ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో గళమెత్తుతా
ABN , Publish Date - Dec 02 , 2024 | 05:16 AM
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని, ఈ అంశాన్ని బీఎస్పీ ఇంటింటి ఉద్యమంగా మారుస్తుందని ఆ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు.
బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్
కూర్మన్నపాలెంలో పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా
కూర్మన్నపాలెం (విశాఖపట్నం), డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని, ఈ అంశాన్ని బీఎస్పీ ఇంటింటి ఉద్యమంగా మారుస్తుందని ఆ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు. విశాఖ నగరంలోని కూర్మన్నపాలెంలో ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కూడలిలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో గళం విప్పుతానని హామీ ఇచ్చారు. విభజనవాదాన్ని పెంచి పోషిస్తూ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి 23 ప్రభుత్వ సంస్థలను, విశాఖ ఉక్కు పరిశ్రమను నిస్సిగ్గుగా అమ్మకానికి పెట్టిన బీజేపీకి నూకలు చెల్లే సమయం ఆసన్నమయిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అదానీలకు వెళ్లిపోతే పేద, బడుగు, బహుజనులకు కొలువులు, జీవనాధారం ఉండవన్నారు. సొంత గనులను కేటాయిస్తే విశాఖ ఉక్కు లాభాల్లోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.