చంద్రబాబుకు తప్పిన పెనుముప్పు
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:54 AM
సీఎం చంద్రబాబు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు గురువారం ఆయన విజయవాడలోని మధురానగర్, దేవీనగర్ ప్రాంతాలకు వెళ్లారు.
బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వద్ద రైల్వే బ్రిడ్జి ఎక్కిన సీఎం
అదే సమయంలో ట్రాక్‌పైకి వచ్చిన ఎక్స్‌ప్రెస్
భద్రతా సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రికి 3 అడుగుల దూరంలో వెళ్లిన ట్రైన్
విజయవాడ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు గురువారం ఆయన విజయవాడలోని మధురానగర్, దేవీనగర్ ప్రాంతాలకు వెళ్లారు. దేవీనగర్ ప్రాంతంలో బుడమేరు ప్రవాహ ఉధృతిని పరిశీలించేందుకు అక్కడే ఉన్న రైల్వే బ్రిడ్జిపైకి ఎక్కారు. అయితే, సీఎం బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే సింగిల్ ట్రాక్‌పైకి ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకువచ్చింది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించలేక పోయిన అధికారులు.. రైలు శబ్దం వినిపించగానే హడలెత్తిపోయారు. ఆ వెంటనే హుటాహుటిన అప్రమత్తమై.. సీఎం చంద్రబాబును బ్రిడ్జికి ఉన్న ర్యాంపుపైకి తీసుకువచ్చారు. అక్కడే ఉన్న లైన్మెన్ ఎర్రజెండా చూపించడంతో రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించి ముందుకు సాగారు. అయితే, సీఎం నిలబడిన ప్రదేశానికి 3 అడుగుల దూరం నుంచి రైలు వెళ్లిపోయింది. ట్రైన్ వెళ్లిన అనంతరం సీఎం రైల్వే బ్రిడ్జి నుంచి వెలుపలికి రావడంతో అప్పటి వరకు టెన్షన్ పడిన భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.