Share News

బాబుపై దాడి కేసులో నలుగురి అరెస్టు

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:13 AM

జగన్‌ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీ సులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ దాడితో సంబంధం ఉన్న నలుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.

బాబుపై దాడి కేసులో నలుగురి అరెస్టు

  • 2022లో నందిగామలో రాళ్ల దాడి.. సీఎస్‌వోకు గాయం

  • నందిగామ వైసీపీ ఆఫీసులో దాడికి పథకం

  • దర్యాప్తును తేలిగ్గా తీసుకున్న నాటి సీపీ కాంతిరాణా

  • రెండేళ్ల తర్వాత కేసులో కదలిక.. మరో 13 మంది పాత్ర

విజయవాడ/నందిగామ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీ సులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ దాడితో సంబంధం ఉన్న నలుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. నందిగామకు చెందిన సజ్జనరావు, బెజవాడ కార్తీక్‌, పరిమి కిశోర్‌, కంచికచర్ల ఏఎంసీ మాజీ చైర్మన్‌ మార్త శ్రీనివాసరావును అరెస్టు చేశారు. 2022 నవంబరు 4న బాదుడే బాదుడు కార్యక్రమంలో నందిగామ రైతుబజార్‌ వద్ద ఈ రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుసూదన్‌ ముఖానికి గాయమైంది. నాడు జగన్‌ ప్రభుత్వంలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఘటన జరిగిన తర్వాత అప్పటి పోలీసు అధికారులు ఐపీసీ 124 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి వదిలేశారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు కదలిక వచ్చింది. కేసును పునః దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు కొత్తగా ఐపీపీ 120(బి), 324, 307, 353 సెక్షన్లు చేర్చారు. సీసీ కెమెరాల డీవీఆర్‌ల ద్వారా అప్పటి ఫుటేజీలను పరిశీలించారు. కాల్‌ డేటా రికార్డ్‌ (సీడీఆర్‌) డంప్‌ తీయించారు. దాడిలో నలుగురి పాత్ర ఉందని ఏసీపీ ఏబీజీ తిలక్‌, నందిగామ ఇన్‌స్పెక్టర్‌ వైవీవీఎల్‌ నాయుడు వెల్లడించారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం జరగడానికి గంట ముందు... నందిగామ వైసీపీ కార్యాలయంలోనే ఈ దాడికి స్కెచ్‌ వేశారన్నారు.


  • నిందితులకు నేరచరిత్ర

నిందితుల్లో కన్నెగంటి సజ్జనరావుపై నందిగామ పీఎస్‌లో 4 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. పీడీఎఫ్‌ పత్రికను నడుపుతూ వైసీపీకి అనుచరుడిగా ఉంటున్నాడు. వైసీపీ హయాంలో దందాలు, బెదిరింపులు చేసి భారీగా ఆస్తులు కూటగట్టాడు. మార్త శ్రీనివాసరావుపై 13 కేసులున్నాయి. నందిగామ సబ్‌ డివిజన్‌లో ఆరు కేసులు, ప్రకాశం జిల్లాలోనూ అతడిపై కేసులున్నాయి. బెజవాడ కార్తీక్‌ కూలీగా పనిచేస్తాడు. అతడి పై నందిగామ పీఎస్‌లో ఐదు కేసులు ఉన్నాయి. పరిమి కిషోర్‌ ఆటోడ్రైవర్‌.

  • మొండితోక సోదరుల పాత్ర?

దాడి జరిగిన సమయంలో మొండితోక జగన్మోహన్‌రావు నందిగామ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు మొండితోక అరుణ్‌కుమార్‌ ప్రస్తుత ఎమ్మెల్సీ. ప్రస్తుతం పోలీసులు అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులు తమ వాంగ్మూలంలో మొత్తం 13 మంది పేర్లను ప్రస్తావించారు. వారిలో మొండితోక సోదరుల పేర్లు కూడా ఉన్నట్టు తెలిసింది.

  • నాడు ఏం జరిగిందంటే...

వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. అప్పటికే ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయం తో జోష్‌ మీద ఉన్న టీడీపీ శ్రేణులు.. నందిగామలో నిర్వహించిన బాదుడే బాదుడుకు భారీగా తరలివచ్చారు.ఈ స్పందన చూసి జీర్ణించుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాల్లో అలజడి సృష్టించాలని కుయుక్తులు పన్నారు. నందిగామలోని రైతుబజారు వద్దకు చంద్రబాబు చేరుకునే సమయానికి వీధి లైట్లను ఆర్పివేశారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో చంద్రబాబు సీఎ్‌సవో మధుసూదన్‌ గాయపడ్డారు. దీనివెనుక వైసీపీ కుట్ర ఉందని చంద్రబాబు, టీడీపీ నేతలు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసును అప్పటి పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తేలికగా తీసుకున్నారు. అర్ధరాత్రి హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. టీడీపీ శ్రేణులు విసిరిన పూల దండలు తగిలి సీఎ్‌సవోకు గాయమైందన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 03:16 AM