Share News

AP Assembly Budget Session: ఇది మర్యాదేనా జగన్‌!

ABN , Publish Date - Nov 11 , 2024 | 04:35 AM

‘ప్రతిపక్ష నేతగా గుర్తించి.. సభానాయకుడితో సమానంగా మైకు ఇచ్చి.. మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా’ అని వైసీసీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

AP Assembly Budget Session: ఇది మర్యాదేనా జగన్‌!
YS Jagan

  • అసెంబ్లీకి డుమ్మా నిర్ణయంతో సెల్ఫ్‌గోల్‌..

  • విపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని మారాం

  • ఎక్కువ సేపు మైకు ఇవ్వరని వెళ్లరట!

  • స్వీయపదవిని ఇచ్చేసుకుని నేటి నుంచి సానుకూల మీడియా ముందు డప్పులు

  • సోషల్‌ సైకోలపై వేటుతో వైసీపీ పెద్దల్లో నిర్వేదం

  • బూమరాంగ్‌ అవుతున్న ఒక్కో నిర్ణయం

  • వైసీపీ నేతల్లో ఆందోళన

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘ప్రతిపక్ష నేతగా గుర్తించి.. సభానాయకుడితో సమానంగా మైకు ఇచ్చి.. మాట్లాడేందుకు సమయం ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా’ అని వైసీసీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపింది సభకు వెళ్లకుండా ఎగవేయడానికా అని నిలదీస్తున్నారు. ఆయన తీరు అసలుకే మోసం తెచ్చేలా ఉందని సొంత పార్టీ నేతలే బాహాటంగా అంటున్నారు. ‘జనం ఇస్తేనే కదా.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా నేత పదవి దక్కేది! ఆ పదవి ఇస్తేనే సభకు వెళ్తానని మారాం చేయడమేమిటి’ అని ఆక్షేపిస్తున్నారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కిందట తాడేపల్లిలో తనను ఎదురు ప్రశ్నించని విలేకరులను ముందేసుకుని జగన్‌ మాట్లాడారు. ‘అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల సమయంలోనే స్పీకర్‌ను అడిగా.. అయ్యా.. అసెంబ్లీలో ఉన్నవి రెండే రెండు కూటములు.. ఒకటి అధికారపక్ష కూటమి, రెండోది మేము. ఇవి కాకుండా వేరేపక్షం ఉన్నారా అసెంబ్లీలో! మేం కాకుండా అసెంబ్లీ ఎవడూ ప్రతిపక్షంలో లేకపోతే.. మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలా లేదా? ఆ ప్రతిపక్ష పార్టీకి నాయకుడనే వాడు ఉంటాడు కదా! మరి ఆ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాలి! మాకు 40 శాతం ఓట్‌ షేర్‌ వచ్చింది కరెక్టు కాదా? మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించనంటే దాని అర్థం ఏమిటి? అసెంబ్లీ జరిగినన్ని రోజులూ.. సభలో మాట్లాడినట్లే (అనుకూల) మీడియాతో రోజూ గంట సేపు మాట్లాడతా. ప్రజాసమ్యలను లేవనెత్తుతా’ అని ప్రకటించారు.

ప్రత్యర్థి పార్టీలు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డాయి. ఆయన చెప్పిందల్లా వింటేనే ప్రజాస్వామ్యమా అని విరుచుకుపడ్డాయి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకే జనం శాసనసభ్యులుగా గెలిపించి పంపారని.. ప్రతిపక్ష హోదా వస్తుందనో.. ప్రతిపక్ష నేత పదవి వస్తుందనో కాదని ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలూ ఇదే డిమాండ్‌ అందుకున్నాయి. జగన్‌ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టాయి. సభలో పార్టీల సంఖ్యాబలం ప్రకారమే విపక్ష హోదా, విపక్ష నేత హోదా లభిస్తాయని తెలిసీ నాటకాలాడుతున్నారని.. గత ఐదేళ్ల దుష్పరిపాలనపై సభలో అధికార పక్షం నిలదీస్తే జవాబివ్వలేమని ముందే చేతులెత్తేశారని.. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ‘విపక్ష’ సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేస్తున్నాయి. ఆయన హయా ంలో సంఖ్యాబలం ఆధారంగానే టీడీపీ సభ్యులకు సభలో సమయం కేటాయించారని గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు మాత్రం సభలో సీఎం చంద్రబాబుతో సమానంగా తాను కోరుకున్నప్పుడల్లా మైకు ఇవ్వాలని.. తాను సీఎంగా ఉన్నప్పటి భద్రత కల్పించాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని ఆక్షేపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించనప్పుడు రాజీనామా చేయాలని పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో జగన్‌ నిర్ణయం రాజకీయంగా బూమరాంగ్‌ అవుతోందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.


ఇదేం సంప్రదాయం?

అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షం అనే రెండు పక్షాలే ఉంటాయి. పాలకపక్షంతో విబేధించే రాజకీయపక్షాలన్నీ ప్రతిపక్షం వరుసలోకే వస్తాయి. వీటికి సంఖ్యాబలంతో నిమిత్తం ఉండదు. సహజంగా వామపక్ష పార్టీల బలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సింగిల్‌ డిజిట్‌లోనే ఉండేది. ఏనాడూ వామపక్ష పార్టీ శాసనసభ్యులు మాట్లాడేందుకు సిద్ధమైనప్పుడు .. అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా .. వారి సభ్యుల సంఖ్యాబలాన్ని ఎత్తిచూపుతూ గేలి చేసిన దుస్పంప్రదాయం ఎదురు కాలేదు. ఎందుకంటే .. వామపక్షాలు లేవనెత్తే అంశాలన్ని ప్రజాసమస్యలే కేంద్రంగా ఉంటాయి. కానీ, రాష్ట్రంలో వైసీపీ విషయంలో అలా జరగడం లేదు. సభానాయకుడిని తిట్టేందుకే తనకు ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలంటూ జగన్‌ కోరడాన్ని స్వపక్షం వైసీపీని కూడా ఆశ్చర్యానికి లోను చేస్తోంది. వాస్తవానికి ప్రజా సమస్యలను చట్టసభల ద్వారా ఎత్తిపట్టేందుకు సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేదని ప్రజాస్వామ్యంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. జగన్‌ కోరుకున్నట్లుగా ప్రతిపక్షనేత హోదాను ఇవ్వనప్పటికీ .. వైసీపీ సభ్యులంతా ఒకేచోటు కూర్చొని .. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా వ్యవహరించొచ్చని రాజకీయపక్షాలు సూచిస్తున్నాయి. అలా కాకుండా .. అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లకుండానే .. ఇంటి దగ్గరే .. తన అనుకూల మీడియా ముందు స్వీయ ప్రతిపక్షనేతలా .. మరో ముక్కలో చెప్పాలంటే .. స్వీయ ముఖ్యమంత్రిగా ప్రకటించుకుని మాట్లాడేందుకు జగన్‌ సిద్ధం కావడంపై సొంత పార్టీనేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


కరిగిపోతున్న గుండెదిటవు..

సామాజిక మాధ్యమం వేదికగా వ్యక్తిగత ఆరోపణలతో ప్రతిపక్షనేతలు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి వైసీపీ ప్రభుత్వం నాడు పాల్పడింది. తల్లి, చెల్లి, అన్న అనే బాంధవ్యాలను.. వావివరుసలను మరిచి అసభ్య పోస్టులకు జగన్‌ సమూహం బరితెగించింది. బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేయడాన్ని కూడా వైసీపీ తప్పుబడుతూ వచ్చింది. బాధితులపైనే వైసీపీ సర్కారు ఆనాడు ఎదురు కేసులు పెట్టింది. ఇప్పుడు సోషల్‌ మీడియా చేష్టలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతుంటే .. జగన్‌ విలవిల్లాడిపోతున్నారు. పోలీసు చర్యలతో సోషల్‌ మీడియా సభ్యులు ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో .. జగన్‌లో భయం మొదలైందని చెబుతున్నారు. దీంతో అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. తాము నాలుగేళ్లలోనే అధికారంలోకి వచ్చేస్తున్నామని .. అధికారులు సప్తసముద్రాల్లో దాగి ఉన్నా వెతికి వెతికి పట్టుకుంటామంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, డీజీపీ తిరుమలరావుపై వ్యక్తిగత ఆగ్రహం వ్యక్తంచేయడం .. రిటైర్‌ అయినా పిలిపించి చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు చేశారు. ఏమైనా అధికారాన్ని కోల్పోయాక .. జగన్‌ వేస్తున్న అడుగులన్నీ తప్పటడుగులేనన్న అభిప్రాయం వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.


విపక్ష నేతకు గౌరవం ఇచ్చారా?

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షనేత హోదా దక్కింది. కానీ, ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబుకు .. సభాపతిగా తమ్మినేని సీతారాం ఏనాడూ కోరిన వెంటనే మైక్‌ ఇవ్వలేదు. పైపెచ్చు సభాపతి స్థానంలో కూర్చున్నానన్న స్పృహను కోల్పోయి .. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కనుసైగ కోసం చూస్తూ .. అతని మెప్పు పొందేలా చంద్రబాబును గేలి చేసేవారు. సీనియర్‌ రాజకీయ నాయకుడైన చంద్రబాబును తమ్మినేని గేలి చేయడాన్ని ఏనాడూ జగన్‌ అడ్డుకోలేదు. పైగా .. గలగలా నవ్వేవారు. 2019-24 మధ్యకాలంలో .. ప్రధాన ప్రతిపక్షాన్ని జగన్‌ గుర్తించలేదు. పైపెచ్చు .. చంద్రబాబు సహా .. ప్రతిపక్షనేతలను ఏకవచన ప్రయోగంతో జగన్‌ కించపరచేలా మాట్లాడేవారు. అధికారంలో ఉండగా .. ప్రతిపక్షనేతలను లక్ష్యంగా చేసుకుని పాలనను వ్యతిరేకించినవారిపై రాజద్రోహం కేసులు పెట్టించారు.

Updated Date - Nov 11 , 2024 | 08:28 AM