Share News

Julakanti Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..

ABN , Publish Date - Nov 03 , 2024 | 08:10 AM

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై అతడి స్నేహితులు దాడి చేశారు. దీంతో అతడు గుంటూరులోని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.

Julakanti Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..

గుంటూరు, నవంబర్ 03: నగదు అప్పుగా ఇచ్చారు. తిరిగి చెల్లించాలని నగదు ఇచ్చిన వారు అడిగారు. దీంతో అప్పు తీసుకున్న వారి ఆగ్రహానికి కారణమైంది. దాంతో అప్పు ఇచ్చిన వారిపై ముకుమ్మడి దాడికి దిగారు. అంతే కాకుండా బైక్, కారు ధ్వంసం చేశారు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి (బ్రహ్మారెడ్డి) బావమరిది కృష్ణారెడ్డి.. తన స్నేహితులకు అప్పుగా నగదు ఇచ్చారు.


తన అవసరార్థం నగదు తిరిగి చెల్లించాలని వారిని కోరారు. దీంతో అతడి స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... కృష్ణారెడ్డిపై దాడికి దిగారు. ఈ దాడిలో వీహెచ్‌పీ నాయకుడు అనిల్‌తోపాటు అతడి స్నేహితులు సైతం పాల్గొన్నారు. దీంతో కృష్ణారెడ్డి గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అందులోభాగంగా బెహరా అనిల్‌తోపాటు అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన వారంతా మద్యం తాగి ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే బావ మరిది కృష్ణారెడ్డితోపాటు అతడి స్నేహితుడు మాధవరావుపై వీరంతా దాడి చేశారు.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల ఓటర్లు.. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి పట్టం కట్టారు. అయితే ఇవే ఎన్నికల్లో వైసీపీ నేత, నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆయనపై కేసు నమోదు అయింది. దీంతో ఆయన జైలుకు వెళ్లారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలైన సంగతి తెలిసిందే.


ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి తల్లిదండ్రులు సైతం ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఎమ్మెల్యే నాగిరెడ్డిలోని నీతి నిజాయితిని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గుర్తించారు. ఆ క్రమంలో 1983లో ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గురజాల ఎమ్మెల్యేగా నాగిరెడ్డి ఘన విజయం సాధించారు. ఇక బ్రహ్మారెడ్డి తల్లి జూలకంటి దుర్గమాంబ 1999 ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 03 , 2024 | 08:10 AM