Share News

CM Chandrababu : దోచేసి.. దాచేసారు

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:43 AM

రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేసి.. పోలవరం ప్రాజెక్టును వరదకు వదిలేసి.. ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి..

CM Chandrababu : దోచేసి.. దాచేసారు
CM Chandrababu Naidu

  • ఐదేళ్లలో అంతులేని దోపిడీ.. సీఎం ధ్వజం

  • రాజకీయాల్లో అవినీతిని చూశా..

  • కానీ, దోపిడీ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు

  • 45 ఏళ్ల రాజకీయ అనుభవం నాది.. కానీ, ఒక

  • ఆర్థిక ఉగ్రవాది విధ్వంసం తొలిసారి చూస్తున్నా

  • కుటుంబానికి ప్రజల సొమ్ముతో విశాఖలో భారీ ప్యాలెస్‌

  • సొంత పత్రికకే అడ్డగోలుగా రూ.400 కోట్ల యాడ్స్‌

  • రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పైకి నెట్టారు

  • మోదీ సహకారంతో బయటికి తెచ్చాం: చంద్రబాబు

  • ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే

  • అప్పులు 9.74 లక్షల కోట్లుపైనే

  • ఇంకా తవ్వాల్సింది చాలానే ఉంది

  • జగన్‌ హయాం అప్పులకు లెక్కల్లేవు

  • ఒక్కో శాఖ క్లియరెన్స్‌కు 4 నెలలు

  • బడ్జెట్‌పై చర్చకు మంత్రి కేశవ్‌ జవాబు

నేను గత ఐదు నెలల్లోనే ఏదో చేశానని చెప్పడంలేదు. కొద్ది కొద్దిగా పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కల్పిస్తున్నాం. మళ్లీ దుర్మార్గ ప్రభుత్వం వస్తే ఎలాగని వారు జంకుతున్నారు. అయితే, ఆంధ్రులు విజ్ఞులు అని, ఇక భవిష్యత్తులో ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని.. వారికి నచ్చజెప్పి ఒక్కో కంపెనీని తీసుకొస్తున్నాం. ధైౖర్యంగా పెట్టుబడులు పెట్టండి భరోసా మాది.. అని చెబుతున్నాం. నా దగ్గర డబ్బుల్లేవు కానీ నూతన ఆలోచనలు ఉన్నాయి. ఓ మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అటువంటి ఆలోచనతో ముందుకెళ్లి సంపద సృష్టిద్దాం.

- అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేసి.. పోలవరం ప్రాజెక్టును వరదకు వదిలేసి.. ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి.. ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమల్ని తరిమేసి.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా తినేసి.. దోచిన సొమ్మంతా ఆనాడు తాడేపల్లి ప్యాలె్‌సకు తరలించి.. రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పైకి నెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్‌ అనే మాటతో మోసపోయిన జనం.. వైసీపీ దోపిడీ రాజ్యాన్ని భరించలేక ఇటీవలి ఎన్నికల్లో 57ు ఓట్లు, 93ు సీట్లతో ఎన్డీయేకు పట్టం కట్టారని తెలిపారు. అలాంటి ప్రజల కోసం 100% కష్టపడి పనిచేయాల్సి ఉందన్నారు. ఇంతటి ఆర్థిక దుస్థితిలో కూడా పెట్టిన రూ.2,94,427 కోట్ల బడ్జెట్‌ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన నాటికి లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీలో ఒక్కో మెట్టు పేర్చుకొంటూ.. రాజధాని, పోలవరం నిర్మాణం చేసుకొంటూ.. పరిశ్రమల్ని స్వాగతించి ప్రోత్సాహకాలిస్తూ తామొస్తే... ఒక్క చాన్స్‌ పేరుతో ప్రజల్ని ఆర్థిక ఉగ్రవాది జగన్‌ మోసగించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మద్య నిషేధం మోసంతో ప్రజల్ని.. అధికారం, అవినీతితో ప్రభుత్వ సంపదను దోచుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు కోసం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై సమీక్షిస్తే 45ఏళ్ల రాజకీయ అనుభవంలో కని, విని, ఎరుగని దారుణ పరిస్థితులు కనిపించాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1994లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి తీసుకురాగా, 2024లో వైసీపీ వెంటిలేటర్‌పైకి నెట్టిందని వాపోయారు. ముప్పై ఏళ్ల క్రితం తాను ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దేశంలోనే గొప్పగా ఉందన్నారు. విభజిత ఏపీకి 2014లో చికిత్స చేస్తూ.. 2019నాటికి తెలంగాణ కన్నా ఏపీకి 17వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చే స్థాయికి తెచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలోనే గొప్ప నగరంగా అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక స్థితికి మెరుగులు చేపట్టామన్నారు. దురదృష్టవశాత్తూ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి తెలంగాణ కన్నా 62వేల కోట్లు వెనక పడే స్థాయికి దిగజార్చిందని వాపోయారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో బయటికి తీశామని చంద్రబాబు చెప్పారు. ‘‘ప్రతి నెల 64లక్షల మందికి పింఛన్లు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి నిమిషమూ అందరం కష్టపడాలి’’ అని సీఎం అన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


ఐదేళ్ల అరాచకం.. 30ఏళ్లు వెనక్కి రాష్ట్రం..

‘‘గత ఐదేళ్ల అరాచక పాలనతో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి పోయింది. ఆర్థిక ఉగ్రవాది రాజకీయాల్లోకి వచ్చి అధికారంతో ఇంతలా దోచేసి తప్పించుకుంటారని ఎప్పుడూ ఊహించలేదు.. ఎక్కడ ఎవరికి ఏది చిక్కితే అది లూటీ చేసేశారు.. అప్పులు, తప్పులు, నేరాలు, అసమర్ధపాలన, ప్రజా సంపద దోపిడీ, స్కాముల కోసం స్కీములతో రాష్ట్రం సర్వ నాశనమైంది. ఏపీని ఎలా గట్టెక్కించాలనే ఆలోచన చేస్తున్నాం.. అందరం కష్టపడాలి.. పని చేసినంత ఉంది.. పని దొంగల్ని మాత్రం వదిలి పెట్టను. ఎన్డీయేను ప్రజలు దీవించడం వల్ల కేంద్రం బాగా సహకరిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు’’


దోపిడీ కోసమే రాజకీయాల్లోకి...

‘‘రాజకీయాల్లో అవినీతిపరుల్ని చూశాం. కానీ, దోపిడీ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఇప్పుడు చూస్తున్నాం.. ఇదొక పెద్ద ప్లానింగ్‌.. మా పార్టీ(టీడీపీ)కి 45ఏళ్లు. కానీ పేపర్‌, టీవీ లేవు. కానీ, వైసీపీ పెట్టే సమయానికే ఇవన్నీ ఏర్పాటు చేసుకుని సొంత పత్రికకు 400కోట్ల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో తీసుకున్నారు.. వలంటీర్లకు కూడా వారి పేపర్‌ ఇప్పించి ఎంత అధికార దుర్వినియోగం చేయవచ్చో అంతా చేశారు..’’


కన్నతల్లి శీలాన్ని శంకించేవాళ్లు మనుషులేనా?

‘‘డిజిటల్‌ కార్పొరేషన్‌ నుంచి డబ్బులు చెల్లించి సోషల్‌ మీడియాలో సైకోలను తయారు చేశారు. చివరికి కన్నతల్లి శీలాన్ని శంకిస్తూ పోస్టులు పెట్టారంటే వీళ్లని మనుషులు అనాలా.. లేక జంతువులా? తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఇలాంటి నీచులు రాష్ట్రంలో ఉండటానికి కూడా అర్హత లేదు. ఎన్డీయేలో ఏ నాయకుడూ ఇటువంటి పోస్టులు పెట్టరు. ఎవరైనా పెడితే వాళ్లకు ఇచ్చే ట్రీట్మెంట్‌ ఇస్తా.. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డా గౌరవంగా బతికేలా చట్టానికి పదును పెడతాం.. రాజకీయ ముసుగులో నేరస్థులు ఘోరాలు చేస్తే వారిని నేరస్థుల్లానే చూస్తాం. పెద్ద మనుషులుగా ఎప్పటికీ గుర్తించబోం. రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసేనాటికి రాష్ట్రంలో 84 లక్షల టన్నుల మెట్రిక్‌ చెత్త పేరుకుపోయింది. అదంతా తొలగించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంది. చెత్తపై పన్ను వేసిన వ్యక్తి పాపాలు మనం మోయాల్సి వస్తోంది’’ అని అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఇదిగో 9,74,556 కోట్ల అప్పు లెక్క

కాదనేవారికి లెక్కలు చూపిస్తా.. గుంజీలు తీయిస్తా..: చంద్రబాబు

‘‘రాష్ట్రంపై అప్పు పది లక్షల కోట్లు ఎక్కడుందని మాట్లాడుతున్నారు.. ఇదిగో ఆ లెక్క’’ అంటూ సభలో గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల చిట్టా చంద్రబాబు చదివారు.. అవి...

  • ప్రభుత్వ అప్పులు రూ.4,38,278కోట్లు..

  • పబ్లిక్‌ అకౌంట్‌ లయబిలిటీస్‌ 80,914 కోట్లు..

  • కార్పొరేషన్‌ అప్పులు రూ. 2,48,677కోట్లు..

  • పౌర సరఫరాల సంస్థ 36,000 కోట్లు..

  • విద్యుత్‌ రంగం 34,267కోట్లు..

  • అన్ని స్కీముల బకాయిలు 1,13,244కోట్లు..

  • ఉద్యోగులకు బకాయిలు 21,980కోట్లు..

  • నాన్‌ కంట్రిబ్యూషన్‌ టు సింకింగ్‌ ఫండ్‌ 1,191కోట్లు..

  • మొత్తం... 9.74 లక్షల కోట్లు

....ఇప్పటి వరకూ ఇది మాత్రమే తేలిందని ఇంకా తవ్వితే ఎంత వస్తుందో తెలీదని చంద్రబాబు అన్నారు. ‘‘ఎవరైనా దివాలా తీసినప్పుడు మాకూ అప్పు రావాల్సి ఉందని చాలా మంది వస్తుంటారు.. అలాంటివి ఇప్పటికి లేవు గనుక గుమ్మనంగా ఏమి చేయాలో ఆలోచిస్తున్నాం.. ఈ అప్పులు నిజంకాదని ఎవరైనా అంటే... రండి లెక్కలు చూపిస్తా.. ఆ తర్వాత గుంజీలు తీయిస్తా. ప్రజా జీవితంలో చిల్లర చేష్టలు మానండి. మీరు దాచిన చీకటి జీవోలన్నీ ఆన్‌లైన్‌లో ప్రజల ముందు పెట్టా..’’ అని చంద్రబాబు హెచ్చరించారు.


ఐదేళ్లు.. పది విధ్వంసాలు..

జగన్‌ పాలనలో ధ్వంసమైనవాటిలో పది చెబుతానంటూ సీఎం వాటి వివరాలు తెలిపారు.

1) రాజధాని అమరావతిని ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు.

2) ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమల్ని తరిమేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు.

3) ఇసుక దోపిడీ చేసి భవన నిర్మాణాల కార్మికుల పొట్ట కొట్టారు.

4) విద్యుత్‌ రంగాన్ని ఒక వ్యక్తి దోపిడీ కోసం 1.29లక్షల కోట్ల నష్టాల్లోకి తోసేశారు.

5) మద్యం ఉత్పత్తి, సరఫరా, నగదు విక్రయాలతో భారీ దోపిడీలు చేసి.. సైకో బ్రాండ్లతో ప్రజల్ని దోచేసి తాడేపల్లి ప్యాలె్‌సకు సొమ్ము తరలించరు.

6)పన్నుల బాదుడులో చెత్తను కూడా వదల కుండా ప్రజల్ని వేధింపులకు గురి చేశారు.

7) ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించి.. మాస్క్‌ అడిగిన దళిత వైద్యుడు సుధాకర్‌ను పిచ్చోడిని చేసి ఆయన చావుకు కారణం అయ్యారు.

8) రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు, రాళ్లపై ఫొటోలకు వందల కోట్లు....కుటుంబం కోసం ప్రభుత్వసొమ్ముతో రుషికొండపై భారీ ప్యాలెస్‌

9) ఇంగ్లీష్‌ ప్రయోగంతో విద్యావ్యవస్థ ధ్వంసం..

10) తలసరి, రాష్ట్ర ఆదాయంతోపాటు పారిశ్రామిక ప్రగతి పతనం... దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని అట్టడుగుకు తెచ్చారు.

‘‘మా ఊరికి దగ్గర్లోనే కొండ ఉంది. అందులో నుంచి పొలాల్లోకి అడవి పందులు వచ్చి రైతుల కష్టాన్ని మేసేసేవి. పదిశాతం పంట తినేసి, 90శాతం ధ్వంసం చేసి వెళ్లి పోయేవి.. రాష్ట్రంలోనూ ఐదేళ్లపాటు ఇదే జరిగింది. తినాల్సినంత తినేసి వ్యవస్థలను ధ్వంసం చేశారు.. అడవి పందులు పంట మేస్తే ఆ రైతు భూమి పాడవ్వదు. మళ్లీ ఇంకో పంట వేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో సంపద సృష్టించే మార్గాలు కూడా లేకుండా చేశారు. ఇంత దారుణాన్ని చూస్తానని అనుకోలేదు’’

- సీఎం చంద్రబాబు

Updated Date - Nov 16 , 2024 | 08:39 AM