Share News

CM Chandrababu : రాష్ట్ర ప్రతిష్ఠకు జగన్‌ ముడుపుల మసక!

ABN , Publish Date - Nov 23 , 2024 | 06:06 AM

CM Chandrababu said that YS Jagan has tarnished the reputation of the state with the blur of dedications.

CM Chandrababu : రాష్ట్ర ప్రతిష్ఠకు జగన్‌ ముడుపుల మసక!

ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు

జగన్‌ ప్రాసిక్యూషన్‌పై న్యాయ సలహా

వారి అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం

‘సెకీ’తో ఒప్పందంపై ప్రజల కోణంలో నిర్ణయం

‘అదానీ-జగన్‌’ వ్యవహారంపై సీఎం వెల్లడి

జగన్‌ అవినీతిని పార్లమెంటులో ఎండగట్టాలి

టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ముడుపుల మసకతో వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తి లేదన్నారు. వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ‘జగన్‌-అదానీ... లంచాల కహానీ’పై చంద్రబాబు స్పందించారు. సౌర విద్యుత్‌ టెండర్ల వ్యవహారంలో గత జగన్‌ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల మేర ముడుపులు అందాయని అమెరికా కోర్టులో అక్కడి ప్రభుత్వ సంస్థలు చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో జగన్‌ను ఇక్కడ ప్రాసిక్యూట్‌ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘అన్ని కోణాల నుంచీ పరిశీలిస్తున్నాం. ఏం చేయగలమన్నదానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం. ఇక్కడ మన పరిధి ఎంతవరకూ ఉంది.. చట్టపరంగా ఏం చేయగలమో.. నిపుణుల అభిప్రాయం తెలుసుకున్నాక నిర్ణయానికి వస్తాం’ అని చంద్రబాబు బదులిచ్చారు. అదే సమయంలో తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్రానికి భారంగా మారే ప్రమాదముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు.. ఆయన ఆచితూచి స్పందించారు. ‘పెట్టుబడులు పెట్టేవారి విశ్వాసం దెబ్బ తినకుండా.. అదే సమయంలో ప్రజల కోణంలో కూడా ఆలోచించి నిర్ణయానికి వస్తాం. అన్ని వైపుల నుంచీ ఆలోచిస్తాం’ అని తెలిపారు.

పార్లమెంటులో ఎండగట్టాలి...

సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అదానీలపై అమెరికా కోర్టులో కేసులు నమోదైన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ వైఖరి ఎలా ఉండాలో వారికి ఆయన సూచనలు చేశారు. ‘సౌర విద్యుత్‌ కొనుగోలు కోసం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి జగన్మోహన్‌రెడ్డి రూ.1750 కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికా సంస్థలు దాఖలు చేసిన చార్జిషీటుతో స్పష్టంగా తేలిపోయింది. జగన్‌ అవినీతిని, ముడుపుల వ్యవహారాన్ని బలంగా ఎండగట్టాలి. అదే సమయంలో బీజేపీ ఇబ్బంది పడకుండా చూడాలి. పార్లమెంటులో తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించండి’ అని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ం తీసుకురానున్న వక్ఫ్‌ బిల్లుపై ముస్లిం వర్గాల మనోభావాలను తాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించానని, వాళ్లు కూడా తొందరపడే ఉద్దేశంలో లేరనే అనుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. ఒకవేళ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకుందామని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఎంపీలు సమన్వయం చేసుకుని వెళ్లాలని, సమస్యలు రాకుండా చూసుకోవాలని ఆయన ఎంపీలకు సూచించారు. కేంద్రం నుంచి నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకోవాలని.. ప్రతి శాఖ పరిధిలో రాష్ట్రానికి తేగలిగే ప్రాజెక్టులపై అధ్యయనం చేసి పని చేయాలని చెప్పారు.


‘బ్రాండ్‌ ఏపీ’ నాశనం: రామ్మోహన్‌

పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి రావలసిన వాటిని సాధించుకోవడానికి ప్రయత్నిస్తామని పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. టీడీపీపీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్‌ డాక్యుమెంట్‌ ఆచరణరూపం దాల్చడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. దానిని మార్గదర్శక పత్రంగా ఎంచుకుని పనిచేస్తాం. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో ‘బ్రాండ్‌ ఏపీ’ని సర్వనాశనం చేశాడు. మేం మళ్లీ పునర్నిర్మిస్తున్నాం’ అని వివరించారు. అమరావతి, పోలవరంతోపాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, ప్రాజెక్టులు సాధించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. కూటమికి లోక్‌సభలో ఉన్న 21 మంది ఎంపీలం వివిధ అంశాలపై సమష్టి నిర్ణయంతో పనిచేస్తామని, అప్పటి పరిస్థితిని బట్టి చర్చించుకుని తదనుగుణంగా వెళ్తామన్నారు.

జమిలి ఎన్నికలు 2029లోనే..!

పార్లమెంటు, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా అవి షెడ్యూల్‌ ప్రకారం 2029లోనే వస్తాయని, ముందుగా రావని సీఎం స్పష్టం చేశారు. విజన్‌-2047ను కింది స్థాయి వరకూ ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ‘కాలేజీలు, విశ్వవిద్యాలయాల వంటి వేదికలపై చర్చిస్తాం. ఈ విజన్‌ ద్వారా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో అన్ని వర్గాలవారికీ తెలియడానికి ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తాం. మూడు నెలలో... ఆరు నెలలో కాకుండా ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల, ప్రతి క్వార్టర్‌, ప్రతి ఏడాదికి లక్ష్యాలు పెట్టుకుని సాధించడానికి ప్రయత్నిస్తాం. ప్రతి నెలా సమీక్షలు నిర్వహించి పురోగతి తెలుసుకుంటాను’ అని వివరించారు. అనుకున్న మేర లక్ష్యాలు సాధించడానికి భారీగా వనరులు కావాలని, వినూత్న పద్ధతుల్లో నిధుల సేకరణకు ప్రయత్నిస్తామని తెలిపారు.

Updated Date - Nov 23 , 2024 | 06:07 AM