Share News

Amaravati : 8 మంది వీసీల రాజీనామా

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:02 AM

ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీతో అంటకాగిన యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం మూడు యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయగా, శుక్రవారం మరికొంత మంది రాజీనామా చేశారు.

Amaravati : 8 మంది వీసీల రాజీనామా

అందులో వివాదాస్పద ఏయూ వీసీ ప్రసాదరెడ్డి

నేడు మరికొంతమంది చేసే చాన్స్‌

ఆంధ్రా వర్సిటీలో విద్యార్థి సంఘాల సంబరాలు

నేడు మరికొంతమంది చేసే అవకాశం

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీతో అంటకాగిన యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం మూడు యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయగా, శుక్రవారం మరికొంత మంది రాజీనామా చేశారు. ఇప్పటివరకూ ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఎస్వీయూ వీసీ శ్రీకాంత్‌రెడ్డి, జేఎన్‌టీయూ-అనంతపురం వీసీ శ్రీనివాసరావు, ఎస్‌కేయూ వీసీ హుస్సేన్‌రెడ్డి, విక్రమ సింహపురి వీసీ జీఎం సుందరవల్లి, ద్రావిడ యూనివర్సిటీ వీసీ కొలకలూరి మధుజ్యోతి, కృష్ణా వీసీ జ్ఞానమణి, వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివ మూర్తి రాజీనామాలు చేశారు. అలాగే యూనివర్సిటీల రిజిస్ర్టార్‌లు, రెక్టార్‌లు కూడా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీకి అనుకూల వ్యక్తులుగా గుర్తింపు పొందడంతో వీరిని వైసీపీ ప్రభుత్వం వీసీలుగా నియమించింది. వీరిలో ఏయూ వీసీ అత్యంత వివాదాస్పద వీసీగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆయన వైసీపీ కార్యకర్త తరహాలో పనిచేశారు. యూనివర్సిటీని వైసీపీ అడ్డాగా మార్చారు. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పనిచేశారు. సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు చేయడం యూనివర్సిటీలో అలవాటుగా మార్చారు. ఈ స్థాయిలో విధేయుడిగా ఉన్న ఆయనకు రెండో సారి వీసీగా అవకాశం లభించింది. ఇక కొద్దినెలల కిందట శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా నియమితులైన శ్రీకాంత్‌రెడ్డి నియామకమే వివాదం అయ్యింది. ఆయనపై వ్యక్తిగతంగా కూడా అనేక ఆరోపణలు ఉన్నా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసుతో ఆయన్ను వీసీగా నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మనిషిగా గుర్తింపు పొందిన నాగార్జున యూనివర్సిటీ వీసీ పి.రాజశేఖర్‌ మాత్రం రాజీనామా చేయలేదు. పైగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే తెలుగుదేశం నాయకులకు శుభాకాంక్షలు చెబుతూ యూనివర్సిటీలో ఫ్లెక్సీ పెట్టించారు. ఈ ప్రభుత్వంలోనూ వీసీగా కొనసాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


‘నన్నయ్య’లో 20 కోట్ల బిల్లుల చెల్లింపు యత్నాలు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ పద్మరాజు శనివారం రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈలోగా దాదాపు రూ.20 కోట్ల పాత బిల్లులు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్సిటీలో అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ సహకారంతో గతంలో ఆమోదం పొందిన బిల్లులు ఇప్పుడు విడుదల చేస్తున్నారు. పాత తేదీలు వేసే ప్రక్రియ శుక్రవారం రాత్రి మొదలుపెట్టారు. మొత్తం బిల్లులన్నీ క్లియర్‌ చేసి నేడు రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మిగిలిన వర్సిటీల్లోనూ వరుసగా రాజీనామాలు చేసేందుకు వీసీలే సన్నద్ధమవుతున్నారు. కొందరు తాము వైసీపీకి అనుకూలం కాదంటూ రాజీనామాలు చేయట్లేదు.

ఏయూలో విద్యార్థి సంఘాల సంబరాలు

అత్యంత వివాదాస్పదుడైన ఏయూ వీసీ ప్రసాదరెడ్డి సహా, రిజిస్ర్టార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ రాజీనామాలతో విద్యార్థి, అధ్యాపక సంఘాలు ఆనందాన్ని వ్యక్తంచేశాయి. ఏయూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఐదేళ్ల నుంచి వీసీ ప్రసాదరెడ్డి కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఏయూలో ఎట్టకేలకు స్వేచ్ఛా వాతావరణం ఏర్పడిందన్నారు. కాగా, అకడమిక్‌ డీన్‌గా ఉన్న ప్రొఫెసర్‌ కిశోర్‌బాబుకు అడిషనల్‌ చార్జ్‌ను వీసీ ప్రసాదరెడ్డి అప్పగించారు. ఇక, విక్రమ సింహపురి (వీఎస్‌యూ) రిజిస్టర్‌గా రెండేళ్లుగా పనిచేస్తున్న పామూరు రామచంద్రారెడ్డిపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన స్థానంలో సోషల్‌ వర్క్‌ విభాగం అధ్యాపకురాలు సునీతను ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం.

Updated Date - Jun 29 , 2024 | 04:02 AM