APSRTC : దసరాకు 6100 ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:16 AM
దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎ్‌సఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సోమవారం తెలిపింది.
సాధారణ టికెట్ ధరలే వర్తింపు
అక్టోబరు 4 నుంచి 11 వరకు 3040, దసరా తర్వాత 3060
బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు, సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ ఏర్పాట్లు
రాష్ట్రమంతటి నుంచి అదనపు బస్సులు
అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎ్‌సఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సోమవారం తెలిపింది. అక్టోబరు 4 నుంచి 11 వరకు 3,040, పండుగ తర్వాత 3,060 బస్సు సర్వీసులు ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ రోజుల్లో ఉండే టిక్కెట్ ధరలే వర్తిస్తాయని విజయవాడ ఆర్టీసీ హౌస్ స్పష్టం చేసింది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడపనుంది. దుర్గా శరన్నవరాత్రులకు విజయవాడకు వచ్చే భక్తులు, తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల నుంచి బస్సులు నడపనుంది.
దసరాకు ముందు.. తర్వాత
దసరాకు ముందు హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. విశాఖ నుంచి 320, రాజమండ్రి 260, విజయవాడ 400 బస్సులతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పట్టణాలు, పల్లెలకు 730 ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది. దసరా తర్వాత హైదరాబాద్ 990, బెంగళూరు 330, చెన్నై 70 బస్సులు రాష్ట్రం నుంచి నడుస్తాయి. విశాఖపట్నం నుంచి 260, రాజమహేంద్రవరం 220, విజయవాడ 700, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 490 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ వివరించింది.
నవరాత్రుల సందర్భంగా విజయవాడకు భవానీ భక్తులు ఎక్కువగా వస్తున్నందున పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1100 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రయాణికులకు టిక్కెట్‌తో చిల్లర సమస్య ఏర్పడకుండా యూటీఎస్ మెషిన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆర్టీసీ తెలిపింది. ఫోన్‌పే, గూగుల్‌పే, క్యూఆర్ కోడ్ స్కాన్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా టిక్కెట్లు తీసుకోవచ్చని చెప్పింది. ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవచ్చని పేర్కొంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి టిక్కెట్ ధరలో పది శాతం రాయితీ ఉంటుందని చెప్పింది.
ప్రయాణికుల సేవే పరమావధి
ప్రతి పల్లె నుంచి పొరుగు రాష్ట్రాలకు సైతం దశాబ్దాలుగా ప్రయాణ సేవలందిస్తోన్న ఏపీఎ్‌సఆర్టీసీ సేవల్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజూ 1930 ట్రిప్పులు, గరుడ సేవ ఆ తర్వాతి రోజుల్లో 2,714 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని చెప్పింది. తమ సిబ్బంది, సూపర్ వైజర్లు ప్రయాణికుల సేవకే ఉంటారని తెలిపింది.