్న విషయం కాదన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వంద మందిలో ఒక్కరు కూడా ముగ్గురు పిల్లలను కనడం లేదన్నారు. అసలు పిల్లలను కనేవారి సంఖ్య కూడా తగ్గిపోతోందని.. కొంత మంది ఒక్కరైతే చాలన్న ఆలోచనతో ఉంటున్నారని చెప్పారు. భవిష్యత్‌లో మన దేశం కూడా జపాన్‌లా తయారయ్యే ప్రమాదం ఉందని.. అందుచేత ప్రతి ఒక్కరూ సంతానోత్పత్తిని ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్రంలో సంతానోత్పత్తి పెరగాలంటే ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. చర్చ అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఇదే విధంగా పురపాలక చట్టంలోనూ సవరణ కోరుతూ మున్సిపల్ మంత్రి పి.నారాయణ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీల్లో కూడా ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హత కల్పించే ఈ బిల్లును సైతం సభ ఏకగీవ్రంగా ఆమోదించింది.