Share News

Jagan: సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్

ABN , Publish Date - Aug 13 , 2024 | 12:38 PM

మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని.. చివరకు మోసం చేస్తున్నాడన్నారు.

Jagan: సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్

అమరావతి: మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, కానీ చివరకు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా అప్పట్లో తన ప్రభుత్వం సాకులు చూపలేదని, మాట తప్పుకుండా మేనిఫెస్టోని అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేశామన్నారు. ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే శ్రీరామ రక్ష అని నమ్మామని అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు. తాను పలావు ఇచ్చానని.. బాగానే చూసుకున్నాననని ప్రజలు అంటున్నారన్నారని జగన్ పేర్కొన్నారు.


చంద్రబాబు మాత్రం బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని జగన్ విమర్శించారు. తాను ఉండి ఉంటే.. రైతు భరోసా అందేదన్నారు. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లులకు అమ్మ ఒడి అందేదన్నారు. సున్నా వడ్డీ కూడా వచ్చి ఉండేదన్నారు. విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్‌‌మెంట్‌, వసతి దీవెన వచ్చేదన్నారు. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేదన్నారు. ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయిందన్నారు. జన్మభూమి కమిటీల చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తోందన్నారు.


ఆరోగ్య శ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదని.. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కూడా పూర్తిగా దిగజారిపోయిందన్నారు. ప్రస్తుతం రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోందన్నారు. కక్షలు తీర్చుకునేవారిని పోత్సహించేలా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఈ మోసాలను చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందన్నారు. మళ్లీ మన పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని జగన్ అన్నారు. మొత్తానికి జగన్ అయితే ప్యాలెస్‌లు వీడి కాస్త నేతలను కలుస్తున్నారు. పైగా క్షేత్ర స్థాయి నేతలను కలవడం ఒకింత పార్టీ నేతలు సంతోషించదగిన పరిణామం. ఇప్పటి వరకూ ఒకరిద్దరు నేతలతో తప్ప జగన్ కీలక నేతలను సైతం దగ్గరకు రానివ్వలేదు. ఎవ్వరినీ కలవలేదు. ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో కలవడం ఆసక్తికరంగా మారింది. అందుకే క్షవరమైతే కానీ వివరం రాదంటారు పెద్దలు.

Operation Akarsh: మరోసారి ఆకర్ష.. ఆకర్ష!

CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2024 | 01:10 PM