Balineni Srinivas: వైసీపీకి రాజీనామా.. బాలినేని తొలి స్పందన ఇదే..
ABN , Publish Date - Sep 18 , 2024 | 07:12 PM
వైసీపీకి రాజీనామా చేయడానికి గల కారణాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యంగా పార్టీలో కోటరీ నడుస్తోందని..
హైదరాబాద్, సెప్టెంబర్ 18: వైసీపీకి రాజీనామా చేయడానికి గల కారణాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యంగా పార్టీలో కోటరీ నడుస్తోందని.. ఇది తనను తీవ్రంగా బాధించిందన్నారు. తనపై అనేక వదంతులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి కాంగ్రెస్‌లో పిల్ల కాంగ్రెస్ విలీనం అవుతుందని తాను అనని మాటలను అన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు.
తాను జగన్ ముందు ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదన్నారు. ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పానని.. వాటిని ఆయన నెగిటివ్‌గా తీసుకున్నారని అన్నారు. ఒంగోలు ఎంపీ టికెట్‌ను మాగుంటకు ఇవ్వాలని కోరానని.. కానీ పెద్ద నాయకులుగా చెప్పుకునే చెవిరెడ్డికి ఇచ్చారన్నారు. ఎక్కడో చిత్తూరు నుండి తిసుకువచ్చి ఒంగోలులో నిలబెట్టారని, ఇది తప్పుడు నిర్ణయమని అన్నారు.
పవన్ కల్యాణ్‌ను కలుస్తా..
గురువారం విజయవాడలో పవన్ కల్యాణ్‌ను కలుస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను అక్కడే ప్రకటిస్తానన్నారు. పార్టీలో తనకు జరిగిన అని విషయాలను ప్రెస్‌మీట్ పెట్టి వివరిస్తానని బాలినేని చెప్పారు. మరి బాలినేని ఏం చెబుతారు? వైసీపీపై, ఆ పార్టీ అధినేత జగన్‌పై ఎలాంటి కామెంట్స్ చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.
ఎప్పటి నుంచో చర్చ..
వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడుతారని జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ, ఇంతకాలం ఆ ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ వచ్చారు బాలినేని. కానీ, చివరకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బాలినేని.. గురువారం నాడు విజయవాడకు వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవనున్నారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన జనసేనలో చేరిపోనున్నట్లు తెలుస్తోంది.