CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ నేడే
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:40 AM
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించనున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కార్యక్రమం
దేశానికి రోల్‌మోడల్‌గా ఈ డాక్యుమెంట్: చంద్రబాబు
ప్రజలకు సత్వర సేవలందించాలని
అధికారులకు సూచన
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్‌ఓడీలు అందరూ రావాలని సీఎం ఆహ్వానించారు. ఈ విజన్ డాక్యుమెంట్ దేశానికి ఒక రోల్‌మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. 6 నెలల్లో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని, ఇందులో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ పెరగాలని, ప్రజలకు సత్వర సేవలందించాలని సూచించారు. ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, పరిష్కరించలేకపోతే అందుకు కారణం రాయాలని చెప్పారు. వినూత్నంగా పనిచేసి సంపద సృష్టించాలని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్-6లో మిగిలిన పథకాలను కూడా అమల్లోకి తెస్తామన్నారు. ప్రజలకు సత్వర మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టరేట్లలో రిసెప్షన్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సీఎం చెప్పారు. ఇకనుంచి ప్రతి 1వ తేదీని పేదల సేవ కార్యక్రమానికి, మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు అంకితం చేయాలన్నారు. మంత్రులైనా, అధికారులైనా పని చేయకపోతే ఇంటికి పంపిస్తామని సీఎం హెచ్చరించారు.