AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్
ABN , Publish Date - Nov 11 , 2024 | 07:16 PM
ప్రతి పక్ష హోదా సైతం దక్కని వైసీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు.. జనసేన పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
అమరావతి, నవంబర్ 11: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. నగరానికి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు.. సోమవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో కార్పొరేటర్లు.. ఉమ్మడిశెట్టి రాధిక, అట్లూరి ఆదిలక్ష్మి, మరుపిళ్ల రాజేష్, మహదేవ్ అప్పాజీతోపాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఏ మాత్రం హోప్ లేని పరిస్థితుల్లో తాను జనసేన పార్టీని స్థాపించానన్నారు.
Also Read: ఆర్కే రోజాకు మంత్రి సవిత చురకలు
కలిసి ముందుకు నడిచాం..
ప్రజల కోసమే పని చేయాలనే సంకల్పంతో తాను ముందుకు అడుగులు వేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో 2009 నుంచి పి. హరిప్రసాద్ తనతోనే కలిసి అడుగులు వేశారన్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం రాష్ట్రానికి మేలు చేయాలనే సంకల్పంతో పని చేశారని వివరించారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లో సైతం తామంతా కలిసి ముందుకు నడిచామని ఆయన వివరించారు. ఆ క్రమంలో కష్టాల కొలిమిలో నడుస్తూనే రాష్ట్రానికి అండగా ఉండాలనే సంకల్పం తాము తీసుకున్నామని పేర్కొన్నారు.
Also Read: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం
బీడు భూమి తప్ప.. ఇక్కడ..
మంగళగిరిలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తే.. బీడు భూమి తప్ప ఇక్కడ ఏమీ లేదన్నారు. అయితే 2016లో పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే.. మీడియా సైతం త్వరగా ఇక్కడకు వచ్చే వారు కాదన్నారు. జనసేన పార్టీ నిర్మాణానికి దాదాపు దశాబ్ద కాలం పట్టిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం జనసేనకు బలమైన స్థానిక నాయకత్వం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మీరంతా నేడు పార్టీలోకి రావడం శుభపరిణామమని తెలిపారు. ప్రజల కోసం మనమంతా కలిసి పని చేద్దామని పార్టీలో కొత్తగా చేరిన శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
అవి రాష్ట్రాభివృద్ధికి బలంగా మారాయి...
ప్రధాని మోదీ మద్దతుతో.. సీఎం చంద్రబాబు నిర్దేశకత్వంలో అందరం కలిసి అడుగులు వేద్దామని వారికి సూచించారు. ఈ రోజు అసెంబ్లీలో కలెక్టివ్ బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. రూ. లక్షా 31 వేల కోట్ల అప్పులతో బడ్జెట్ ప్రవేశ పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సుధీర్ఘ అనుభవానికి జనసేన పార్టీ బలమైన పోరాట శక్తిని ఇచ్చిందన్నారు. దేశంలో బీజేపీకి ఉన్న శక్తి సామర్ధ్యాలు రాష్ట్రాభివృద్దికి బలంగా మారాయని డిప్యూటీ సీఎం అభివర్ణించారు.
Also Read: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ
పార్టీలో గుర్తింపు ఉంటుంది..
అదే విధంగా మీరంతా కలిసి మెలసి పార్టీ కోసం పని చేయాలని.. పార్టీలో చేరిన కేడర్‌కు పవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మీరెంతగా పని చేస్తే.. అంత గుర్తింపు పార్టీలో ఉంటుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. అలాగే జనసేనలో చేరిన సమయంలోనే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు పార్టీని బలోపేతం చేయాలని తాను సూచించానన్నారు.
తృటిలో అవకాశం తప్పింది..
ఈ పాటికి ఆయన సైతం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సి ఉన్నా.. తృటిలో ఆ అవకాశం తప్పిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉదయభాను తప్పకుండా నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే స్థితిలో ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, సామినేని ఉదయబాను, మదూసూధన్ రెడ్డి, రియాజ్‌తోపాటు మండలి రాజేష్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
For AndhraPradesh News And Telugu News