Share News

TDR BONDS: ‘రోడ్డు’పైకి టీడీఆర్‌ అవినీతి!

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:32 AM

తిరుపతిలో వెలుగుచూసిన ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) బాండ్ల అవినీతి వ్యవహారం రోడ్డుపైకి వచ్చింది.

TDR BONDS: ‘రోడ్డు’పైకి టీడీఆర్‌ అవినీతి!
తిరుపతిలో రోడ్డు

తిరుపతి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వెలుగుచూసిన ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) బాండ్ల అవినీతి వ్యవహారం రోడ్డుపైకి వచ్చింది. వైసీపీ హయాంలో వేసిన మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల వెంబడి పది ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. ఇంటింటికీ వెళుతున్నాయి. రోడ్డుకు నష్టపోయిన స్థలమెంత? టీడీఆర్‌ బాండు విలువెంత? అన్న కోణంలో విచారిస్తున్నాయి.

ఎన్నికల వేళ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లనే ఐకాన్‌గా చూపించిన వైసీపీ పెద్దలకు టీడీఆర్‌ బాండ్ల జారీలో జరిగిన అవకతవకల ఉచ్చు బిగుస్తోంది. కూటమి అధికారంలోకి రాగానే టీడీఆర్‌ బాండ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. డీఎంఏకు చేరిన నివేదికపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలకు చెందిన పది మంది టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను క్షేత్రస్థాయి పరిశీలినకు వెళ్లమని రాష్ట్రప్రభుత్వ టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ విద్యుల్లత ఆదేశాలు జారీ చేశారు. తిరుపతికి చేరుకున్న ఆ పది మంది అధికారుల్లో.. ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున తిరుపతి టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలను కేటాయించారు. ఒక్కో బృందానికి 40 నుంచి 45 టీడీఆర్‌ బాండ్లను అప్పగించి రోడ్డుకు ఒకరు చొప్పున డోర్‌డోర్‌ పరిశీలిస్తున్నారు.

విచారణ అధికారులు వీరే

కర్నూలు మున్సిపాల్టీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ (పీవో) బి.విజయభాస్కర్‌, ఆదోని టీపీవో బాలమద్దయ్య బృందం కొర్లగుంట-తిరుమల బైపాస్‌ రోడ్డు.. రాయచోటి టీపీవో లక్ష్మీనారాయణమ్మ బృందం కొర్లగుంట.. తిరుపతి డీసీపీ మహాపాత్ర, నగరి టీపీవో మూర్తి బృందం గొల్లవానిగుంట రోడ్డు, ఒంగోలు పీవో బాబూరావు, యమ్మగనూరు టీపీవో రాజేష్‌ బృందం పూలవానిగుంట, గొల్లవానిగుంట, తొండమాన్‌ చక్రవర్తి రోడ్లు.. బాపట్ల పీవో కాలేషా, ప్రొద్దుటూరు టీపీవో చంద్రమోహన్‌ బృందం డీబీఆర్‌ రోడ్డు.. నెల్లూరు సీపీవో హిమబిందు, గూడూరు టీపీవో నాగవల్లి బృందం అక్కారంపల్లి, కొంకా చెన్నాయగుంట రోడ్డు.. ఏలూరు పీవో సుధాకర్‌, వుడా టీపీఏ రేవతి బృందం కొర్లగుంట.. ఆముద పీవో సత్యమూర్తి, చిత్తూరు టీపీవో సుభప్రద బృందం చింతలచేను, గంగమ్మ ఆలయ రోడ్డు.. కడప డీటీసీపీవో ఆసిఫ్‌, టీపీవో రత్నరాజు బృందం కొర్లగుంట ప్రాంతం, గుంతకల్‌ ఏసీపీ శ్రీనివాసులు, పులివెందుల టీపీవో అజయ్‌కుమార్‌లు గెస్ట్‌లైన్‌, గ్రాండ్‌వరల్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకు సంబంధించి పరిశీలిస్తున్నారు. మరో రెండురోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన జరగనుంది. రోడ్డుకు గిఫ్ట్‌డీడ్‌ ఎంత ఇచ్చారు? ఇచ్చిన స్థలానికి టీడీఆర్‌ బాండ్లు ఎక్కువ ఇచ్చారా? బాండ్లు ఇచ్చిన చోట రోడ్డు వేశారా? వేయకపోతే ఎందుకు వేయలేదు? వంటి వివరాలను సేకరిస్తున్నారు.


సీఐడీ దూకుడు

మరోవైపు సీఐడీ అధికారులూ దూకుడు పెంచారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల పరిధిలో టీడీఆర్‌ బాండ్లు పొంది అనుమానంగా ఉన్న కొన్ని డోర్‌ నెంబర్ల జాబితాను కార్పొరేషన్‌ రెవెన్యూ అధికారులకు వీరు ఇచ్చినట్టు తెలిసింది. వాటికి పన్నులు వేశారా? వేసుంటే ఎంతవేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో సీఐడీ వాళ్లు ఇచ్చిన జాబితాలో కొన్ని డోర్‌ నెంబర్లు రెవెన్యూ విభాగంలో లేనట్టు తెలుస్తోంది. ఈ వారంలో సీఐడీ దర్యాప్తు కొలిక్కిరానున్నట్టు సమాచారం.

Updated Date - Dec 11 , 2024 | 01:32 AM