Nomads: సంచార జాతులా.. లేరే!
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:57 AM
సంచార జాతులంటే స్థిరంగా ఒక దగ్గర ఉండకుండా తిరుగుతూ ఉండే జనం. ఏడాదిలో కొంత కాలం పాటూ ఒక తావులో ఉండి, వివిధ ప్రాంతాలు తిరిగి వచ్చే వారిని అర్ధ సంచారులు అంటారు.
కొన్ని మండలాల్లో ఇంకా ప్రారంభమే కాని సర్వే
చిత్తూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సంచార జాతులకు స్థిర నివాసాలు కల్పించడం, వారి సంక్షేమానికి కృషి చేయడం కోసం కేంద్రప్రభుత్వం ‘సంచార జాతుల ఆర్థిక సాధికారతా పథకం’(సీడ్)ను ప్రవేశపెట్టింది. రాష్ట్రప్రభుత్వంతో కలిసి ఈ పథకం అమలు మొదలైంది. ఇందుకోసం లబ్ధిదారులను గుర్తించడానికి జిల్లావ్యాప్తంగా సంచారజాతుల సర్వే జరుగుతోంది. పేరుకు సర్వేనే కానీ ఇది తూతూ మంత్రంగానే జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక మండలాల నుంచి ‘మా దగ్గర ఇటువంటి వారు లేరు’ అనే సమాధానం వస్తోంది. నిజానికి ఊళ్లలో పట్టణాల్లో, ఉత్సవాల్లో సంచార జాతుల జనం కనిపిస్తూనే ఉన్నారు. మరి వీరంతా సర్వే పరిధిలోకి ఎందుకు రావడం లేదనే అనుమానం అధికారుల్లో కలుగుతోంది.
మురుగమ్మ, వెంకటేశులు దంపతులకు ఓ కొడుకున్నాడు. యాదమరిలోని చెన్నారెడ్డిపల్లి ధర్మరాజుల గుడిలో నివాసం. వంట, స్నానం, తినడం, పడుకోవడం.. అంతా ఆరుబయటే. పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో తిరుగుతుంటారు. వేడుకల్లో పక్క పిన్నులు, బెలూన్లు అమ్ముకుంటారు. మళ్లీ ఇక్కడికే వచ్చేస్తారు. వీళ్లని పిన్నుదాసర్లు అంటారు. వీరిది సంచార జీవనం. చెన్నారెడ్డిపల్లె చుట్టుపక్కల 50 నుంచి 60 కుటుంబాల సంచార జాతులవారున్నారు. పాములు పట్టడం, బిక్షాటన చేయడం వంటి పనులు చేస్తున్నారు. పక్కా గృహాలను మంజూరు చేసినా ఆర్థిక స్తోమత లేక నిర్మించుకోలేదు. చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాల మేరకు అక్టోబరు 18న ఉమ్మడి జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి సర్వే సూచనలు పంపించారు. ఈ నెల 4న మరోసారి కలెక్టర్ సుమిత్‌కుమార్ సర్వేకి సంబంధించిన సూచనలతో ఆదేశాలు జారీ చేశారు.మండలాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు బాధ్యత వహించి సచివాలయ ఉద్యోగులతో సర్వే చేయించాలి. అయితే నెల దాటినా తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లు సహా చాలా మండలాల్లో ఈ సర్వే ప్రారంభమే కాలేదు. మరికొంతమంది ఎంపీడీవోలు ‘మా మండలంలో సంచార జాతులు లేవు’ అని మొక్కుబడిగా నివేదిక ఇచ్చేశారు. ఇలా 8 మండలాల నుంచి వచ్చిన నివేదికలను జిల్లా అధికారులు వెనక్కి పంపించేశారు. ఇంకొంతమంది ఎంపీడీవోలకు అసలు ఈ సర్వే గురించి కనీస అవగాహన లేదు. జిల్లాలో సంచార జాతులవారు 85,436మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఇతర జాతుల నుంచి సంచార జాతుల్లోకి వచ్చినవారు 36,716 మంది ఉన్నారు.వీరిలో నుంచి సీడ్ పథకానికి అర్హుల్ని గుర్తించాలి.అయితే ఇప్పటి దాకా పెనుమూరు మండలంలో 23మందిని, వెదురుకుప్పంలో 86మందిని, చౌడేపల్లెలో 160మందిని, పెద్దపంజాణిలో 18మంది అబ్ధిదారుల్ని మాత్రమే గుర్తించారు. శాంతిపురం, నగరి, కుప్పం మున్సిపాలిటీ, ఎస్‌ఆర్‌పురం, గుడుపల్లె మండలాల్లో లబ్ధిదారులు ఎవరూ లేరని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక యాదమరి, పులిచెర్ల, తవణంపల్లె, ఐరాల, పలమనేరు తదితర మండలాల్లో అయితే ఇంకా సర్వే మొదలుకాలేదు.
ఎందుకిలా?
సంచార జాతుల సర్వే చేయడం అంత సులువు కాదు. ఇందుకు సర్వే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. వీరు స్థిరంగా ఒక తావులో ఉండరు. వెతుక్కుంటూ వెళ్లాలి. సాధారణంగా పట్టణాల శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉంటారు. ఉదయాన్నే నిద్ర లేచి పల్లెల్లోకి, పట్టణంలోకి వెళ్లిపోతారు. సిబ్బంది వెళ్లి పలకరించగానే వీరు తమ సమాచారం చెప్పరు. కొన్ని సంచార తెగల మీద దొంగలు, వ్యభిచారులు అనే ముద్ర వేయడం వల్ల వీరు తమ జాతిపేరు చెప్పడానికి ఇష్టపడరు. చాలామంది మరాఠీలో మాట్లాడుతారు. లేదా మనకు అర్థం కాకుండా ఒక సంకేత భాషలో మాట్లాడుకుంటారు. నమ్మకం కలిగేలా వారితో ఓపికగా వ్యవహరించగలగాలి.
జగన్ ప్రభుత్వం వీరిని గాలికొదిలేసింది
2014-19 మధ్యలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించింది. అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆయా కులాలకు సంబంధించిన సర్వే, అధ్యయనం చేసింది. 32 కులాలను సంచార, విముక్త జాతులుగా గుర్తించింది.ఒక్కో కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం చేసింది. 90శాతం రాయితీతో రుణాలు అందించింది. స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పింది. ఓబీసీ కార్పొరేషన్‌కు 2017-18 బడ్జెట్‌లో రూ.60 కోట్లు, 2018-19లో రూ.వంద కోట్లు, 2019-20లో రూ.60 కోట్లను కేటాయించింది.వైసీపీ అధికారంలోకి రాగానే సంచార జాతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. ఓబీసీ కార్పొరేషన్‌కు టీడీపీ ప్రభుత్వం 2019లో కేటాయించిన బడ్జెట్ నిధుల్లో నుంచి రూ.10 కోట్లను ఖర్చు చేసింది. ఆ 32 కులాల వారికి నవరత్నాలను అందించలేదు.
సీడ్ ద్వారా నాలుగు రకాల లబ్ధి
ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారికి ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక సాయం అందుతుంది.
ఇల్లు లేనివారికి గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తారు.
చిరు వ్యాపారాలు చేసుకునేందుకు 10 లేదా 20 మందితో గ్రూపుల్ని ఏర్పాటుచేసి ఆర్థిక సాయం చేస్తారు.
రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు కల్పిస్తారు.
15 రోజుల్లో సర్వే పూర్తి: శ్రీదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా
సీడ్ పథకం సంచార జాతుల వారికి వరం లాంటిది. అర్హులకు పెద్దఎత్తున లబ్ధి కలగనుంది. అర్హుల్ని గుర్తించే సర్వే గత నెలలోనే ప్రారంభించాం. 15 రోజుల్లో సర్వే పూర్తయ్యేలా ఫాలోఅప్ చేస్తున్నాం. నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపిస్తే.. లబ్ధి మంజూరవుతుంది.