Share News

CM Chandrababu : తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు

ABN , Publish Date - Nov 10 , 2024 | 04:58 AM

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఓవైపు తాము అహర్నిశలూ కృషి చేస్తుంటే.. కొంతమంది సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

CM Chandrababu : తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు

అనుచిత పోస్టులను తీవ్రంగా పరిగణిస్తాం

ఆడబిడ్డలను కించపరిస్తే కఠిన చర్యలు: చంద్రబాబు

వైసీపీకి చెందిన మహిళలపై పోస్టులు పెట్టినా ఊరుకోం

రౌడీల రాజకీయ ముసుగులు తొలగిస్తాం.. ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి

పోలీసులు లాలూచీ పడినా, తప్పు చేసినా అదే వారి ఉద్యోగానికి ఆఖరి రోజు

శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి

వాటికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించం.. శ్రీశైలంలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ

ఏ పార్టీ వారైనా సరే ఆడబిడ్డలపై సోషల్‌ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టినా, వైసీపీకి చెందిన వారి ఆడబిడ్డలపై పోస్టులు పెట్టినా మా ప్రభుత్వం ఊరుకోదు. తప్పును తప్పుగానే చూస్తాం. తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతాం. ఎవరైనా తమాషాలు చేద్దామని చూస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు.

- సీఎం చంద్రబాబు

నంద్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఓవైపు తాము అహర్నిశలూ కృషి చేస్తుంటే.. కొంతమంది సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుచితంగా పెట్టే పోస్టులను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రీశైలం పర్యటనకు వచ్చిన ఆయన పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ దేనికీ భయపడదన్నారు. తీవ్రవాదులతోనే పోరాడామని.. ముఠానాయకులను పూర్తిగా కట్టడి చేశామని.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని నియంత్రించామని తెలిపారు. ప్రస్తుతం రౌడీలు రాజకీయ ముసుగులు వేసుకున్నారని.. వారి ముసుగులను తొలగిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రౌడీలను రౌడీలుగా, నేరస్థులను నేరస్థులుగానే చూస్తామని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. ‘ఎవరైనా సరే చట్టానికి లోబడే పనిచేయాలి. ఒకరిద్దరు పోలీసులు లాలూచీ పడినా, తప్పు చేసినా అదే వారి ఉద్యోగానికి ఆఖరి రోజు అవుతుంది. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.

fvg.jpg

రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పర్యాటకాన్ని ప్రచారం చేయగలం. దీనివల్ల అభివృద్ధి జరిగి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి ఆదాయం పెరుగుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించం. రాష్ట్రంలో అలజడులు సృష్టించేవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సోషల్‌ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెట్టే వారికి.. వారి కుటుంబ సభ్యులపైన గౌరవం లేకపోవచ్చేమో, వారి తల్లి, చెల్లెలిపైన గౌరవం లేకపోవచ్చేమో.. కానీ మా ప్రభుత్వానికి గౌరవం ఉంది’ అని పరోక్షంగా మాజీ సీఎం జగన్‌కు చురకలంటించారు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలని, మృగాళ్లలా ప్రవర్తిస్తే వారి పట్ల ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తామన్నారు. ‘ఇది ప్రజాస్వామ్యం. రాతియుగం కాదు. అభివృద్ధి కోసం ఆనాడు సాంకేతికత తీసుకొచ్చాను.. ఇలా సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తించేందుకు కాదు. తప్పుడు చిరునామాతో తప్పుడు సమాచారం పెట్టే ఆలోచన ఉంటే మానుకోండి. సోషల్‌ మీడియా పోస్టుల వల్ల తన బిడ్డలు బోరున ఏడ్చారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం భరించాలా’ అని ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో బాబాయిని చంపి గుండెపోటని అబద్ధమాడారని, తర్వాత గుండెపోటు కాదని, గొడ్డలి పోటని సాయంత్రానికి తెలిస్తే.. జగన్‌ పత్రిక ‘నారాసుర రక్తచరిత్ర’ అని వేసిందని దుయ్యబట్టారు. ‘అనాడే అబద్ధాలాడిన వారిని లోపల వేయిస్తే ఏమై ఉండేది? కానీ మంచితనంతో నేనా పని చేయలేదు. దీనిని దుర్వినియోగం చేయాలని చూస్తే ఖబడ్దార్‌. తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టం’ అని సీఎం తేల్చిచెప్పారు.

Updated Date - Nov 10 , 2024 | 05:00 AM