CBN: ఘనంగా చేనేత దినోత్సవం.. ఎక్జిబిషన్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 07 , 2024 | 04:27 PM
జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.
అమరావతి: జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన చీరలను ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శించనున్నారు. స్టాల్ ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు.
సుమారు 80కి పైగా స్టాల్స్‌లో చేనేత దుస్తులు ఉంచారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించినట్లుగా సీఎం తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గుమ్మళ్ల సృజన, పురపాలక కమిషనర్ ధ్యాన చంద్ర తదితరులు పాల్గొన్నారు.
చేనేతలను ప్రోత్సహించాలి..
జాతీయ చేనేత దినోత్సవాన్ని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చేనేత సంఘాలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. ఇకపై తాను ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలు ధరిస్తానని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు సైతం చేనేత వస్ర్తాలు ధరించి వెళ్ళానని వెల్లడించారు.
విజయనగరం జిల్లా లావేరు గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు, లక్ష్మీ అనే కార్మికులు మగ్గంపై ప్రధాని మోదీ చిత్రపటాన్ని నేశారని ఆయన తెలిపారు. ఆ చిత్రపటంతోపాటు మోదీకి చేనేత వస్త్రాలు అందించినట్లు చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నమాదిరిగానే, చేనేత కుటుంబాలను ప్రోత్సహించాలి. సీఎం చంద్రబాబు చేనేత కుటుంబాలను అనేక విధాలుగా ఆదుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి. అలాంటప్పుడే వారి కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది" అని కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
బీజేపీ నేతల ర్యాలీ..
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలతో విజయవాడలో బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారు. విజయవాడ బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆప్కో కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో సుజనా పాల్గొన్నారు. అనంతరం ఆప్కో షోరూంలో ఆయన చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. సుజనా మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి. చేనేత కార్మికులను కాపాడాలి. ప్రధాని మోదీ కూడా చేనేత వస్త్రాల ప్రాముఖ్యతపై ప్రచారం చేశారు. బీజేపీ సర్కార్ ఆ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుంది" అని పేర్కొన్నారు.