Duvvada Srinivasa Rao: వామ్మో దువ్వాడ.. ఇదేం ట్విస్ట్?
ABN , Publish Date - Aug 10 , 2024 | 11:34 AM
చేసిందే పాడుపని అని జనాలంతా అంటున్నారు. అయినా సరే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వెనక్కి తగ్గడమే లేదు. మొగుడిని కొట్టి మొరపెట్టుకున్న చందంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను భార్యాపిల్లలు వేధిస్తున్నారంటూ కేసు పెట్టారు. హవ్వ.. నవ్వి పోదురుగాక..
శ్రీకాకుళం: చేసిందే పాడుపని అని జనాలంతా అంటున్నారు. అయినా సరే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వెనక్కి తగ్గడమే లేదు. మొగుడిని కొట్టి మొరపెట్టుకున్న చందంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను భార్యాపిల్లలు వేధిస్తున్నారంటూ కేసు పెట్టారు. హవ్వ.. నవ్వి పోదురుగాక.. దువ్వాడ దూకుడు కాస్త తగ్గించుకుంటే బెటరని వైసీపీ నేతలంతా చెప్పుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వంద కెమెరాల్లో ఆయన భార్యను కొట్టేందుకు పైప్ అందుకున్న సీన్స్ స్పష్టంగా కనిపిస్తుంటే.. దువ్వాడ మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనను వేధిస్తున్నారంటూ భార్యాపిల్లలపై కేసు పెట్టారు. భార్యాపిల్లలను గాలికి వదిలేసి ఎక్కడబడితే అక్కడ పులిహోర కలుపుతూ పోతే చూస్తూ పాపం వాళ్లు ఊరుకోవాలా? అంటూ స్థానిక ప్రజానీకమంతా దుమ్మెత్తుతోంది. అయినా సరే.. తగ్గేదేలే అంటున్నారు దువ్వాడ.
ఇంట్లో ఎదిరించి మరీ ఏమీ లేని వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుని చాలా తిప్పలు పడ్డానని వాణి చెబుతున్నారు. తన దుస్థితి తన పిల్లలకు రాకూడదే ఈ పోరాటమని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా తల్లీకూతుళ్లు దువ్వాడ ఇంటి ఎదుట పోరాటం చేస్తూనే ఉన్నారు. తమ తండ్రి తమకు కావాలని పిల్లలు.. తన పిల్లలు ఒంటరి వారవ్వొద్దని తల్లి పోరాడుతున్నారు. దువ్వాడ ఇంటి ఆరుబయటనే భార్య వాణి, పెద్ద కుమార్తె హైందవి నిద్రించారు. ఆ సమయంలో దువ్వాడ ఇంట్లోనే ఉన్నారు. సమష్యకు పరిష్కారం లభించేంత వరకూ అక్కడి నుంచి కదిలేదే లేదని తల్లీకూతురు భీష్మించారు. ఆ సమయంలో దువ్వాడ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఒకానొక దశలో బయటకు వచ్చి భార్యాకూతురితో వాగ్వాదానికి దిగారు. వారిపై చేయి చేసుకోబోయారు. పోలీసులు ఆపితే కానీ ఆగలేదు.
పైగా ఒక పైపుని తీసుకుని వారిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒకరకంగా దువ్వాడ చేసింది హత్యాయత్నమే.. పోలీసులు అడ్డుకోకుంటే ఏం జరిగేదో కూడా ఊహించలేం. అలాంటి దువ్వాడ తనపై హత్యాయత్నం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎలాగైనా లాయర్ బుర్ర కదా.. తిమ్మిని బమ్మిని చేసేద్దాం అనుకుని ఉండొచ్చు. తన ఇంటి గేట్లు విరగ్గొట్టి లోపలికి వచ్చారని.. తనకు రక్షణ కల్పించి వాణితో పాటు ఆమె అనుచరులను అరెస్ట్ చేయాలని కోరారు. దువ్వాడ ఫ్యామిలీ హైడ్రామా అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. రాత్రంతా దువ్వాడ రచ్చ చూసి.. తెల్లారిపాటికి ఏమీ ఎరుగనట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం వంటి వ్యవహారాలన్నీ చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.