Ayush Department : ఆయుష్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:45 AM
ఆయుష్ విభాగంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ శాఖలో అక్రమాలపై ఇప్పటికే జరుగుతున్న విచారణలో రూ.3 కోట్ల విలువైన మందులు మాయమైనట్లు తేలింది.
మొన్న మందులు మాయమైనట్టు గుర్తింపు
తాజాగా.. కెమికల్స్ కొనుగోలులో చేతివాటం
జీవో 53తో ఎస్సీ, ఎస్టీ వైద్యుల హక్కులకు తూట్లు
వైసీపీ ప్రభుత్వంలో ఆగమేఘాల మీద జీవో జారీ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
తాజాగా డిస్పెన్సరీలకు అవసరమైన వస్తువులు, కెమికల్స్ కొనుగోలులో కూడా మాజీ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటికి తోడు జీవో 53పై కూడా విచారణ చేయాలని ఆయుష్ విభాగంలో వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ అధికారులు ఆయుష్, యునాని విభాగంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను సరెండర్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులుగా మార్పు చేశారు. అది కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే వైసీపీ సర్కారు ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పోస్టులు సరెండర్ చేయడం సాధ్యం కాదని మార్చి 14న ఆన్‌లైన్ కేబినెట్‌లో పెట్టి ఈ ఫైల్‌కు ఆమోదం తెలిపారు. అనంతరం మార్చి 16న ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యుల పోస్టులను ఆగవేఘాల మీద సరెండర్ చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ విభాగంలో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 74 డిస్పెన్సరీల్లో 30 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. జీవో 53 ద్వారా 28 పోస్టులను ప్రభుత్వానికి సరెండర్ చేసేసి, వాటి స్థానంలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను తీసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో ద్వారా క్షేత్రస్థాయిలో రోగులకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు ఎస్సీ, ఎస్టీ వైద్యులు తమ రిజర్వేషన్ కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆయుష్ విభాగంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్టు చాలా కీలకం. ఈ కేడర్‌కు చెందినవి దాదాపు ఆరుపోస్టులున్నాయి.రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఒకే కేడర్‌కు చెందినవి ఐదు పోస్టులకుపైగా ఉంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలులోకి వస్తుంది. ఆయుష్ అధికారులు ఈ విషయాన్ని విస్మరించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కేడర్‌లో ఉన్న ఆరు పోస్టుల్లో ఒకదాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో ఆ కేడర్ పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండాపోయింది. దీంతో ఆయుష్ విభాగం వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోంది. మరోవైపు ఆయుష్ విభాగంలో ఒక ఉన్నతాధికారికి, ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారి అండదండలు అందించడంతో ఆయు్‌షలో ఏం జరిగినా గత ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించింది. చివరికి వైద్యులకు తీవ్ర నష్టం జరిగినా ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనిపై విచారణ చేయాలని, జీవోను రద్దు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
నియామకాలపైనా ఆరోపణలు..
ఆయుష్ విభాగంలో వైద్యుల పోస్టుల భర్తీకి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయుర్వేదలో 72, హోమియోలో 60 వైద్యుల పోస్టుల భర్తీకి 2021లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పటి నుంచి కోర్టు కేసుల వల్ల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఈ నెల 30, 31వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభిస్తారు. ఈ నియామకాలపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా ఎంపికైన అభ్యర్థి దగ్గర నుంచి ఆయుష్ అధికారులు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా ఆరోగ్యశాఖలో కొంత మంది అధికారులు ఆయు్‌షను అవినీతి విభాగంగా మార్చేశారు. కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టి ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.