Share News

ఏనుగు దాడా.. రోడ్డు ప్రమాదమా?

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:44 AM

ఏనుగు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తిని తొక్కి చంపేసిందని పోలీసులు చెబుతున్నారు. అదేమీ లేదు.. వాహనం ఢీకొని ఆ వ్యక్తి చనిపోయాడని అటవీశాఖ అంటోంది.

ఏనుగు దాడా.. రోడ్డు ప్రమాదమా?

  • మొగిలి ఘాట్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

  • పోలీసు, అటవీశాఖ భిన్న ప్రకటనలు

బంగారుపాళ్యం, జూన్‌ 23: ఏనుగు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తిని తొక్కి చంపేసిందని పోలీసులు చెబుతున్నారు. అదేమీ లేదు.. వాహనం ఢీకొని ఆ వ్యక్తి చనిపోయాడని అటవీశాఖ అంటోంది. మొగిలిఘాట్‌లో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతిపై రెండు శాఖలు ఇలా పరస్పర ప్రకటనలు చేశాయి. వివరాలిలా ఉన్నాయి. బంగారుపాళ్యం మండలం.. చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిలోని మొగిలి ఘాట్‌రోడ్డులో శనివారం రాత్రి 55- 60 ఏళ్ళలోపు ఓ గుర్తుతెలియని వ్యక్తిని ఏనుగు తొక్కిచంపేసిందని అటువైపుగా వాహనాల్లో వెళుతున్న వారు 112కు ఫోన్‌చేసి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌రూముకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి బంగారుపాళ్యం పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ వ్యక్తి ఘాట్‌రోడ్డు పక్కనే చనిపోయి ఉన్నాడు.


సంఘటనా స్థలం నుంచే పోలీసులు పలమనేరు, బంగారుపాళ్యం రేంజ్‌ అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వాళ్లూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఏనుగుదాడిలో మృతి చెందినట్లు అనవాళ్లు కనపడటం లేదని చెప్పారు. జాతీయ రహదారి కావడంతో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉంటుందని ఫారెస్టు అధికారులు చెప్పారు. పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. గౌనివానిచెరువు నుంచి రోడ్డుకు అటువైపు దాటుతున్న ఏనుగు ఆ దారిలో పలమనేరు వైపుగా వెళుతున్న వ్యక్తిని తొండంతో పట్టి తలపై కొట్టడంతోనే రోడ్డుపై పడి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఇలా విభిన్న అభిప్రాయాల నేపథ్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు పింక్‌ కలర్‌ షర్టు, బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంటు ధరించి వున్నాడు. మృతుడి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఏనుగుదాడిలో ఈ వ్యక్తి మృతి చెందినట్లు ఏఎ్‌సఐ రామచంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదని స్థానికులు అంటున్నారు.


తరచూ ఏనుగుల సంచారం

ఇక, మొగిలిఘాట్‌లో తరచూ ఏనుగుల గుంపు ఇటువైపు నుంచి రోడ్డుకు అటువైపుగా ఉన్న అటవీప్రాంతంలోకి వెళుతుంటాయి. మామూలుగా అయితే ఆ దారిలో వెళ్లే వాహనదారులు ఏనుగుల గుంపు వెళుతుంటే దూరంగా వాహనాలను ఆపి, అవి రోడ్డును దాటుకున్న తరువాత రాకపోకలు సాగిస్తారు. రెండేళ్ల క్రితం ట్రాకర్‌ చిన్నబ్బను కొద్దిదూరంలో ఓ ఏనుగు తొక్కి చంపేసింది. అదేవిధంగా అరకిలోమీటరు దూరంలో ఏనుగు గుంపు రోడ్డు దాటుతుంటే మినీలారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. తరచూ రోడ్డు దాటుతున్న సమయంలో ఏనుగుల నుంచి ప్రమాదం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రోడ్డు పక్కనే పెద్ద కందకం తవ్వడం లేదా సోలారు కంచె ఏర్పాటు చేస్తే రోడ్డుదాటకుండా ఆపవచ్చని ప్రయాణికులు, స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 05:36 PM