Share News

వేకువన గుండెపోటుకు నివారణ

ABN , Publish Date - Nov 27 , 2024 | 05:17 AM

బాపట్ల కాలేజి ఆఫ్‌ ఫార్మాశీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ వి.సాయికిషోర్‌ తనవిద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న పేటెంట్‌ మంజూరు చేసింది.

వేకువన గుండెపోటుకు నివారణ

  • బాపట్ల ఫార్మకాలజీ ప్రొఫెసర్‌ ఘనత.. కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ మంజూరు

బాపట్ల రూరల్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): బాపట్ల కాలేజి ఆఫ్‌ ఫార్మాశీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ వి.సాయికిషోర్‌ తనవిద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న పేటెంట్‌ మంజూరు చేసింది. ప్రస్తుత ప్రజల జీవన శైలీలో వస్తున్న మార్పులపై ఆయన పరిశోధన చేశారు. గతంలో 50 సంవత్సరాలకు పైబడిన వ్యక్తుల్లో గుండెపోటు లక్షణాలు కనిపించేవి. ఇప్పుడు 35 సంవత్సరాలు నిండిన వారిలో కూడా కనిపిస్తున్నాయి. గుండెపోటు మరణాలు ఎక్కువ సందర్భాల్లో తెల్లవారు జామున ఆరు గంటల ప్రాంతంలో సంభవిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు గుండెపోటుకు కారణమైన ‘కేటాకోలమైన్‌’ అనే కారకం విడుదల అవుతుంది. సహజంగా ఇది తెల్లవారుజామునే శరీరంలో విడుదలవుతుందన్న విషయాన్ని గమనించారు. దీనిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఔషధాలు సంతృప్తికర ఫలితాలను అందించలేకపోతున్నాయి. ఈ ప్రతికూలతలను అధిగమించి మెరుగైన సత్‌ఫలితాలను అందించడానికి ‘సమయ నిర్దేశిత ఔషధ విడుదల విధానం’ (క్రోనో ఫార్మాసిటికల్‌ డ్రగ్‌ డెలివరి సిస్టమ్‌)ను ఉపయోగించారు. అందుకోసం హృద్రోగ సమస్యలకు విరివిగా ఉపయోగించే డిల్షియాజమ్‌ హైడ్రోక్లోరైడ్‌, ప్రొప్రొనాలోల్‌ హైడ్రోక్లోరైడ్‌ మందులను పిల్లెట్ల రూపంలోకి మార్చారు. వాటిని జీరో సైజ్‌ క్యాప్సూల్స్‌లో నింపారు. దానికి 5 గంటల అనంతరం విడుదలయ్యే విధంగా రూపొందించిన హైడ్రోజెల్‌ ప్లగ్‌ను అమర్చారు. అలా రూపొందించిన క్యాప్సూల్‌ను రాత్రి భోజనం అనంతరం 9 గంటల సమయంలో స్వీకరించాలి. అది అర్ధరాత్రి 2 గంటలు నుండి ఔషదాన్ని విడుదల చేయటం ఆరంభించి తెల్లవారుజామున 6 గంటల సమయానికి గరిష్ఠ మోతాదులో ప్రతికారకాలను విడుదల చేస్తుంది. అవి గుండెపోటుకు దారితీసే కారకాలను సమర్థవంతంగా నిరోధిస్తాయి. ఈ విధానం అత్యంత ప్రభావశీలకమని ప్రయోగాల్లో నిర్ధార ణ అయింది. పేటెంట్‌ వచ్చిన సందర్భంగా డాక్టర్‌ వి.సాయికిషోర్‌కు... బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు దొప్పలపూడి రామ్మోహనరావు, గెల్లి దిలీప్‌, కరస్పాండెంట్‌ కొమ్మినేని పద్మ, తాళ్ల రామకృష్ణ, ప్రిన్సిపాల్‌ మూర్తి అభినందనలు తెలిపారు.

Updated Date - Nov 27 , 2024 | 05:17 AM