Tirumala: గంటా, రెండు గంటల్లో స్వామి దర్శనమయ్యేలా..!
ABN , Publish Date - Dec 24 , 2024 | 01:21 AM
నాలుగైదు కిలోమీటర్ల పొడవైన క్యూలైన్లలో.. చిన్నపిల్లలు, వృద్ధులతో 20 నుంచి 30 గంటల పాటు నిరీక్షిస్తూ ఆగచాట్లు పడకుండా.. కేవలం గంట నుంచి రెండు గంటల వ్యవఽధిలోనే తిరుమల వెంకన్న దర్శనం చేయించేందుకు టీటీడీ ధర్మకర్తలమండలి, ఉన్నతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తిరుమల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నాలుగైదు కిలోమీటర్ల పొడవైన క్యూలైన్లలో.. చిన్నపిల్లలు, వృద్ధులతో 20 నుంచి 30 గంటల పాటు నిరీక్షిస్తూ ఆగచాట్లు పడకుండా.. కేవలం గంట నుంచి రెండు గంటల వ్యవఽధిలోనే తిరుమల వెంకన్న దర్శనం చేయించేందుకు టీటీడీ ధర్మకర్తలమండలి, ఉన్నతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సిబ్బందితో అవసరం లేకుండా టోకెన్ పొందడం, తిరిగి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ప్రవేశించేందుకు ‘ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ’ విధానంపై సోమవారం తిరుమలలో ఓ సంస్థ డెమో ఇచ్చింది.
కియాస్క్ ద్వారా టోకెన్
తిరుపతి, తిరుమలలోని పలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కియాస్క్ యంత్రాలు ఏర్పాటు చేస్తారు. ఆ యంత్రం ముందు నిలబడితే కెమెరా ఆన్ అవుతుంది. ప్రింట్ అనే ఆప్షన్‌ను నొక్కితే ఫేస్‌ను స్కాన్ చేసి దర్శన తేది, సమయంతో కూడిన ఓ టోకెన్ ప్రింట్ వస్తుంది.
ఫేషియల్ రికగ్నిషన్ బ్యారియర్ గేట్ ద్వారా ప్రవేశం
టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి పది నిమిషాలు అటుఇటుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకోవాలి. అక్కడ ఫేషియల్ రికగ్నిషన్ బ్యారియర్ గేటు ముందు నిలబడితే అక్కడ కూడా కెమెరా ద్వారా ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ జరుగుతుంది. ఓ చిన్నశబ్ధం వచ్చాక భక్తుడు ముందుకు వెళ్లేలా గేట్లు ముందుకు కదులుతాయి. ఒకవేళ ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియలో లోపం ఉంటే టోకెన్‌ను బ్యారియర్ గేట్‌పై ఉండే ముద్రపై పెడితే కూడా బార్‌కోడ్ స్కాన్ చేసి గేట్లు తెరుచుకుంటాయి. ఈ డెమోను చూసిన అధికారులు పలు సూచనలు చేశారు. మరికొన్ని సంస్థల డెమోను కూడా పరిశీలించనున్నారు.
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలో జరగనుంది. బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు అన్నమయ్య భవనంలో సమావేశం కానున్నారు. దాదాపు 66 అంశాలపై రూపొందించిన అజెండాపై చర్చింనున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఆస్పత్రుల నిర్వహణ, టీటీడీ ఆస్తుల పరిరక్షణ, తిరుమలలోని హోటళ్లలో ఆహారపదార్థాల నాణ్యత పెంపుపై తీసుకోవాల్సిన చర్యలు, శ్రీవారికి నగదు, బంగారు పెట్టుబడులపై ప్రత్యేక నిపుణులతో కమిటీ ఏర్పాటు, తిరుమల విజన్-2047, ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జీ ఏర్పాటుతో పాటు పలు ముడిసరుకుల కొనుగోళ్లపై చర్చించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా టీటీడీ చేస్తున్న వృథా ఖర్చుల నియంత్రణపైనా చర్చిస్తారని తెలిసింది.