Share News

Tourism: పర్యాటకంలో తిరుపతికి ప్రాధాన్యం

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:29 AM

పర్యాటకంలో జిల్లాకు, తిరుపతి నగరానికి ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికిగాను (2024-29) మంగళవారం ఏపీ టూరిజం పాలసీని విడుదల చేసింది.

Tourism: పర్యాటకంలో తిరుపతికి ప్రాధాన్యం
తిరుపతి

తిరుపతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పర్యాటకంలో జిల్లాకు, తిరుపతి నగరానికి ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికిగాను (2024-29) మంగళవారం ఏపీ టూరిజం పాలసీని విడుదల చేసింది. ఇందులో ఏడు యాంకర్‌ హబ్‌గా తిరుపతిని గుర్తించారు. టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌, సీ ప్లేన్‌ డెస్టినేషన్లలోనూ చోటు దక్కించుకుంది. కలంకారీ చిత్రకళకు, ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌, ఏపీ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కాకుంటే, టెంపుల్‌ సర్క్యూట్‌లలో శ్రీకాళహస్తికి, బీచ్‌.. ఎకో టూరిజం సర్క్యూట్లలో జిల్లాకు మొండిచేయి చూపించింది. ఈ విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

నూతన టూరిజం పాలసీలో రాష్ట్రంలో ఏడు యాంకర్‌ హబ్‌లను ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాలో విశాఖపట్నం, అరకులోయ, శ్రీశైలం, గండికోట, రాజమహేంద్రవరం, అమరావతితో పాటు తిరుపతికీ చోటు లభించింది. వీటిలో తిరుపతి, అరకులోయ ప్రాంతాలను స్వల్ప, మధ్యకాలిక ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. జిల్లాను ప్రధాన పర్యాటక గమ్యస్థానాలుగా గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ ఒకే రంగానికి పరిమితం కాకుండా యాత్రికులకు వైవిధ్యభరిత అనుభవాన్నిచ్చేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు మైస్‌ టూరిజం (మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సెస్‌ అండ్‌ ఎగ్జిబిషన్స్‌) పరంగానూ తిరుపతిని అభివృద్ధి పరచాలని నిర్ణయించింది.

తిరుపతి కేంద్రంగా పరిసర ప్రాంతాల అభివృద్ధి

యాంకర్‌ హబ్‌ కింద తిరుపతి కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా సులువుగా జిల్లాలోని పర్యాటక గమ్య స్థానాలను చేరుకునేలా రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు వీలు కల్పించనుంది. సామాన్య యాత్రికులను దృష్టిలో వుంచుకుని షటిల్‌ బస్సులు, రెంటల్‌ బైక్‌లు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. పర్యాటక గమ్యస్థానాలు చేరే క్రమంలో మార్గాల వెంబడీ పార్కింగ్‌ లాట్స్‌, పరిశుభ్రమైన రెస్ట్‌ రూమ్స్‌, తాగునీరు, స్పష్టమైన సూచిక బోర్డులు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనుంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ కింద హైవే నిర్మాణాలు, హోటళ్లు, ఆధునిక రవాణా సదుపాయాలు వంటివి కల్పించనుంది. మరోవైపు పర్యాటక రంగం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆసక్తి ఉన్న యువతకు ఆతిథ్య రంగంలోనూ, హస్త కళలలోనూ, టూర్‌ ఆపరేషన్లలో శిక్షణ ఇవ్వనుంది.


టెంపుల్‌ సర్క్యూట్‌.. సీ ప్లేన్‌ డెస్టినేషన్లలో స్థానం

రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన పది టెంపుల్‌ టూరిజం సర్క్యూట్లలో తిరుపతికి స్థానం లభించింది. తద్వారా ఈ ప్రాంతంలోని పేరుమోసిన ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ముఖ్యంగా ఆలయాలున్న ప్రాంతాల అభివృద్ధికి డీటైల్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనుంది. ఏడాది పొడవునా ఆయా ప్రాంతాల్లో ఉత్సవాలు, వేడుకలు నిర్వహించేందుకు వీలుగా క్యాలెండర్‌ రూపొందించనుంది. దీనివల్ల ఆ ప్రాంత ప్రత్యేకత రాష్ట్రవ్యాప్తంగా తెలిసే అవకాశముంది. ఆయా ప్రాంతాలకు టూర్‌ ప్యాకేజీలనూ రూపొందించనుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా సీ ప్లేన్‌ డెస్టినేషన్లుగా ప్రభుత్వం గుర్తించిన ఎనిమిది ప్రదేశాల్లో తిరుపతి కూడా ఉండటం విశేషం. అయితే విశాఖపట్నం, కాకినాడ వంటి చోట్ల నుంచీ సీ ప్లేన్‌ సర్వీసులను జిల్లాలో ఎక్కడికి నడపతారనే దానిపై పాలసీలో స్పష్టత ఇవ్వలేదు.

కలంకారీ సావనీర్‌ షాపులు

హస్త కళలకు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా సావనీర్‌ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ టూరిజం కింద వర్క్‌ షాపులు, ఎగ్జిబిషన్లు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన హస్త కళల జాబితాలో శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ పెయింటింగ్స్‌కు చోటు దక్కింది. ఇప్పటికే ప్రాచుర్యం కలిగిన కలంకారీ చిత్రకళకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ప్రచారాన్ని తెచ్చి పెట్టనుంది.

కలినరీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు ప్రాధాన్యం

పర్యాటక విధానంలో ఫుడ్‌ ఫెస్టివల్స్‌కు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆయా ప్రాంతాలకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలు, వంటలను అందరికీ పరిచయం చేయనుంది. ఆ బాధ్యతను తిరుపతిలోని కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌, రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌పై పెట్టాలని భావిస్తోంది. వీటి ద్వారా ఏడాది పొడవునా ఫుడ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించడం, వేర్వేరు స్థాయిల హోటళ్ల నడుమ పోటీలు నిర్వహించడం, విజేతలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆసక్తి కలిగిన యువతకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయనుంది.

టెంపుల్‌ సర్క్యూట్లలో శ్రీకాళహస్తికి దక్కని చోటు

కాగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పది టెంపుల్‌ సర్క్యూట్లను ఎంపిక చేయగా అందులో పేరు ప్రఖ్యాతులున్న శ్రీకాళహస్తి లేకపోవడం గమనార్హం. పొరుగునే వున్న చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయానికి జాబితాలో స్థానం దక్కగా అంతకంటే పేరున్న శ్రీకాళహస్తిని మాత్రం పర్యాటక శాఖ విస్మరించింది. శ్రీకాళహస్తిలో ముక్కంటి ఆలయంతో పాటు చుట్టుపక్కల అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు అనేకం వున్నాయి. అయినా జాబితాలో ముక్కంటి క్షేత్రం లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

బీచ్‌ టూరిజం సర్క్యూట్లలో మొండిచేయి

బీచ్‌ సర్క్యూట్లుగా శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరును మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసింది. 90 కిలోమీటర్ల మేర సముద్ర తీరాన్ని కలిగిన జిల్లాకు మాత్రం అవకాశం దక్కలేదు. జిల్లాలో వాకాడు, చిల్లకూరు, కోట, చిట్టమూరు, సూళ్లూరుపేట, తడ మండలాలు సముద్ర తీరాన్ని, పులికాట్‌ సరస్సు తీరాన్ని కలిగి ఉన్నాయి. తూపిలిపాలెం బీచ్‌ ఇప్పటికే రోజువారీ పెద్దసంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. తూపిలిపాలెం, శ్రీనివాస సత్రం బీచ్‌లను అభివృద్ధిపరిస్తే పర్యాటకంగా జిల్లాకు గుర్తింపుతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. పాలసీలో దీన్ని విస్మరించారు.

ఎకో టూరిజంలోనూ అంతే

శ్రీకాకుళం-విశాఖ, తూర్పుగోదావరి-గుంటూరు, కర్నూలు-నెల్లూరు... ఈ మూడు జిల్లాలు మాత్రమే ఎకో టూరిజం సర్క్యూట్లుగా ఎంపికయ్యాయి. ఈ జాబితాలోనూ జిల్లాకు మొండి చేయి చూపించింది. వాస్తవానికి శేషాచల పర్వతాలు, వెలిగొండ పర్వతాలు, అడవులతో కూడిన జిల్లాలో ఎకో టూరిజంపరంగా తలకోన, సదాశివకోన, కైలాసకోన, ఉబ్బల మడుగు, మామండూరు వంటి అనేక ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. వీటిని ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి గణనీయ అవకాశాలున్నాయి.

Updated Date - Dec 11 , 2024 | 01:29 AM