Share News

Security Reduction : సీఎం బందోబస్తు పరిమితం!

ABN , Publish Date - Dec 22 , 2024 | 06:27 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న భద్రతా సిబ్బందిని బాగా తగ్గించారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్నప్పటికీ ఆయన రక్షణ వలయం పరిమితంగానే ఉంటోంది.

Security Reduction : సీఎం బందోబస్తు పరిమితం!

  • జగన్‌తో పోలిస్తే ఎనిమిదో వంతు సిబ్బందితోనే విధులు

  • జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్నా రక్షణ వలయం చిన్నదే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న భద్రతా సిబ్బందిని బాగా తగ్గించారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్నప్పటికీ ఆయన రక్షణ వలయం పరిమితంగానే ఉంటోంది. ప్రస్తుతం ఆయన భద్రత కోసం ఉన్న సిబ్బంది కేవలం 121 మంది మాత్రమే. గత సీఎం జగన్‌తో పోలిస్తే ఎనిమిదో వంతు సిబ్బందే ఇప్పుడు విధుల్లో ఉంటున్నారు. దీనివల్ల భద్రతాపరమైన ఖర్చు కూడా భారీగా తగ్గిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో జగన్‌ కాన్వాయ్‌లో 17 వాహనాలు ఉండగా ఇప్పుడు 11 మాత్రమే ఉంటున్నాయి. ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్న చంద్రబాబుకు ఇంకా ఎక్కువ భద్రత సమకూర్చే అవకాశం ఉన్నా ఆయన అంత అవసరం లేదని వారించడంతో కనీస సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌ ప్రతిరోజూ నిర్వహించే జరిగే ప్రజా దర్బార్‌కు వందల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. వారికి ఏ ఇబ్బంది రాకుండా భద్రతా సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘాలు అక్కడ చిన్న చిన్న ధర్నాలు నిర్వహిస్తున్నా, పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పి పంపుతున్నారు.

డ్రోన్లతో భద్రత

చంద్రబాబు తన భద్రతకు సాంకేతిక పరిజ్ఞానం జోడించాలని సూచించడంతో పోలీసు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. దీంతో తక్కువ సిబ్బందితోనే భద్రత కల్పించడం సాధ్యపడుతోంది. ఈ డ్రోన్‌ ప్రతి రెండు గంటలకు ఒకసారి పైకి ఎగిరి చుట్టూ ఉన్న పరిస్థితులను వీడియో తీస్తోంది. ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే పర్యవేక్షక విభాగానికి సమాచారం అందుతోంది. ఈ డ్రోన్‌ నిర్దేశిత సమాయానికి తానే ఎగిరి నిర్దేశిత ప్రాంతంలో తిరగడంతో పాటు తిరిగి వచ్చాక తానే చార్జింగ్‌ కూడా పెట్టుకొంటోంది. ఇది భద్రతా సిబ్బందికి బాగా ఉపయుక్తంగా ఉంటోంది.


జిల్లాల పర్యటనల్లోనూ...

సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అనవసర హడావుడి వద్దని అధికారులకు గట్టిగా చెబుతున్నారు. ఆయన ఇటీవల పోలవరం పర్యటనకు వెళ్లినప్పుడు భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇకపై అంత బందోబస్తు వద్దని ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేశారు. తాను పర్యటించే సమయంలో ట్రాఫిక్‌ను గంటల తరబడి ఆపవద్దని, బాగా దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు ఆపితే సరిపోతుందని సూచించారు. శుభకార్యాలకు వెళ్లినప్పుడు తన కారణంగా మిగిలిన అతిథులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని, ఎవరికీ అసౌకర్యం కలిగించవద్దని ఆదేశించారు. ఇక సీఎం పర్యటన జరిగే ప్రాంతాల్లో చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం, కిలోమీటర్ల తరబడి బారికేడ్లు నిర్మించడం వంటివి కూడా అధికారులు నిలిపివేశారు. ‘చంద్రబాబుకు సెటిల్‌మెంట్లు, వాటాలు లాక్కొనే వ్యవహారాలు లేవు. ఆయన ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అందుకే కనీస భద్రత సరిపోతోంది’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.

జగన్‌ రక్షణకు ఏడాదికి రూ.90 కోట్లు!

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన రక్షణ కోసం నియమించుకున్న భద్రతా సిబ్బంది అక్షరాలా 980 మంది. తాను నివసించే తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ చెక్‌పోస్టులు, బారికేడ్లు, ఆర్మ్‌డ్‌ గార్డ్స్‌తో అదో నిషేధిత ప్రాంతాన్ని తలపించేది. ప్రత్యేక ఆపరేషన్లకు వినియోగించే ఆక్టోపస్‌ బృందాలను తన ఇంటి చుట్టూ 24 గంటలూ మొహరించారు. ఇంటికి నలుమూలలా నలుగురు స్నైపర్లనూ నియమించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఈ స్థాయి భద్రత లేదు. ఇలాంటి ఏర్పాట్లు గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ లేవని, కేవలం జగన్‌ భద్రత కోసం నెలకు రూ.7.5 కోట్లు చొప్పున ఏడాదికి రూ.90కోట్ల వరకూ వెచ్చించారని సంబంధిత వర్గాల కథనం.

Updated Date - Dec 22 , 2024 | 06:27 AM