CM Chandrababu : ఏం జరుగుతోంది
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:49 AM
కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకటరెడ్డి బెయిలుపై ఎలా బయటికి వచ్చారు?
కీలక కేసుల్లో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి!
మద్యనిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు అన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. వేలకోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరాయి. బాధ్యులెవరో తెలుసు. వారిని అరెస్టు చేయాలి కదా? అసలు సూత్రధారులను అరెస్టు చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెబుతాం?
పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు. లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు. ఇదొక పెద్ద మాఫియా. సూత్రధారులు, పాత్రధారులు, దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గోడౌన్లలో వేల టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్టం సెక్షన్ 6ఏ కింద కేసులు పెడితే సరిపోతుందా? ఐదేళ్ల దోపిడీ సంగతేంటి?
కేవలం దోపిడీ చేసేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం పెట్టారు. ఆటగాళ్లే లేని ఆటలకు 119 కోట్లు ఖర్చు చేశారు. అవినీతి కోట్లలో జరిగింది. పరికరాల కొనుగోళ్లు, ముగింపు ఉత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు. అదెంత వరకు తేల్చారు? సీఐడీ ఇంత స్లోగా పని చేయడమా?
- చంద్రబాబు
పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు
గనుల వెంకటరెడ్డికి ఈజీగా బెయిల్ ఎలా?
మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో నత్తనడక
చిత్తూరులో వేల ఎకరాల భూములు కబ్జా
మద్యం కుంభకోణంలో అరెస్టులు లేవు
‘ఆడుదాం ఆంధ్రా’లో అవినీతి పట్టదా?
రేషన్ బియ్యం మాఫియాను వదలొద్దు
మైనింగ్ దోపిడీదారులు జైలుకు వెళ్లాల్సిందే
ఉన్నతాధికారులకు సీఎం స్పష్టీకరణ
రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు?
కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకటరెడ్డి బెయిలుపై ఎలా బయటికి వచ్చారు? మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు దహనం కేసు దర్యాప్తులో పురోగతి ఏమిటి? ఐదేళ్లు రెచ్చిపోయిన మద్యం, రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోరా? ‘స్కిల్ కేసు’లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వాంగ్మూలాన్నే తారుమారు చేసిన ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆయా కేసుల్లో సెక్షన్లు బలంగానే పెట్టారా? బలహీనంగా పెడితే దానికి కారణం ఏమిటి, కారకులు ఎవరు?... ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం, బుధవారం వరుసగా 2 రోజులు రాత్రి పొద్దుపోయాక పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. సీఐడీ, ఏసీబీతోపాటు ఐదుగురు అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన భేటీ అయ్యారు. పోలీసు అధికారులు ఇచ్చిన వివరణలు, సమాధానంపై ఆయన అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. తాజా పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా 2 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే..
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కీలకమైన కేసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ సీఐడీ, ఏసీబీ అధికారులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ పోలీసింగ్ ముగిసిందని గ్రహించాలని... తప్పు చేసిన వ్యక్తులకు వంత పాడే రోజులు పోయాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ కోసం పని చేసిందన్నారు. ఇప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పని చేయాలని, అయితే మార్పు ఇంకా కనిపించడం లేదని అన్నారు. ‘భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, మైనింగ్ అక్రమాలు, రేషన్ బియ్యం మాఫియా, చివరికి ఆడుదాం ఆంధ్రాలోనూ దోపిడీ చేశారు. ప్రజల సంపదను ప్రభుత్వ పెద్దలే దోచేయడం దారుణం. ఇటువంటి వ్యక్తులకు శిక్ష పడేలా చేయకుంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయినట్లే. గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో ఎంత అరాచకం జరిగిందో మీకు తెలుసు. వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. చుక్కలు పెట్టించి లాక్కొని, నిషేధిత జాబితాలో చేర్చి తక్కువ ధరకు తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని తగుల బెట్టేశారంటే ఇది గూండా రాజ్యమా? ఘటన జరిగినప్పుడు హెలికాప్టర్లో వెళ్లమని డీజీపీ, సీఐడీ ఏడీజీని పంపాను. ఆ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఇబ్బందేంటి.. జాప్యమెందుకు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘అక్కడ రాజకీయ సిఫారసులతో పది చేస్తే, సిబ్బంది సొంతంగా ఐదు చేశారు సర్. ఎన్వోసీల వివరాలు బయటికి వస్తాయనే తగుల బెట్టేశారు. అప్పుడున్న సిబ్బందిలో ఎక్కువమంది ఇలాంటివి చేశారు. అందుకే దర్యాప్తులో ఆలస్యం అవుతోంది. బాధ్యులను ఆధారాలతో జైలుకు పంపుతాం’ అని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ‘ఆధారాలు సేకరించండి. టెక్నాలజీ వినియోగించుకుని ఉచ్చు బిగించండి. ఇకపై ఎవరూ అక్రమాలు చేయడానికి సాహసించకూడదు. పోలీసుల పనితీరులో ఇంకా మార్పు రావాలి’ అని సీఎం సూచించారు.
మద్యం కేసులో ఆలస్యమెందుకు?
మద్యం కుంభకోణంలో చర్యల్లో జాప్యంపైనా సీఎం ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఫైళ్లు, కంప్యూటర్లు అన్నీ స్వాధీనం చేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నామని అధికారులు బదులిచ్చారు. పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నామని, వీలైనంత త్వరలో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేస్తామని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. రేషన్ మాఫియాపై సీఎం పలు ప్రశ్నలు వేసినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. రేషన్ మాఫియాను వదలొద్దని, ఆధారాలు సేకరించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన దోపిడీపైనా అధికారులు మౌనం వహించినట్లు తెలిసింది.
గనుల ఘనులు జైలుకు వెళ్లాల్సిందే
మైనింగ్ దోపిడీ గురించి సీఎం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ‘ఇసుక, మైనింగ్ దోపిడీలో కీలక సూత్రధారి వెంకటరెడ్డి కస్టడీలో ఏమి చెప్పాడు? అందులో నిజానిజాలు సరిచూసుకున్నారా? అరెస్టులవైపు వెళుతున్నారా? అనుమతుల్లేని తవ్వకాలతో అక్రమంగా సహజ సంపద తరలించినవారు, సహకరించిన వ్యక్తులు, వాటాలు తీసుకున్న పెద్దల్ని ఎవరినీ వదలొద్దు. బాధ్యులందరూ జైలుకు వెళ్లాల్సిందే’ అని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సాంకేతిక అంశాల కారణంగానే వెంకటరెడ్డికి బెయిలు వచ్చిందని అధికారులు బదులిచ్చినట్లు తెలిసింది.
బూతుల నోళ్లకు తాళం వేశాం: డీజీపీ
ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా బూతులతో సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోయిన సోషల్ సైకోల నోళ్లకు తాళాలు వేయగలిగారని పోలీసుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ‘వావి వరసలు లేకుండా తల్లి, చెల్లి, ఆడబిడ్డలనే స్పృహ లేకుండా జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేశారు. అటువంటి సైకోలను గడిచిన రెండు వారాల్లో బాగానే కట్టడి చేశారు’ అని సీఎం అన్నారు. సుమారు నాలుగు వేలకు పైగా ఇటువంటి అకౌంట్లను గుర్తించి నిఘా పెట్టామని, సగానికి పైగా క్లోజ్ అయ్యాయని డీజీపీ వివరించారు. మిగిలిన వాటిలో వస్తున్న పోస్టులపైనా నిఘా పెట్టి నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు.
రౌడీషీటర్ బోరుగడ్డకు రాచమర్యాదలా?
పోలీసుల తీరుపై సీఎంఓ ఆరా
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఎన్నో అరాచకాలకు పాల్పడిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు పోలీసులు రాచమర్యాదలు చేయడంపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉంది. బోరుగడ్డ విషయంలో పోలీసుల తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోరుగడ్డ కేసుల విషయంలో పోలీసులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఆయనకు చేసిన రాచమర్యాదలు, అందుకు బాధ్యులపై తీసుకున్న చర్యలు తదితర సమగ్ర సమాచారంతో రావాల్సిందిగా డీజీపీని సీఎంవో కోరినట్లు తెలిసింది. దీంతో అనిల్‌పై కేసులు, విచారణ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు, చర్యలు వంటి పూర్తి వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి డీజీపీ వివరించనున్నట్టు తెలుస్తోంది.
బెయిల్ మీద ఎందుకొచ్చారు..
కీలకమైన కేసుల్లో అసలేం జరుగుతోంది? గనుల ఘనుడు వెంకటరెడ్డి బెయిలుపై ఎలా బయటికి వచ్చారు? మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు దహనం కేసు దర్యాప్తులో పురోగతి ఏమిటి? ఐదేళ్లు రెచ్చిపోయిన మద్యం, రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోరా? ‘స్కిల్ కేసు’లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వాంగ్మూలాన్నే తారుమారు చేసిన ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆయా కేసుల్లో సెక్షన్లు బలంగానే పెట్టారా? బలహీనంగా పెడితే దానికి కారణం ఏమిటి, కారకులు ఎవరు?... ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం, బుధవారం వరుసగా 2 రోజులు రాత్రి పొద్దుపోయాక పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. సీఐడీ, ఏసీబీతోపాటు ఐదుగురు అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన భేటీ అయ్యారు. పోలీసు అధికారులు ఇచ్చిన వివరణలు, సమాధానంపై ఆయన అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. తాజా పరిణామాలు, పరిస్థితుల ఆధారంగా 2 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే.
Also Read:
రోడ్డు పక్కన కనిపించే వీటిని తింటున్నారా..
గ్యాంగ్స్టర్ల రాజధాని.. సీఎం సంచలన వ్యాఖ్యలు
For More Andhra Pradesh News and Telugu News..