Share News

CM Chandrababu : ఇది దేవుడు రాసిన స్ర్కిప్ట్‌!

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:46 AM

ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని, కల్మషం లేకుండా ముక్కుసూటితనంగా మాట్లాడటం ఆయన నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

CM Chandrababu : ఇది దేవుడు రాసిన స్ర్కిప్ట్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ను నాడు రాష్ట్రానికి రానివ్వలేదు.. నేడు ఆయన ముందు కూర్చోలేని దుస్థితి జగన్‌ది

కల్మషం లేని వ్యక్తి రఘురామకృష్ణరాజు పోరాడి గెలిచాడు.. ఉపసభాపతి అయ్యాడు.. ముక్కుసూటితనమే ఇబ్బందికి గురిచేసింది

సొంత ఎంపీని వైసీపీ ప్రభుత్వం టార్చర్‌ చేసింది.. లాఠీలు, రబ్బరు బెల్టులతో కొట్టారు.. చంపేస్తామని బెదిరించారు...చంపడానికీ ప్లాన్‌ చేశారు

అయ్యన్నను, నన్నూ ఇబ్బంది పెట్టారు.. ఆయన చివరకు స్పీకరు అయ్యారు..నేను సీఎంగా గౌరవ సభలో అడుగుపెట్టా.. శాసనసభలో సీఎం

అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని, కల్మషం లేకుండా ముక్కుసూటితనంగా మాట్లాడటం ఆయన నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అలా నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడటమే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. దేశ చరిత్రలో ఏ ఎంపీకి ఎదురుకాని దారుణమైన దుస్థితిని ఆయన చూశారని, ఆ పరిస్థితి నుంచి పోరాడి గెలిచి ఇప్పుడు ఉపసభాపతి స్థానానికి వచ్చారని సీఎం కొనియాడారు. అంతకుముందు..ఉపసభాపతిగా రఘురామ కృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, జ్యోతుల నెహ్రూ తదితరులు ఆయనను పోడియం వద్ద సభాస్థానానికి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. పోడియం పైకి వెళ్లేముందు సీఎం కాళ్లకు ఆర్‌ఆర్‌ఆర్‌ నమస్కారం చేశారు. ఎమ్మెల్యేలంతా సభాస్థానం వద్దకు వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌కు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఆయనే సభను నడిపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ తాతగారు జి.ఎ్‌స.రాజు రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారని, అప్పటినుంచే వారికి రాజకీయ వారసత్వం ఉందన్నారు. గత ప్రభుత్వంతో విభేదించిన కారణంగా సొంత ఎంపీ అని కూడా చూడకుండా జగన్‌ ప్రభుత్వం అత్యంత దారుణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను హింసించిందన్నారు. ‘‘సొంత ఎంపీపైనే నాటి వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసుపెట్టారు. 2021 మే 14న ఆర్‌ఆర్‌ఆర్‌ పుట్టినరోజు నాడే హైదరాబాద్‌ వెళ్లి బలవంతంగా అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. శని, ఆదివారాల్లో కోర్టులకు సెలవు అని కావాలనే శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన రోజు రాత్రి గుంటూరు సీఐడీ ఆఫీసులో ఐదుగురు ముసుగు వేసుకుని వచ్చి అత్యంత దారుణంగా కొట్టారు. లాఠీలు, రబ్బరు బెల్టులతో కాళ్లపై కొట్టారు. కోర్టులో కొట్టిన విషయం చెబితే సాయంత్రం కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారు. అయినా భయపడకుండా కోర్టులో కాళ్లకు ఉన్న దెబ్బలను ఆర్‌ఆర్‌ఆర్‌ చూపించారు. కోర్టు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆదేశిస్తే, కావాలని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడకూడా రిపోర్టులు తారుమారుచేశారు. మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్టు సాయంత్రం 6గంటలకు కోర్టుకు సమర్పించారు. ఈలోగా మేం సుప్రీంకోర్టుకు వెళ్లాం. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లో మిలటరీ ఆసుపత్రిలో ఆర్‌ఆర్‌ఆర్‌ చేరారు. అక్కడ కూడా రిపోర్టులు మార్చాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు. సభ్యత కాదు కాబట్టి ఆయన పేరు ఇక్కడ చెప్పట్లేదు. అయినా అక్కడితో కక్ష ఆపకుండా ఆయనను వేధించే ప్రయత్నం చేశారు. అప్పట్లో నర్సాపురం ఎంపీగా ఉన్న ఆయనను సొంత నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు రానివ్వలేదు. హైదరాబాద్‌ నుంచి సభకు వచ్చేందుకు రైలులో బయలుదేరినా, సత్తెనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతంలో బోగిని తగలబెట్టి చంపాలని ప్లాన్‌ చేశారని తెలిసి, అక్కడే రైలు దిగిపోయారు’’ అని చంద్రబాబు వివరించారు.


పాబ్లో ఎస్కోబార్‌తోనే పోల్చగలం

‘‘ప్రపంచ డ్రగ్స్‌ స్మగ్లర్‌ పాబ్లో ఎస్కోబార్‌, జగన్‌ల వ్యక్తిత్వం, ఆలోచనా విధానం ఒక్కటే. ఎస్కోబార్‌ ప్రపంచంలో 80శాతం డ్రగ్స్‌ మార్కెట్‌ను శాసించాడు. ఇక్కడ రాష్ట్రంలో జగన్‌ గంజాయి, డ్రగ్స్‌ను తీసుకొచ్చాడు’’ అని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదనీ, ప్రజలు ఇవ్వాలని సీఎం తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌తో సభలో ఉల్లాసం: స్పీకర్‌

రఘురామ కృష్ణరాజు ఉపసభాపతి కావడం తనకు చాలా ఆనందంగా ఉందని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన ఉపసభాపతి కావడం వల్ల సభ మంచి ఉల్లాసంగా మారుతుందన్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ను నాడు జైల్లో కొడుతుంటే సెల్‌ఫోన్‌లో జగన్‌ చూశారు. మొదట ఈ విషయం చెబితే మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను. కానీ నన్ను జైల్లో పెట్టి నా గదిలో సీసీ కెమెరాలు పెట్టినప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాను. ఆయనను అన్ని విధాలుగా వేధించి నాడు రాష్ర్టానికి రానివ్వలేదు. నేడు ఆయన ముందు కూర్చోలేని దుస్థితి జగన్‌ది. ఇది దేవుడు రాసిన స్ర్కిప్ట్‌. వైనాట్‌ 175 అంటే చివరికి 11తో ప్రజలు సరిపెట్టారు’’.

- సీఎం చంద్రబాబు

Updated Date - Nov 15 , 2024 | 03:46 AM