Share News

Pinnelli: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్..!

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:50 PM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే.. పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్ పడింది..

Pinnelli: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్..!

అమరావతి/నెల్లూరు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే.. పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్ పడింది. కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు స్టేషన్‌కు చేరడం, ఇవాళ సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు మాజీ ఎమ్మెల్యేను జైలు అధికారులు రిలీజ్ చేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శనివారం ఉదయం లేదా మధ్యాహ్నం పిన్నెల్లి బెయిల్‌పై (Pinnelli Bail) విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియవచ్చింది. వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు (AP High Court) కండిషన్ బెయిల్ మంజూరు చేయడంతో రాత్రికే జైలు నుంచి పిన్నెల్లి రిలీజ్ అవుతారని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు భావించారు. ఈ క్రమంలోనే మాచర్ల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, అనుచరులు తరలివచ్చారు కూడా. ఇక పోలీసులు సైతం సెంట్రల్ జైలు వద్ద భారీగా మోహరించారు. ఇక రిలీజ్ చేయడమే ఆలస్యం అనుకుంటూ ఉండగా.. సమయం లేకపోవడంతో బ్రేక్ పడింది. దీంతో పిన్నెల్లి అభిమానులు కొందరు నిరాశతో వెనుదిరగగా.. మరికొందరు నెల్లూరులోనే ఉండిపోయారు.


Pinnelli-Ramakrishna-Reddy.jpg

ర్యాలీలు లేవ్..!

ఇదిలా ఉంటే.. భారీ ర్యాలీలు, మీడియాతో మాట్లాడటం ఇవన్నీ చేయకూడదని ఇప్పటికే క్లియర్ కట్‌గా పిన్నెల్లికి జైలు అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే రిలీజ్ సమయంలో సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు భారీగానే బందోబస్తుగా ఉన్నారు. అంతేకాదు.. గుంటూరులో కానీ, మాచర్లలో కూడా బైక్ ర్యాలీలు అంటూ హడావుడి లేకుండా ఉండాలని కూడా స్పష్టంగా పిన్నెల్లికి పోలీసులు సూచించినట్లుగా తెలియవచ్చింది. అసలే కండిషన్ బెయిల్ కావడంతో ఇందుకు తగ్గట్టుగానే రామకృష్ణారెడ్డి వ్యవహరించాల్సి ఉంది. లేని పక్షంలో మళ్లీ సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పిన్నెల్లి ఏం చేయబోతున్నారు..? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారా..? లేదా..? అనేది తెలియట్లేదు. రామకృష్ణారెడ్డి జైలులో ఉన్నప్పుడు జగన్ ములాఖత్ అయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నెల్లూరు సెంట్రల్ నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్ రెడ్డిని కలుస్తారా లేకుంటే ఇంటికెళ్లొచ్చిన తర్వాత ప్రత్యేకంగా వెళ్లి కలుస్తారా..? అని అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు.


YS-Jagan-At-Pinnelli.jpg

కండిషన్స్ అప్లై..!

ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారీ హైకోర్టు షాకివ్వగా.. శుక్రవారం మధ్యాహ్నం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 50 వేల రూపాయలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పూచీకత్తులతో పాటు.. పాస్ పోర్టును సరెండర్ చేయాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. ప్రతి వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కూడా క్లియర్ కట్‌గా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు.. పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 08:50 PM