Share News

CM Chandrababu : ‘భూ’చోళ్ల భరతం పడదాం!

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:14 AM

ప్రభుత్వ భూములను దోచుకున్న ప్రైవేటు భూరాబందులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

CM Chandrababu : ‘భూ’చోళ్ల భరతం పడదాం!

సహకరించిన సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు

ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు.. రెవెన్యూ శాఖకు సీఎం ఆదేశాలు

22ఏ నుంచి డీ-నోటిఫై చేసిన భూమి 4,21,433 ఎకరాలు!

ప్రజలు బాధలు పడేది రెవెన్యూ శాఖతోనే.. జనాలను

తిప్పించుకోవడం, వేధించడం కొందరు అధికారులకు అలవాటైంది

భూ రికార్డులు, ధ్రువీకరణ పత్రాల కోసం ఇంకా మీపైనే ఆధారపడాలా?

భూఅక్రమాలు జరిగిన టాప్‌-10 మండలాలపై దృష్టి

రీవెరిఫికేషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు.. సమీక్షలో సీఎం స్పష్టీకరణ

జగన్‌ హయాంలో అడ్డగోలుగా ప్రభుత్వ భూములను దోచుకున్నవారిపై కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. 22ఏ జాబితా నుంచి 4,21,433.97 ఎకరాలు డీ-నోటిఫై చేశారని తెలిసి ముఖ్యమంత్రి నివ్వెరపోయారు. దురాక్రమణ దారులతో అంటకాగిన రెవెన్యూ అధికారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టాలను ఉల్లంఘించి దారుణాలు చేసిన వారిపై పకడ్బందీగా కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ భూములను దోచుకున్న ప్రైవేటు భూరాబందులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. భూ దురాక్రమణదారులకు, ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాహాచేసిన వారికి రెవెన్యూ వ్యవస్థను దాసోహం చేసి.. అక్రమాల్లో కీలక భాగస్వాములుగా మారిన అధికారులపై పక్కా ఆధారాలతో క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. అక్రమార్కులు ఎంతటివారైనా వదిలిపెట్టకూడదని, ప్రభుత్వ భూములను దోచిపెట్టినందుకు బాధ్యులైన వారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రిమినల్‌ కేసు పెట్టినట్లుగా ఉండకూడదని, ఫిర్యాదును చూడగానే ఆభియోగాలు ఎదుర్కొనే అధికారి ఎంతటి చట్టఉల్లంఘనలకు పాల్పడ్డారో తెలిసేలా స్పష్టమైన ఆధారాలు జతచేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియా, సీసీఎల్‌ఏ జయలక్ష్మి, అదనపు సీసీఎల్‌ఏ ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అసైన్డ్‌, చుక్కుల, షరతుగల పట్టా భూముల ఫ్రీహోల్డ్‌పై సీఎం చర్చించారు.


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో గత ఆరు నెలలుగా జరుగుతున్న భూ రికార్డుల పునఃపరిశీలన (రీవెరిఫికేషన్‌) నివేదికను సీసీఎల్‌ఏ ముఖ్యమంత్రికి అందించారు.నివేదిక ప్రకారం.. పలువురు రెవెన్యూ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం-1977( పీఓటీ యాక్ట్‌), ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం-1908తోపాటు పలు రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు తేలింది. ఫైళ్ల పునఃపరిశీలనలో అక్రమార్కులకు పాల్పడిందెవరో కూడా తేలింది. అలాంటివారిపై.. పీవోటీ చట్టం, రిజిస్ట్రేషన్‌ చట్ట ఉల్లంఘనలు, సర్వీసు రూల్స్‌ అతిక్రమణ, అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వానికి నష్టం కలిగించడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం, తప్పుడు రిపోర్టులు సృష్టించడం, ఫోర్జరీకి పాల్పడడం, ఫైళ్లను తారుమారు చేయడం వంటి అభియోగాలతో క్రిమినల్‌ కేసులు పెట్టాలని రెవెన్యూశాఖ ప్రాథమికంగా ప్రతిపాదించింది. ఇందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. తప్పు చేసిన అధికారి ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవన్నారు. ‘గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారు ఎంజాయ్‌చేశారు. మాకేం కాదులే అన్న ధీమా ప్రదర్శించారు. ఇప్పుడు చట్టం తన పని తాను చేయాలి. అక్రమార్కులను వదిలిపెట్టకూడదు’’ అని సీఎం దిశానిర్దేశం చేశారు. భూముల గోల్‌మాల్‌, ధ్రువీకరణ పత్రాల జారీ, అవినీతి కేసుల ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన రెవెన్యూ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తాను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు శాఖ తీరే మారడం లేదన్నారు. ఒక్కసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేశాక.. ఆ సర్టిఫికెట్‌ డేటానే అవసరం ఉన్న ప్రభుత్వ శాఖలు ఉపయోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

డిసెంబరులో రెవెన్యూ సదస్సులు..

రెవెన్యూ సదస్సులను డిసెంబరులో నిర్వహించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే విన్నపాలను, వాటి పరిష్కారానికి అధికారులిచ్చే ఆదేశాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని చెప్పారు. ఆ విన్నపాల పరిష్కారంపై థర్డ్‌పార్టీ సంస్థతో ప్రత్యేక ఆడిటింగ్‌ నిర్వహించాలన్నారు. దీనివల్ల ప్రజా సమస్యల పరిష్కారం నిజంగా జరిగిందా.. లేదా? ఒక వేళ జరిగితే ప్రజలకు మేలు జరిగిందో లేదో నిర్ధారణ జరగాలని తెలిపారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు.


అసైన్డ్‌గా చూపి మరీ డీ-నోటిఫై 1,665 ఎకరాలు కొట్టేసిన వైనం

జగన్‌ పాలనలో ప్రభుత్వ భూముల పరాధీనానికి పరాకాష్ఠ ఇది. అసైన్‌మెంట్‌ చేయకుండానే రికార్డులు సృష్టించి, ఆ భూములను అసైన్డ్‌గా చూపి వాటిని 22ఏ నుంచి డీ-నోటిఫై చేశారు. ఈ కేటగిరీలో ఏకంగా 1,665.80 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు కొట్టేశారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సంపూర్ణంగా సహకరించారు. చెరువుశిఖం, కాలువ పోరంబోకు, ప్రభుత్వ భూమి, అసైన్‌మెంట్‌ పరిధిలో లేని మరో 6,500 ఎకరాలను కూడా అసైన్‌మెంట్‌ కింద చూపించి 22ఏ నుంచి అక్రమంగా డీ-నోటిఫై చేయించారు. రికార్డుల పునఃపరిశీలన తర్వాత భూముల అక్రమాలకు సంబంధించి తొలి పది స్థానాల్లో ఉన్న 10 మండలాలను రెవెన్యూ శాఖ ఎంపిక చేసింది. ఇవి శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ భూములను అక్రమంగా, చట్టవిరుద్ధంగా పరుల పాల్జేసిన రెవెన్యూ అధికారులపై అసైన్డ్‌, ఇనాం, రిజిస్ట్రేషన్‌ చట్టాల ఉల్లంఘన కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, వారిపై సీసీ రూల్స్‌ ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తొలుత భూముల అక్రమాలు జరిగిన టాప్‌-10 మండలాలు, డివిజన్ల పరిధిలోని అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్‌ భూములను అక్రమంగా డీ-నోటిఫై చేసినందుకు, భూములను పరాధీనం చేసినందుకు పీవోటీ చట్టంలోని సెక్షన్ల ఆధారంగా కేసులు పెట్టనున్నారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22(ఏ) ఉల్లంఘనకు పాల్పడినందుకు కూడా కేసులు పెడతారు. వేల ఎకరాల భూములను అక్రమంగా డీ-నోటిఫై చేయడంతోపాటు రిజిస్ట్రేషన్‌ చేసినందుకు సంబంధిత సబ్‌రిజిస్ట్రార్లపైనా కేసులు పెట్టనున్నారు. ఇందుకు తొలుత రెండు కేటగిరీల్లో టాప్‌ 10 మండలాల జాబితానే ప్రామాణికంగా తీసుకోనున్నారు.

ఇన్ని లక్షల ఎకరాలా.. సీఎం విస్మయం

సీసీఎల్‌ఏ నివేదిక ప్రకారం.. జగన్‌ జమానాలో 13,59,805 ఎకరాల అసైన్డ్‌, చుక్కల, ఇనాం, షరతుగల పట్టా భూములను నిషేధ భూముల జాబితా 22ఏ నుంచి డీ-నోటిఫై చేశారు. కూటమి ప్రభుత్వం ఆ భూముల రికార్డులను డిప్యూటీ కలెక్టర్ల బృందాలతో పునఃపరిశీలన చేయిస్తోంది. ఇప్పటి వరకు 13.48,254 ఎకరాల భూముల రికార్డుల పరిశీలన జరిగింది. ఇంకా 11,551 ఎకరాల రికార్డుల పరిశీలించాల్సి ఉంది. అసైన్డ్‌ భూముల (బదిలీ నిషేధం-పీవోటీ) చట్టం, జీవో 596, ఇనాం చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా 22ఏ జాబితా నుంచి డీ-నోటిఫై చేసిన భూమి 4,21,433.97 ఎకరాలుగా తేల్చారు. ఈ గణాంకాలను చూసి ముఖ్యమంత్రి నివ్వెరపోయినట్లు తెలిసింది. ‘ఇన్ని లక్షల ఎకరాలను అక్రమంగా డీ-నోటిఫై చేశారా? ఎంత దారుణం’ అని ఆయన విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అసైన్డ్‌ 9,93,285

చుక్కల భూములు 1,94,232

ఇనాం 1,38,846

షరతుగల పట్టా భూమి 33,442

మొత్తం 13,59,805

(ఇందులో అక్రమంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన భూమి 4,21,433.97 ఎకరాలు కాగా.. రిజిస్ట్రేషన్‌ అయిన భూములు 25,284.89 ఎకరాలు. అక్రమంగా రిజిస్ట్రేషన్‌ అయినవి 7,827.82 ఎకరాలుగా సీసీఎల్‌ఏ నివేదించింది)


ప్రజలు అత్యంత ఎక్కువగా ఇబ్బందులు, బాధలు పడేది రెవెన్యూ శాఖ చర్యలతోనే. వారిని తమ చుట్టూ తిప్పించుకోవడం, వేధించడం కొందరు రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారింది. భూముల రికార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడానికి ప్రజలు మీ చుట్టూ ఎందుకు తిరగాలి? ఇంకా మీపైనే ఆధారపడాలా?

తప్పుడు అధికారులు చట్టాల నుంచి తప్పించుకోలేనంతగా వారిపై సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెట్టండి. సర్వీసు రూల్స్‌ ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపండి. తప్పుడు దారిలో నడి చి ప్రభుత్వానికి, ప్రజలకు తీవ్రనష్టం కలిగించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదు.

- సీఎం చంద్రబాబు

అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన టాప్‌-10 మండలాలు..

పెనుకొండ (శ్రీసత్యసాయి జిల్లా), నందలూరు (అన్నమయ్య జిల్లా), వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా), ధర్మవరం (శ్రీసత్యసాయి), వీరబల్లి (అన్నమయ్య), సోమందేపల్లి (శ్రీసత్యసాయి), యేర్పేడు (చిత్తూరు), దోర్నాల (ప్రకాశం), రొద్దం (అనంతపురం), రామాపురం (అన్నమయ్య).

Updated Date - Nov 30 , 2024 | 05:14 AM