Share News

Collector's Conference : సోది చెబుతానమ్మ..సోది!

ABN , Publish Date - Dec 13 , 2024 | 04:01 AM

రెండు రోజులు... 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు... భారీ సంఖ్యలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు... అంతా కలిసి 26 గంటలకు పైగా చర్చలు! అంతిమంగా... ‘మనకు ఏం చెప్పారు? జిల్లాలకు వెళ్లి ఏం చేయాలి?’

Collector's Conference : సోది చెబుతానమ్మ..సోది!
Andhra Pradesh IAS Officers

  • గాడి తప్పిన కలెక్టర్ల సదస్సు.. కొందరు సీనియర్‌ ఐఏఎ్‌సల మెహర్బానీ

  • సూటిగా చెప్పకుండా సాగదీత.. సీఎం వారిస్తున్నా వినకుండా స్పీచులు

  • గంటలకొద్దీ ప్రజెంటేషన్లు.. లక్ష్య నిర్దేశంపై స్పష్టత కరవు

  • అక్కర్లేని అంశాలకే టైం స్వాహా.. కీలక అంశాలపై నామమాత్ర చర్చ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రెండు రోజులు... 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు... భారీ సంఖ్యలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు... అంతా కలిసి 26 గంటలకు పైగా చర్చలు! అంతిమంగా... ‘మనకు ఏం చెప్పారు? జిల్లాలకు వెళ్లి ఏం చేయాలి?’ అని కలెక్టర్లు ప్రశ్నించుకుంటే కళ్లముందు కదలాడేది పెద్ద ప్రశ్నార్థకమే! ఇదీ బుధవారం, గురువారం రెండురోజులపాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ తీరు! కూటమి సర్కారు వచ్చాక జరిగిన రెండో కలెక్టర్ల సదస్సు ఇది! ఆగస్టులో జరిగిన మొదటి సదస్సు ఒకే ఒక్కరోజులో సూటిగా, సుత్తిలేకుండా, కలెక్టర్లకు దిశానిర్దేశం జరిగేలా సాగింది. తాజా సదస్సు అందుకు పూర్తి భిన్నంగా ముగిసిందని కొందరు ఉన్నతాధికారులే పెదవి విరుస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ దృష్టిలో పడి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు సీనియర్‌ ఐఏఎ్‌సలు పారించిన ‘ప్రజెంటేషన్ల వరద’తో అసలు ఉద్దేశం కొట్టుకుపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సూటిగా చెప్పండి. సోది వద్దు’ అని స్వయంగా చంద్రబాబు పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు.


  • సొంత మెహర్బానీ...

ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, లక్ష్యాలపై చర్చించి, వాటి సాధనలో క్షేత్రస్థాయిలో కలెక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకుని, వాటికి పరిష్కారం సూచించడం... గత సదస్సు నుంచి ఇప్పటిదాకా సాధించిన విజయాలను మదింపు చేసుకోవడమే కలెక్టర్లకాన్ఫరెన్స్‌ ముఖ్య ఉద్దేశం. అయితే... కొందరు స్పెషల్‌ సీఎ్‌సలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు దీనిని గాడి తప్పించారు. ‘చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు అంటే ఇష్టం... వాటిద్వారా ఆయనను ఇంప్రెస్‌ చేయవచ్చు’ అనే తప్పుడు భావనతో... ఆయన సహనానికే పరీక్ష పెట్టారు. తమ శాఖల ఉద్దేశాలు, చరిత్ర, వారు సాధించిన విజయాలు, గొప్పల గురించి పేజీల కొద్దీ పీపీటీలు సమర్పించారు. కృష్ణబాబు, సాయి ప్రసాద్‌, రాజశేఖర్‌, సురేశ్‌ కుమార్‌, కన్నబాబు తదితర అధికారులు ప్రజెంటేషన్లకే గంటలకొద్దీ సమయాన్ని గుటుక్కుమనిపించారు. విద్యాశాఖకు సంబంధించి కోన శశిధర్‌ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ గతంలో వేర్వేరు సందర్భంలో చేసిన ప్రసంగాల వీడియోను ప్రదర్శించి గంట గుటుక్కుమనిపించారు. మహిళా సంక్షేమ శాఖకు చెందిన సూర్యకుమారి... జిల్లాలో తమ శాఖ అధికారులకు చెప్పాల్సిన విషయాలన్నీ కలెక్టర్ల సమావేశంలో చదివి వినిపించారు. సీఎం రోజువారీగా చేసే సమీక్షలకు, ఈ సదస్సుకు తేడా లేకుండా పలువురు కార్యదర్శులు పేజీల కొద్దీ నివేదికలు తీసుకొచ్చారు.


  • అసలు విషయం ఏదీ?

కలెక్టర్ల సదస్సు తొలిరోజు అజెండాను గణాంకాలు, అనుబంధాలు, నివేదికలు, పీపీటీలతో కలిపి 600 పేజీలతో రూపొందించారు. మొదటి రోజున ఎనిమిది అంశాలు చర్చకు రాలేకపోవడంతో... వాటిని గురువారానికి వాయిదా వేశారు. ఇక... రెండోరోజూ అదే పరిస్థితి. చివరికి... అత్యంత కీలకమైన శాంతిభద్రతల అంశంపై చర్చను తూతూమంత్రంగా ముగించారు. ‘సంక్షేమం’పైనా అదే పరిస్థితి. కలెక్టర్లు క్లుప్తంగా ముగించినా... కొందరు ఉన్నతాధికారులు మాత్రం తమ మెహర్బాణీ కోసం అనవసరమైన ప్రసంగాలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారించినా ఫలితంలేకుండా పోయింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ మాత్రం తన శాఖకు చెందిన పీపీటీని పది నిమిషాల్లో సూటిగా, క్లుప్తంగా ముగించారు.

  • సందేహాలకు సమాధానాల్లేవ్‌..

సమావేశాలు షెడ్యూలు ప్రకారం జరగలేదు. పైగా... ఒకరు చెప్పిందే మరొకరు చెప్పడంతో పునరుక్తులు దొర్లాయి. ఇంతా చేసి... కలెక్టర్లు అడిగిన సందేహాలకు చాలామంది కార్యదర్శులు సమాధానాలు చెప్పలేకపోయారు. సాగునీరు, గృహ నిర్మాణం, విద్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల్లో పెండింగ్‌ అంశాలపై సీఎం అడిగిన ప్రశ్నలకూ సమాధానాల్లేవు. ప్రభుత్వ పాలన, పథకాల అమలు, సమస్యల పరిష్కారంపై ప్రజా స్పందన తెలియచేసే నివేదికపై చంద్రబాబు సందేహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధిత అధికారి సురేశ్‌ కుమార్‌ సరైన సమాధానం ఇవ్వలేదు. ప్లానింగ్‌, రెవెన్యూ విభాగాలు, సీఎంవోల మధ్య సమన్వయ లోపం వల్లే కలెక్టర్ల సదస్సు ఇలా జరిగిందని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 13 , 2024 | 10:51 AM