AP: చివరి నిమిషం వరకు అప్రమత్తం!
ABN , Publish Date - May 13 , 2024 | 03:41 AM
సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఊహించని స్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, పోలింగ్ చివరి నిమిషం వరకు పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని నిర్దేశించారు.
ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చూడాలి
టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఊహించని స్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, పోలింగ్ చివరి నిమిషం వరకు పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని నిర్దేశించారు. సోమవారం పోలింగ్ సందర్భంగా పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూమ్ నుంచి జిల్లాల పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. జిల్లాల పార్టీల నేతలకు, వార్ రూమ్ బృందం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
విడివిడిగా బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ ఏజెంట్లుగా వెళ్లే కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు నియోజకవర్గాల నుంచి వార్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని నేతలకు సూచించారు. డీప్‌ఫేక్ వీడియోలు, ఫేక్ లేఖలు, పుకార్లు, హింసా రాజకీయాలతో వైసీపీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి పార్టీ నేతలెవరూ విశ్రాంతి తీసుకోవద్దని కోరారు. కాగా, సోమవారం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్‌రూమ్ నుంచి పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.